ఆదిలాబాద్: పదిరోజుల వ్యవధిలో మండలంలోని డోంగర్‌గామ్ గ్రామపెద్దలు మడావి దేవ్‌రావ్, గ్రామపటేల్ పెందోర్ బాదుపటేల్ కంటిచూపు పోగా గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. 10రోజుల క్రితం గ్రామానికి చెందిన మడావి దేవ్‌రావ్ కంటిచూపు కోల్పోయాడు. అతడి కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా కేంద్రంలోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించినా చూపు రాలేదు.
నాలుగు రోజుల క్రితం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించినా ఫలితం లేకపోయింది. బుధవారం రాత్రి ఉన్నట్టుండి గ్రామపెద్ద, గ్రామపేటల్ పెందోర్ బాదుపటేల్ కంటిచూపు పోయింది. పదిరోజుల వ్యవధిలో ఇద్దరు గ్రామపెద్దల చూపు పోవడంతో గ్రామ ఆదివాసీలు భయాందోళనకు గురవుతున్నారు.
కాగా, 40రోజుల క్రితం ఓ ప్రజాప్రతినిధి డోంగర్‌గామ్ గ్రామాన్ని సందర్శించాడు. గ్రామ పొలిమేరలోని హనుమాన్ విగ్రహానికి బంగారు కళ్లు చేయిస్తానని అప్పటికే ఉన్న వెండికళ్లు తీసుకువెళ్లాడు. బంగారు కళ్లు చేయిస్తానన్న సదరు ప్రజాప్రతినిధి జాప్యం చేయడంతోనే గ్రామపెద్దలు వరుసగా చూపు కోల్పోతున్నారని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు దృష్టి సారించి కంటిచూపు కోల్పోతున్న వారిని పరీక్షించి చూపు వచ్చేలా చూడాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment