తప్పతాగి... తప్పు చేసి
‘‘తిరిగే కాలు అరిచే నోరూ మాత్రమేనా దొంగిలించే చేయి కూడా ఊరకే ఉండదు’’ అని నిరూపించారా దొంగలు. రోమన్లు భగవంతుడిగా కొలిచే పురాణ పురుషుడైన నెప్ట్యూన్ ఒక చేతిలో త్రిశూలం తరహా ఈటెతో ఫౌంటైన్‌పైన కూర్చుని ఉన్న అద్భుతమైన శిల్పం ఇంగ్లండ్‌లోని గ్లూసెస్టర్‌షైర్, షెల్తెన్హామ్ సిటీలో ఉంది. 1893లో డిజైన్ చేసిన ఈ స్టాట్యూ ఆఫ్ నెప్ట్యూన్ అక్కడి ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లలో ఒకటి. అంతటి ఘన నేపథ్యం ఉన్న విగ్రహం చేతిలోని త్రిశూలాన్ని డిసెంబరు 21న దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో ఆ సుందర శిల్పం అంద విహీనంగా మారింది.
దొంగల కోసం గాలింపు కొనసాగుతుండగానే... కొన్ని రోజులకు... పోయిన ఆ త్రిశూలం పెయిన్స్విక్ గార్డెన్‌లో దొరికింది ‘‘అతిగా మద్యం సేవించి అనుకోకుండా ఈ దొంగతనం చేశాం. మమ్మల్ని క్షమించండి’’అని దానికి అతికించి ఉన్న కాగితం మీద రాసిపెట్టి మరీ చక్కాపోయారట. ‘‘గిల్లి జోలపాడారు సరే ఇప్పుడు మరమ్మతు ఖర్చు ఎవరిస్తారే’’ అంటూ అధికారులు హంకరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడా విగ్రహానికి కలిగిన నష్టాన్ని పూడ్చాలంటే 5వేల పౌండ్లు దాకా ఖర్చు అవుతుందంట మరి.