అద్దాలకు సెలవు | No need of spectacles anymore | Sakshi
Sakshi News home page

అద్దాలకు సెలవు

Published Wed, Aug 28 2013 1:33 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM

అద్దాలకు సెలవు

అద్దాలకు సెలవు

పదునైన అస్త్రం లేసిక్
లేసిక్... స్థూలంగా చెప్పుకోవాలంటే తీక్షణమైన లేజర్ కిరణాల సాయంతో మన కంటిలోని కార్నియా వంపును సరిదిద్దే సమర్థమైన ప్రక్రియ! అద్దాల బెడద లేకుండా.. దృష్టి దోషాన్ని అధిగమించేందుకు అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక విధానం. అయితే ఈ సర్జరీ చేసే ముందు కొన్ని కీలకమైన అంశాలను పరీక్షించటం అవసరం.
 
 వయసు : 18 పైబడితేనే!
 దృష్టి దోషాల్లో తరచుగా కనబడేది హ్రస్వదృష్టి. దీన్నే వైద్యపరిభాషలో ‘మయోపియా’ అంటారు. ఇది చాలావరకు ఎదుగుదలలో భాగంగానే వచ్చే సమస్య. కంటి ఎదుగుదల, శరీరం ఎదుగుదల ఒకే తీరులో లేకపోవటం వల్ల వీరిలో కాంతి కిరణాలు రెటీనా మీద సరిగా కేంద్రీకృతం కావు. దీనివలన సాధారణంగా వీరు 11-12 ఏళ్ల వయసులోనే అద్దాలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ దృష్టిదోషం 11-15 ఏళ్ల మధ్య వేగంగా పెరుగుతూ.. చాలావరకు 18-20 ఏళ్లు వచ్చేసరికి స్థిరపడుతుంది. అందుకే మయోపియాకు లేసిక్ సర్జరీని 18 ఏళ్లలోపు వారికి చేయరు. ఆ తర్వాత కూడా కనీసం ఏడాది పాటు పవర్ మారకుండా, స్థిరంగా ఉందని నిర్ధారించుకున్నాకే చేస్తారు.
 
 కార్నియా మందం, వంపు రెండూ ముఖ్యం
 లేజర్ చికిత్సకు ముందు కార్నియా మందం, కార్నియా వంపులను గుర్తించే పరీక్షలు తప్పనిసరి. ఈ సర్జరీ ఎవరికి చెయ్యవచ్చు, ఎవరికి చెయ్యకూడదన్నది వీటిని బట్టి స్పష్టంగా తెలుస్తుంది.
 మొదటి కీలక పరీక్ష : కార్నియా మందం (పేకోమెట్రీ) కార్నియా అనేది మన కనుగుడ్డు మీద ఉండే తెల్లటి పారదర్శకమైన పొర. లేసిక్ సర్జరీ గురించి నిర్ణయం తీసుకునే ముందు... ఈ కార్నియా పొర మందం ఎంత ఉందో చూడటం తప్పనిసరి. దీన్ని ‘పేకోమీటర్’ సాయంతో కొలుస్తారు. కార్నియా మందం మనిషిమనిషికీ మారుతుంటుంది. మన భారతీయుల్లో సగటున ఈ మందం 510-520 మైక్రాన్ల వరకూ ఉంటుంది. దీని మందం కనీసం 500 మైక్రాన్లు ఉంటేనే లేసిక్ సమయంలో దీని నుంచి పైపొర (ఫ్లాప్) లేపటానికి వీలుంటుంది. ఫ్లాప్ తీసిన తర్వాత కూడా కింద కార్నియా కనీసం 250-280 మైక్రాన్ల మందం ఉండటం అవసరం. అంతకన్నా తక్కువ మందం ఉంటే మున్ముందు కార్నియా పల్చబడి, ముందుకు తోసుకురావచ్చు. దీంతో లేసిక్ వల్ల తగ్గాల్సిన పవర్ కాస్తా... అంతకుముందుకన్నా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. పైగా వీరు అద్దాలు, కాంటాక్ట్ లెన్స్‌లు వాడినా కూడా దృష్టిలో స్పష్టత ఉండదు. దీన్నే ‘కెరటక్టేసియా’ అంటారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే మందం చూడాలి.
 
 రెండో పరీక్ష : కార్నియా వంపు (టోపోగ్రఫీ)
 కార్నియా పొర వంపు (కర్వేచర్) ఎంత ఉందో చెప్పేది టోపోగ్రఫీ. సగటున ఇది 43-44 డయాప్టర్లు ఉంటుంది. ఒకవేళ ఇది మరీ చదునుగా (40 కన్నా తక్కువగా) ఉంటే.. పైపొర ఫ్లాప్ తియ్యటం కొంత కష్టం. ఇలా ఫ్లాప్ తీసేటప్పుడు అది పూర్తిగా ఊడివచ్చేయచ్చు. తర్వాత దాన్ని స్థిరపరిచేందుకు కాంటాక్ట్ లెన్స్ గానీ, కుట్లు గానీ వేయాల్సి వస్తుంది. అలాగే కార్నియా మరీ వంపుగా ఉబ్బెత్తుగా (47 కన్నా ఎక్కువగా) ఉంటే, వీరికి ఫ్లాప్ తీసేటప్పుడు ఒక్కోసారి దానిలో రంధ్రాలు పడే అవకాశం ఉంటుంది. వీరికి కూడా సర్జరీ కష్టమవుతుంది. లేజర్ చేసినా చూపు మసకగా ఉండే ప్రమాదముంది. అందుకే వంపు పరీక్ష కీలకం.
 
 వంపునకు సంబంధించి మరో కీలక అంశం
 ఎంత చక్కదిద్డగలమనేది!
 పవర్‌ను చక్కదిద్దటానికి కార్నియా వంపు తగ్గించటం కీలకం. ఈ కార్నియా వంపు సుమారు 0.7 డయాప్టర్లు తగ్గిస్తే... పవర్ సుమారుగా 1 తగ్గుతుంది అనుకోవచ్చు. ఉదాహరణకు కార్నియా వంపు 43 డయాప్టర్లు ఉన్న వ్యక్తికి - 10 డయాప్టర్లు తగ్గిస్తే అంతిమంగా వంపు 36 డయాప్టర్లకు వస్తుంది. ఇది ఎవరికైనా సరే.. 35 డయాప్టర్లు కంటే తక్కువ ఉంటే దృష్టి బాగుండదు. కాబట్టి వంపు తక్కువగా ఉన్నవాళ్లకు లేసిక్ చెయ్యటం వల్ల ఇబ్బందులు  వస్తాయి. అయితే ఇలాంటి వారికి కంటిలోనే అమర్చే కాంటాక్స్ లెన్సులు (ఇంప్లాంటబుల్ కాంటాక్ట్ లెన్స్‌లు - ఐసీఎల్) వంటి ఇతరత్రా మార్గాలు బాగా పనికొస్తాయి.
 
 మరీ పల్చబడిందా? అదీ చూడాలి!
 గట్టిగా కళ్లను రుద్దే అలవాటు నుంచి రకరకాల కారణాల రీత్యా కొందరిలో కార్నియా పొర పల్చగా అయిపోయే అవకాశం ఉంటుంది. దీన్నే ‘కెరటోకోనస్’ అంటారు. లేసిక్ సర్జరీ చేసే ముందు ఈ సమస్య లేదని కచ్చితంగా నిర్ధారించుకోవటం చాలా అవసరం. ఇది  టోపోగ్రఫీ పరీక్షలోనే తెలుస్తుంది. ఒకవేళ ఈ సమస్య ఉందని అనుమానంగా ఉంటే..  కొంతకాలం తర్వాత మళ్లీ పరీక్షించి చూస్తారు.
 
 అన్నీ కలిపి... ఆర్బ్‌స్కాన్ !
 అన్నింటినీ కలిపి... ఇప్పుడు ‘ఆర్బ్‌స్కాన్’ అనే పరీక్ష చేస్తారు. దీనిలో  కార్నియా మందం, వంపులే కాకుండా.. కార్నియాకు ముందువైపు ఉపరితలం, వెనకవైపు ఉపరితలం ఎలా ఉంది? అన్నదీ తెలుస్తుంది. ఎవరికైనా కంట్లో కార్నియా పల్చబడే ‘కెరటోకోనస్’ మార్పులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నా దీనిలో తెలుస్తుంది.
 
 ఇంకా ఏమేం పరీక్షలు ?
 కంట్లో నీటి ఉత్పత్తి ఎలా ఉందన్నదీ కీలకమే. దీనికి ‘షిర్మర్స్ టెస్ట్’ చేస్తారు. ఎటువంటి మత్తు చుక్కలూ వెయ్యకుండా కంట్లో 5 నిమిషాల పాటు ప్రత్యేకమైన పేపర్ స్ట్రిప్పులు పెడితే అది కనీసం 15 ఎం.ఎం వరకూ నీటిని పీల్చుకోవాలి. ఇది తక్కువ ఉంటే కళ్లు పొడిబారే (డ్రై ఐస్) సమస్య ఉందని అనుమానించాలి. ఇదెందుకు కీలకమంటే  కార్నియా నుంచి పైపొర (ఫ్లాప్) లేపినప్పుడు, లేజర్ చేసినప్పుడు అక్కడ నాడులు దెబ్బతింటారుు. ఇవి పునరుత్తేజమయ్యేందుకు 36 నెలలు పడుతుంది. అంతకాలం కంట్లో కొంత పొడిదనం (డ్రెనైస్) ఉంటుంది. తీవ్రమైన డ్రైఐస్ సమస్య ఉంటే (23 ఎంఎం ఉంటే)  పొడిదనం ఎక్కువై దృష్టి మరీ ఇబ్బందిగా ఉండే ప్రమాదం ఉంది. అందుకని కంట్లో నీటి ఉత్పత్తి చూసి, అది మరీ తక్కువగా ఉంటే కొంతకాలం మందులు వాడి, కన్నీటి ఉత్పత్తిని పెంచి... అప్పుడు లేసిక్ చేస్తారు.
 
 దీర్ఘకాలంగా కాంటాక్స్ లెన్సులు వాడేవారికి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, షోగ్రెన్స్ వంటి సమస్యలున్న వారికి కళ్లు పొడిబారే సమస్య ఉండొచ్చు. కాబట్టి వీరి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అలాగే నిద్రలో కనురెప్పలు పూర్తిగా మూయకుండా ఉండిపోయే (లెగాప్థాల్మాస్) వారికి... పొడిగా ఉండటమే కాదు.. వీరిలో ఫ్లాప్ మానకుండా దెబ్బతిని పోయే ముప్పూ ఉంటుంది. కాబట్టి నీటి ఉత్పత్తి పరీక్ష తప్పనిసరి.
 
 తర్వాతి పరీక్ష... ఆబరోమెట్రీ
 కంట్లో కిరణాలన్నీ ఒకేచోట కేంద్రీకృతం కాకపోవటాన్ని ‘ఆబరేషన్స్’ అంటారు. ఇవి రకరకాల స్థాయిల్లో ఉంటాయి. లేసిక్ సర్జరీలో కార్నియాను బల్లపరుపుగా చేస్తే ఇవి మరింతగా పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే చాలా ఎక్కువ పవర్ ఉండి, ఈ ఆబరేషన్స్  కూడా ఎక్కువగా ఉండేవారికి లేసిక్ చేస్తే రాత్రిపూట చూపులో స్పష్టత, ముఖ్యంగా  ‘కాంట్రాస్ట్’ సరిగా ఉండకపోవచ్చు. (గ్లేర్, హేలోస్) అందుకని ముందే ఈ ఆబరేషన్స్‌ను కొలుస్తారు. దీని ప్రకారం లేసిక్ సమయంలో పవర్ తగ్గించటంతో పాటు వీటిని కూడా చక్కదిద్దుతారు. దీన్నే ‘కస్టమైజ్డ్ ట్రీట్‌మెంట్’ అంటారు.
 
 కంట్లో ఒత్తిడి... అదీ చూడాలి
 ఇప్పటికే నీటికాసుల (గ్లకోమా) సమస్య ఉన్నవారికి కంట్లో పీడనం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివారికి ‘లేసిక్’ చెయ్యటం వల్ల ఇబ్బందులు ఉండొచ్చు. ఫ్లాప్ తీసే సమయంలో కంట్లో పీడనం మరింత పెరగొచ్చు. ఈ పీడనం మూలంగా అప్పటికే దృష్టినాడి దెబ్బతిని ఉంటే... సర్జరీ తర్వాత పీడనం పెరిగి సమస్య ముదరొచ్చు. అందుకని సర్జరీకి ముందు కంట్లో పీడనం ఎంత ఉందన్నది కూడా కొలుస్తారు. (ఇలాంటి వారికి లేసిక్ కంటే పీఆర్‌కే మేలు కావచ్చు)
 ఎవరికి ఏది ?
 
 కార్నియా మందం 500 కంటే ఎక్కువ ఉంటే లేసిక్ చెయ్యచ్చు. ఇలా మయోపియా 8,  9 వరకూ సరిచెయ్యచ్చు. అదే ప్లస్ పవర్ అరుుతే +4, +5 వరకు కూడా సరిచేస్తారు. కార్నియా మందం కొద్దిగా తక్కువున్నా.. 460-500 మధ్య ఉండి, -4, -5 పవర్ వరకు కూడా ‘పీఆర్‌కే’ చెయ్చచ్చు.
 
 గర్భిణులు, పాలిచ్చే తల్లుల్లో హార్మోన్ల మార్పుల వల్ల కార్నియా మందం, వంపు మారుతుంటాయి. అందుకే పాలివ్వటం ఆపేసిన మూడు నెలల వరకూ కూడా లేసిక్  చెయ్యరు.
 
 లేసిక్ ఎలా చేస్తారు?
  ముందుగా మత్తు కోసం కంట్లో చుక్కల మందు వేస్తారు. దీంతో నొప్పి తెలియదు.
  అనంతరం మైక్రోకెరటోమ్ అనే పరికరంతో కార్నియా పైపొరను గుండ్రంగా కత్తిరించి...  ఆ ఫ్లాప్‌ను కాస్త పైకి లేపి... పక్కకు తీసి జరుపుతారు. ఇటీవలి కాలంలో  ఈ పొర కత్తిరించి ఫ్లాప్ తియ్యటానికి ఈ పరికరాలు, బ్లేడ్ వాడాల్సిన అవసరం లేకుండా ‘ఫెమటో సెకండ్ లేజర్’ అనేది అందుబాటులోకి వచ్చింది. ఈ లేజర్ సహాయంతో ఫ్లాప్ లేపుతారు. లేజర్‌తో మరింత కచ్చితత్వంతో ఫ్లాప్ తియ్యటం సాధ్యపడుతుంది కాబట్టి కార్నియా వంపు ఎక్కువ తక్కువలున్న వారికి దీనితో మరింత ప్రయోజనకరం.
 
  పొర తీసి పక్కకు జరిపిన తర్వాత ఆ కింది భాగం వంపును అవసరమైన మేరకు లేజర్‌తో బల్లబరుపుగా సరిచేసి, ఆ తర్వాత పక్కకు జరిపిన పొరను యథాస్థానంలో వెనక్కి జరిపేస్తారు. దాన్ని పొడిగా చేసి, యాంటీబయాటిక్ చుక్కల మందులు ఇస్తారు. ఒకటి రెండు రోజులు విశ్రాంతి, నిద్ర అవసరం.
 
 ఈ సర్జరీ చేసిన 2, 3 గంటల్లోనే పైపొర సర్దుకుంటుంది. ఒకటి రెండు గంటల పాటు కంట్లో చికాకుగా ఉండొచ్చు. ఆ తర్వాత తగ్గిపోతుంది. దాదాపు మర్నాటికే చూపు సాధారణ స్థితికి వచ్చేస్తుంది.
 
 కన్ను రుద్దకుండా ఉండేందుకు పైన రక్షణగా ‘షీల్డ్’ పెడతారు. మర్నాటి నుంచి యాంటీ బయాటిక్స్, స్టిరాయిడ్స్, కృత్రిమ కన్నీటి చుక్కల మందులు ఇస్తారు. కంటికి ఒత్తిడి తగలకుండా ఒక వారం పది రోజులు జాగ్రత్త తీసుకోవటం, ముఖం కడుక్కునేటప్పుడు కంట్లో నీరు పోకుండా చూసుకోవటం ముఖ్యం. ఇలా రెండు కళ్లకూ ఒకేసారి లేసిక్ చేస్తారు.
 
 పీఆర్‌కే ... పీఆర్‌కే అంటే ‘ఫోటో రిఫ్రాక్టివ్ కెరటెక్టమీ (పీఆర్‌కే)’. కార్నియాలో ఐదు పొరలుంటాయి. పైపొరను ఎపిథీలియం అంటారు. దీని మందం అంతా ఒకే తీరులో ఉండదు. అసమంగా ఉండే ఈ పైపొరను తొలగించి, మిగతా భాగానికి లేజర్ చేసి, జీరో పవర్ కాంటాక్ట్ లెన్స్ అమరుస్తారు. 3-4 రోజుల్లో అంతా సర్దుకుంటుంది. అప్పుడు కాంటాక్ట్ లెన్సు తీసేస్తారు. 7-8 రోజుల్లో చూపు స్పష్టత వస్తుంది. ఇలా -4 నుండి -6 వరకూ పవర్ ఉన్నవారికి పీఆర్‌కే బాగా ఉపయోగపడుతుంది. అంతకన్నా ఎక్కువ పవర్ ఉన్నప్పుడు పీఆర్‌కే చేస్తే పవర్ తిరిగి రావొచ్చు. కొందరిలో చూపు మసకబారొచ్చు (హేజ్). కాబట్టి ఎవరికి ఏది బాగా ఉపయోగపడుతుందన్నది నిర్ధారించటం ముఖ్యం.
 ఫలితాలు
     పవర్ ఏమాత్రం లేకుండా, అద్దాల అవసరం లేకుండా చెయ్యటం లక్ష్యం. చాలామంది విషయంలో దీన్ని సాధించొచ్చు. కొన్నిసార్లు మాత్రం కొద్దిగా పవర్ మిగలొచ్చు. ముఖ్యంగా -1 నుంచి -6 వరకు ఫలితాలు ఆశించినట్టే ఉంటాయిగానీ అంతకుమించి ఎక్కువ పవర్ సరిదిద్దాలని చూసినప్పుడు కొద్దిగా పవర్ మిగలొచ్చు. అవసరమైతే మూడు వారాల తర్వాత మరోసారి లేసిక్‌తో సరిచెయ్యెచ్చు.
     కన్ను పొడిబారే (డ్రైనెస్) సమస్య రావచ్చు. దీన్ని ముందే అంచనా వేస్తారు. కాబట్టి కృత్రిమ కన్నీటి చుక్కల వంటివి 2,3 నెలల పాటు ఇస్తారు.
     పవర్ తిరిగి వచ్చేస్తుందా? అన్నది పెద్ద అనుమానం. కార్నియా మందం బాగుంటే సాధారణంగా పవర్ తిరిగి రావటమన్నది ఉండదు. పల్చటి కార్నియాలు, కెరటోకోనస్ వంటి సమస్యలున్న వారికి పవర్ తిరిగి వచ్చే అవకాశం ఎక్కువ, అందుకే ముందుగానే స్క్రీనింగ్ కచ్చితంగా చెయ్యటం అవసరం.
 మొత్తానికి... కార్నియా పొరమీద ఫ్లాప్ తీసేందుకు మైక్రోకెరటోమ్, ఫెమటోసెకండ్  లేజర్ వంటివి మరింత కచ్చితత్వాన్ని సంతరించుకోవటం, కార్నియా పట్ల అవగాహన పెరగటం, రాబోయే దుష్ర్పభావాలను ముందుగానే ఊహించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం... ఏది ఎవరికి సరైనదో నిర్ధారించటం.. వీటన్నింటి కారణంగా ఇప్పుడు లేసిక్ సర్జరీ చాలా సురక్షితమైనదిగా ఆవిర్భవించిందని చెప్పొచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement