క్రియల మూలంగా కాదు... | Not because of works ... | Sakshi
Sakshi News home page

క్రియల మూలంగా కాదు...

Published Sat, Jan 16 2016 10:46 PM | Last Updated on Fri, Nov 9 2018 6:22 PM

క్రియల మూలంగా కాదు... - Sakshi

క్రియల మూలంగా కాదు...

విశ్వాసం వల్లే నీతిమంతులమవుతాము
సువార్త
 
విశ్వాసం ఒక వ్యక్తి ఆంతర్య ఆధ్యాత్మిక అనుభవం. క్రియలు ఒక వ్యక్తి యందలి విశ్వాసానికి అంటే ఆధ్యాత్మిక అనుభవానికి బాహ్య నిదర్శనాలు లేక ప్రతిబింబాలు. ఈ రెండింటికి మధ్య చాలా సున్నితమైన అంశం స్పష్టమవ్వాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి మంచి పనులు చేస్తున్నాడు గనుక అతడు మంచివాడా? లేక ఒక వ్యక్తి మంచివాడు కాబట్టి అతడు మంచి పని చేస్తున్నాడా? అన్న ప్రశ్నలో ఈ అంశానికి జవాబు దాగి ఉన్నది. క్రియలు ఒక వ్యక్తిని మంచివానిగా చేయవు. ఒకవేళ మంచివాడు అనే గుర్తింపు ఇవ్వవచ్చు. కాని ఒక్క క్రియ మాత్రమే మనిషి మంచికి ప్రామాణికత కాదు. కొండమీది ప్రసంగంగా అత్యంత ప్రాచుర్యం పొంది, అనేకులను ప్రభావితం చేసిన యేసుప్రభువు బోధలో మన ప్రతి క్రియకు ఉండవలసిన ఆధ్యాత్మిక ఉద్ధేశాన్ని, దృక్పథాన్ని బహు ఖండితముగా ప్రభువు బోధించెను (మత్తయి 5,6,7). ‘‘మనుష్యులు మీ సత్‌క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు వారి యెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి’’ అంటూ మనం చేయవలసిన సత్‌క్రియలను ప్రోత్సహించారు.

మనం దేవుని ప్రార్థించినా పరులకు ఉపకార ధర్మం చేసినా, దేవునికి మనం అర్పణ చెల్లించినా, ఆత్మశుద్ధి కోసం ఉపవాసముండినా, కరుణించినా క్షమించినా ఇతరులకు కనబడటం కోసం ఉద్దేశించిన క్రియగా ఉండరాదు. ఒకవేళ అలా ఉంటే అది వేషధారణే అవుతుంది తప్ప, అట్టి వాటి వలన ఏ ఫలితం ఉండదని ప్రభువైన యేసు తేటగా బోధించారు. మన క్రియల విషయంగా మనకున్న తప్పుడు భ్రమను గూర్చి ప్రభువు హెచ్చరిక చేస్తున్నాడు. ‘‘క్రియల మూలమున గాక క్రీస్తు నందలి విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చబడుదుము’’ అని పరిశుద్ధ పౌలు (గలతీ 2:16) పేర్కొన్నారు.

అయితే ప్రభువు యొక్క శిష్యుడు యాకోబు తన రచనలో ‘‘క్రియలు లేని విశ్వాసము మృతము’’ అంటూ మన విశ్వాసం మన క్రియల మూలముననే వ్యక్త పరచబడవలసి ఉంది అని (యాకోబు 2:17) తెలియజేశాడు. అవును, ఈనాడు మన మతాలు భక్తి విశ్వాసాలు అన్నవి క్రియలేని ఆచరణలేని వ్యక్తిగత వ్యాపకాలుగా మారాయి. ఆచారాలనే గాని ఆచరణలకు నోచుకోలేకపోన్నాయి. మానవత్వపు స్పర్శ సృహలేని మత విన్యాసాలుగా తయారయ్యాయి. మదర్ థెరిస్సా అంటుండేవారు ‘‘ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసే చేతులే మిన్న’’ అని. క్రియ లేని విశ్వాసం, విశ్వాసం లేని క్రియ రెండూ అనర్థాలే. వీటి రెండింటిని వేరు వేరుగా కాక, విశ్వాసము క్రియలు అను ఈ రెండింటి సమ్మేళనం, సమ్మిళితం, సమల్యంతో కూడిన జీవనశైైలిని అలవర్చుకొందాం. క్రియలతో కూడిన విశ్వాస జీవితమే మనల్ని స్వచ్ఛమైన ఆధ్యాత్మిక పరిపూర్ణత దిశ వైపు నడిపిస్తుంది.

ఒక రోజున ధనవంతుడైన యవ్వనస్థుడు యేసుప్రభువు దగ్గరకు వచ్చి ‘నిత్యజీవానికి వారసుడవడానికి నేను ఏ మంచి కార్యం చేయాలి?’ అని అడిగాడు. అప్పుడు ప్రభువు నీకు ఒకటి కొదువుగా ఉన్నది ‘‘నీకు కలిగినదంతయు అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించుము’’ అని సెలవిచ్చాడు. అందుకు ఆ యవ్వనస్థుడు తను మిగుల ఆస్తి గలవాడు గనుక దానిని విడిచిపెట్టలేక దుఃఖముఖుడై వెళ్ళిపోయాడు. సత్క్రియ అనగా మత నిష్టాగరిష్టులు కాదు, దానధర్మాలే కాదు, వ్యామోహాలు విడనాడి దేవునిపై స్వచ్ఛమైన విశ్వాసంతో ఆయనను పూర్ణ మనస్సుతో వెంబడించు జీవన విధానం.
 
మనం దేవుని ప్రార్థించినా పరులకు ఉపకార ధర్మం చేసినా, దేవునికి మనం అర్పణ చెల్లించినా, ఆత్మశుద్ధి కోసం ఉపవాసముండినా, కరుణించినా క్షమించినా ఇతరులకు కనబడటం కోసం ఉద్దేశించిన క్రియగా ఉండరాదు.
 
- రెవ.పి. ఐజక్ వరప్రసాద్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement