మనిషి కాదు... మానసిక భ్రమ!
మిస్టరీ
చంద్రుడిపై మనిషిని పోలిన ఒక ఆకారం కనిపించడం గురించి ఇటీవల హాటు హాటుగా చర్చ జరిగింది. జసెన్కో అనే ఒక వెబ్ యూజర్‌కు గూగుల్‌లో ఈ దృశ్యం కనిపించింది. దీన్ని యూట్యూబ్‌లో పోస్ట్ చేయడంతో గగ్గోలు మొదలైంది.
‘గ్రహాంతరవాసులు ఉన్నారు’ అనడానికి... ఇది తిరుగులేని ఉదాహరణ’
‘గ్రహాంతరవాసి విగ్రహం అది’
‘చంద్రుడిపై ఏదో కుట్ర జరుగుతోంది’
‘భూగ్రహవాసులలాగే చంద్రగ్రహవాసులూ ఉన్నారు’ ఇలాంటి ఎన్నో మాటలు వినిపించాయి.
‘‘అది నీడ కాదు కచ్చితంగా పురాతన విగ్రహం’’ అని కాస్త గట్టిగానే చెబుతున్నాడు టామ్ రోజ్ అనే పారనార్మల్ ఎక్స్‌ప్లెయినర్. ‘ఎగ్జామినర్’ అనే పత్రికలో ఆయన విశ్లేషణాత్మకమైన వ్యాసం కూడా రాశాడు.
ఈ చర్చ ఉధృతిని గమనించిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా స్పందించింది... ‘‘డిజిటల్ ముందు కాలంలో తీసిన ఫొటో అది. ఎలాంటి మురికైనా అంటి ఉండే అవకాశం ఉంది. మనిషిని పోలిన ఆ దృశ్యం... నెగెటివ్ మీది దుమ్ము, మరకలు ఏదైనా కావచ్చు’’ అని ప్రకటించింది.
మరోవైపు మానసిక విశ్లేషకులేమో...
‘పారౌడోలియ’ అన్నారు.
ఇంతకీ ‘పారౌడోలియ’ అంటే ఏమిటి?
‘రోజువారిగా మనం చూసే దృశ్యాల్లో పరిచిత ముఖాలు, ఆకారాలను చూసే మానసిక భ్రమ!’
ఇలా నాసా, మానసిక విశ్లేషకులు స్పష్టమైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ-
‘‘ఆ దృశ్యం గురించి లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది. కొత్త నిజాలు కనిపెట్టాల్సి ఉంది’’ అంటున్నారు ఔత్సాహిక పరిశోధకులు!