
అనుకున్నవన్నీ జరగకపోవటమూ అదృష్టమే!
మన పురాణాల్లో ఉన్న సువర్ణష్ఠీవి కథ పాశ్చాత్యదేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న మిడాస్ కథ అందరికీ తెలిసిందే కదా! వారికి లభించిన అపురూపమైన సిద్ధి వారికే దుఃఖకరంగా పరిణమించింది. భస్మాసురుడి వృత్తాంతం కూడా అంతే!
మనం అనుకున్నది జరిగితే సంతోషిస్తాం. అదంతా మన ఘనత అని విర్రవీగుతాం. జరగకపోతే బాధపడుతూ ఉంటాం. అదేదో దేవుడి తప్పు, ద్రోహం చేశాడని నెపం దేవుడి మీద వేస్తూ ఉంటాం. కాని ఎన్నో సందర్భాలలో ‘అలా జరగకపోవటం వలన మంచే జరిగింది’ అని కొంతకాలం పోయిన తరువాత అర్థం అవుతుంది. ఎన్నోసార్లు కోపంతోనో, అనాలోచితంగానో ఏవేవో అనుకుంటూ ఉంటాం. అవన్నీ నిజమైతే..? ఉదాహరణకి తమకి నచ్చనిది చూడవలసి వచ్చినా, వినవలసి వచ్చినా చూడలేక లేదా వినలేక చచ్చిపోతున్నాం అనటం చాలామందికి అలవాటు, అది నిజమైతే..? ప్రతివారు ఏదో ఒక సందర్భంలో ఈ బతుకు బతికే కన్నా చావటం నయం అనుకుంటారు. అటువంటప్పుడు అనుకున్నది సిద్ధిస్తే..?
‘ఎందుకు రాలేదు?’ అని అడిగితే, చాలామంది ఒంట్లో బాగుండలేదు, తలనొప్పిగా ఉంది. జ్వరం కూడా ఉన్నట్లు అనిపిస్తోంది.... ఇటువంటి వెయ్యి కారణాలుంటాయి చెప్పటానికి. వీటిలో ఏ ఒక్కటి నిజమైనా మనిషి తట్టుకోగలడా? మనిషిలో ఉన్న మనో చాంచల్యం నాలుకని అదుపులో పెట్టుకోలేకపోవటం, తెలివితక్కువతనం, దూరాలోచన లేకపోవటం, ఉద్రేకపూరిత స్వభావం మొదలైన గుణాలు తెలిసిన భగవంతుడు... మానవులు ఏది అనుకుంటే అది నిజం కాకుండా వరం ఇచ్చాడు.
ఎండవేడిమికి తట్టుకోలేక అలసిపోయిన బాటసారి ఒకడు, దారిపక్కన ఉన్న చెట్టుకింద నిలబడ్డాడు. అది కల్పవృక్షమని అతడికి తెలియదు. ఆవేదనపడుతూ దాహంతో నాలుక పిడచకట్టుకుపోతోంది. ఇక్కడ కాసిన్ని మంచినీళ్లు దొరికితే బాగుండును... అనుకున్నాడు. దాహం తీరటంతో ఆకలి గుర్తుకు వచ్చింది. వెంటనే కావలసిన ఆహారం ప్రత్యక్షమయ్యింది. కడుపునిండి కళ్లు మూత లు పడుతున్నాయి. కాసేపు విశ్రాంతిగా పడుకుంటే బలం పుంజుకుని తరువాత ప్రయాణం తేలికగా చేయవచ్చుననుకున్నాడు. హంసతూలికా తల్పం కంటి ముందు కనపడింది. ఈ అడవిలో ఒక్కణ్ణీ ఉండే కన్నా ఎవరైనా తోడుగా ఉంటే బాగుండుననుకున్నాడు. వెంటనే అప్సరసలాగ ఉన్న సుందరి పక్కన కూర్చుని మధురంగా నవ్వుతూ పలకరించింది. అవసరాలు తీరటంతో ఆలోచన వచ్చింది. ‘నా మనసులో అనుకున్నవన్నీ ఈ అడవిలో ప్రత్యక్షమవుతున్నాయి. ఏ దెయ్యమో నన్ను తినేయటానికి ఇదంతా చేయటం లేదు కదా’ అనుకున్నాడు. ఆలోచన రావటమేమిటి? అనుకున్నంతా క్షణాల్లో జరిగిపోయింది.
అంటే సదాలోచనలు, సద్భావాలు లేనప్పుడు విచక్షణాశక్తి, మనోనిగ్రహం లోపించినప్పుడు ఇటువంటి శక్తి ఉంటే ప్రమాదకారకమే అవుతుంది. కనుక అనుకున్నవన్నీ జరగకపోవటమే మంచిది.
ఈ సందర్భంలో అనుకున్నది అనుకున్నట్టు జరగటానికి కారణం బాహ్యమైనది. అటువంటిది ఆ శక్తి మనిషికి ఉంటే..? ప్రతిక్షణం తన మనస్సులో మంచి ఆలోచనలు మాత్రమే వచ్చేటట్టు మనస్సుకి శిక్షణ ఇవ్వాలి. లేకపోతే అది అతడికే ప్రమాదకారి అవుతుంది. సద్వినియోగం చెయ్యగలిగినవారి వద్ద మాత్రమే ఏ శక్తి అయినా, ఏ సిద్ధి అయినా ఉంటే ప్రయోజనం. దాని విలువ, వినియోగం రెండూ తెలియని వారి దగ్గర ఉంటే, ప్రమాదం- ఇతరులకే కాదు తమకు కూడా. మన పురాణాల్లో ఉన్న సువర్ణష్ఠీవి కథ పాశ్చాత్యదేశాల్లో ప్రాచుర్యం ఉన్న మిడాస్ కథ అందరికీ తెలిసిందే కదా! వారికి లభించిన అపురూపమైన సిద్ధి వారికే దుఃఖకరంగా పరిణమించింది. భస్మాసురుడి వృత్తాంతం కూడా అంతే. అందుకే మనం అనుకున్నవన్నీ జరగవు. జరగకూడదు. నిజానికి అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే జీవితంలో థ్రిల్ ఉండదు. అయినా మనిషి తెలివి, సామర్థ్యం ఏ పాటివి? అందుకే అనుకున్నవన్నీ జరగకపోవటం అదృష్టం కదూ!
- డా.ఎన్. అనంతలక్ష్మి