ఆ రాజుది ఇక్ష్వాకువంశం. పేరు హరిశ్చంద్రుడు. ఆయనకు అన్నీ ఉన్నాయి కానీ సంతానం ఒక్కటే లేదు. దాంతో మునులు, కుల గురువుల సలహా మేరకు వరుణుడిని బహుకాలం ఉపాసించాడు. వరుణుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. సంతానం కావాలన్నాడు హరిశ్చంద్రుడు. ‘‘ఓ రాజా! పురాకృత పాపకర్మల వల్ల నీకు సంతానయోగం లేదు. అయితే, ఒక్క షరతు మీద నీకు సంతానాన్ని ప్రసాదిస్తాను. అందుకు అంగీకరిస్తావా మరి?’’ అని అడిగాడు వరుణుడు. సంతానం ప్రాప్తిస్తోందన్న సంతోషంతో ముందు వెనుకలు ఆలోచించకుండా ‘‘స్వామీ! మీరు నిబంధన విధించడం, నేను అతిక్రమించడమూనా!? సెలవివ్వండి, తప్పక చేస్తాను’’ అన్నాడు హరిశ్చంద్రుడు. ‘‘నీ కోరిక తక్షణం నెరవేరుతుంది. ఇప్పుడు విను నా నిబంధన. నీకు సంతానం కలిగిన వెంటనే తీసుకు వచ్చి, నాకు అప్పగించాలి. అదే నా షరతు’’ అన్నాడు వరుణుడు. ఖిన్నుడయ్యాడు హరిశ్చంద్రుడు. ఇదెక్కడి న్యాయం? సంతానం కోసమే కదా నేను కఠోర తపస్సు చేసిందీ, ప్రసన్నుడిని చేసుకున్నదీ. ఇప్పుడు ఆ సంతానాన్ని ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ తిరిగి వెనక్కి తీసుకుంటానంటాడేమిటి? అయినా, ముందు సంతానం కలగనీ, అప్పుడు చూద్దాం’’ అనుకుని సరేనన్నాడు హరిశ్చంద్రుడు.
అయితే ఆ కొడుకును, వరుణయజ్ఞంలో వరుణుడికే బలి చేస్తానని ముందు ఒప్పుకొన్న హరిశ్చంద్రుడు, పుత్ర ప్రేమ వల్ల ఆ బలిని వాయిదా వేస్తూ వెళతాడు. చివరికి తన పుత్రుడి బదులు డబ్బుతో కొనుక్కొన్న శునశ్సేపుడు అనే క్షత్రియ పుత్రుడిని బలి చేయటానికి సిద్ధపడతాడు. శునశ్సేపుడు తనకు విశ్వామిత్రుడు ఉపదేశించిన వరుణ మంత్రం జపించి, వరుణుడిని ప్రసన్నం చేసుకొంటాడు. వరుణుడు చివరకు ఏ బలీ లేకుండానే హరిశ్చంద్రుడికి వరుణ యజ్ఞఫలం ప్రసాదించి అనుగ్రహిస్తాడు. అయితే తాను అసత్యం చెప్పడం వల్లే కదా, ఇంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనది.. కాబట్టి ఇకముందు ఎన్నడూ అసత్యం ఆడకూడదు. సత్యమే చెప్పాలి అని మనసులో బలంగా నిశ్చయించుకుంటాడు. అప్పటినుంచి అన్న మాటకు కట్టుబడి ఉండటంతో హరిశ్చంద్రుడు అసలు అబద్ధం చెప్పడు, అలా హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడు అవుతాడు. (ఈ కథ ఋగ్వేద బ్రాహ్మణంలోనూ, కొన్ని మార్పులతో దేవీ భాగవత పురాణంలోనూ కనబడుతుంది)
– డి.వి.ఆర్.
Comments
Please login to add a commentAdd a comment