ఉడికిన అప్పులు | now a days all All debts! | Sakshi
Sakshi News home page

ఉడికిన అప్పులు

Published Mon, Dec 26 2016 11:24 PM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM

ఉడికిన అప్పులు

ఉడికిన అప్పులు

రెండు జన్మలు ఎత్తినా వర్కవుట్‌ కాలేదు!
ఎంత కష్టపడినా, ఎంత వేడి పుట్టించినా పప్పులు ఉడకలేదు.
సారీ... స్మాల్‌ కరక్షన్‌... ఎంత కష్టపడినా
చేసిన అప్పులు ఉడకలేదు!
కానీ ఒక జన్మ ముందుకెళ్లి చూస్తే...
పప్పులేం కర్మ! పాయసాలు, పూర్ణాలు కూడా ఉడుకుతున్నాయి.
అక్కడ దొరికింది కిటుకు.
ఫ్యూచర్‌ కిటికీలో కనపడిన ఆ కిటుకే.. ఈ కథ.
పాజిటివ్‌గా ఆలోచిస్తే... అప్పులు ఉడుకున్‌!


కిటికీలో నుంచి ఎండ ముఖం మీద పడి చుర్రుమనేసరికి గిరిధర్‌కి మెలకువ వచ్చింది. లేచి చుట్టూ చూశాడు. ఎప్పుడు పడుకున్నాడో... ఎలా నిద్రపట్టిందో..? టైమ్‌ చూస్తే పది దాటిపోయింది. ఎక్కడా చడీ చప్పుడు లేదు. రోజూ ఉదయం పిల్లల అల్లరి, సౌమ్య హడావిడి ఉండేవి. ఇప్పుడవేమీ లేవు. ఇక ముందు ఉండవు. ఈ ఆలోచన రాగానే గిరిధర్‌కి నవనాడులూ కుంగిపోయినట్టు అనిపించింది. సౌమ్య, కొడుకు ఆనంద్‌ వెళుతూ వెళుతూ తననో రాక్షసుడిలా చూశారు. ఆ చూపే భరించరానిదిగా ఉంది. తలకు చేతులు పెట్టుకొని చిన్నపిల్లవాడిలా ఏడుస్తూ కూర్చుండిపోయాడు.

అన్నీ అప్పులే!
గిరిధర్‌కి నలభై ఏళ్లుంటాయి. భార్య సౌమ్య, ఇద్దరు పిల్లలు. ప్రైవేట్‌ ఉద్యోగం. పెద్ద హంగూ ఆర్భాటాలు లేకుండా రోజులు గడిచిపోతున్నాయి. ఇంటి అద్దె, ఖర్చులకే చాలీచాలని జీతంతో ఎన్నాళ్లు ఈ అవస్థలు అనుకోని రోజు లేదు. అనుకోకుండా చిన్ననాటి స్నేహితులు వర్మ, కుమార్‌లు కలిశారు. తాము బిజినెస్‌ మొదలు పెట్టనున్నామనీ, కలిస్తే బిజినెస్‌లో వాటా ఇస్తామనీ అన్నారు. గిరిధర్‌కి ఈ ఆలోచన బాగా నచ్చింది. కానీ, అంత డబ్బు తన వద్ద లేదు. బ్యాంకులో పర్సనల్‌ లోన్‌ తీసుకున్నాడు. తెలిసినవారి వద్ద అప్పు తీసుకుని వ్యాపారంలో పెట్టాడు. జాబ్‌ మానేశాడు. ఓ రోజు కష్టాల్లో ఉన్నాననీ, రెండు నెలల్లో డబ్బులు ఇచ్చేస్తాననీ, ఎలాగైనా డబ్బులు సర్దమనీ ఇంటికి వచ్చాడు తమ్ముడు. భార్యను అడిగి ఆమె నగలు తాకట్టు పెట్టి మరీ, తమ్ముడికి డబ్బులు ఇచ్చాడు.

నష్టాలు తెచ్చిన కష్టం!
వ్యాపారంలో డబ్బులు పోయడమే తప్ప, తిరిగి వచ్చింది లేదు. కంపెనీని నష్టాల్లో నడపడం కష్టమని ఆరునెలల్లోనే తేలింది. అయినా ఆశ చావక అందినకాడల్లా అప్పులు చేసి వ్యాపారంలో పెట్టారు. అయినా కంపెనీ మూసేయక తప్పలేదు. అప్పులిచ్చినవాళ్లు రోజూ వచ్చి వెళుతున్నారు. సౌమ్య బంగారం తాకట్టులో పెట్టి ఏడాది గడిచిపోతోంది. విడిపించాలని తమ్ముడితో చెబితే, ‘‘ఇప్పటికిప్పుడు డబ్బులు తేవడం కష్టం’’ అని చెప్పి మాట్లాడడమే మానేశాడు. పిల్లలకు స్కూల్‌ ఫీజులు కట్టడం మాట అటుంచి, ఈ పూట గడిస్తే చాలు అనే పరిస్థితికి వచ్చింది.

అద్దె కట్టకపోవడంతో, ఇల్లు ఖాళీ చేయమనీ, లేకపోతే కేసు పెడతాననీ ఇంటి ఓనర్‌ గొడవ చేస్తున్నాడు. అప్పటికీ సౌమ్య వాళ్ల పుట్టింటి నుంచి డబ్బు తీసుకొచ్చి ఇచ్చింది. అయినా సర్దుబాటు అవడం లేదు. దీనికి తోడు చిన్న కొడుకు సిద్ధుకు ఒంట్లో బాగోలేదు. వాడికి పదేళ్లు. వైరల్‌ ఫీవర్‌ అన్నారు డాక్టర్లు. మందులు వేసినా తగ్గడం లేదు. పెద్ద ఆసుపత్రిలో చూపించాలి. ట్రీట్‌మెంట్‌కు డబ్బుల్లేక, ‘రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం’ అంటూ వాయిదా వేస్తూ వచ్చాడు గిరిధర్‌.  తెలిసినవాళ్ళందరినీ అడిగాడు. ఎక్కడా డబ్బు పుట్టలేదు. గిరిధర్‌ నిస్సహాయుడైపోయాడు. సరైన చికిత్స అందకపోవడంతో, వారం రోజులకు సిద్ధు చనిపోయాడు. సౌమ్య కంటికి మింటికీ ఏకధారగా ఏడ్చింది. ‘నీ దగ్గరుంటే మిగిలిన ఒక్క కొడుకును కూడా పోగొట్టుకుంటాను..’ అంటూ పుట్టింటికి వెళ్లిపోయింది. వెళుతూ వెళుతూ తన చేతకానితనాన్ని అసహ్యించుకుంటూ చూసిన ఆ చూపు నిలువెల్లా దహించివేస్తోంది గిరిధర్‌ని.     

థెరపీతో డబ్బు వస్తుందా?!
‘‘డాక్టర్‌! నేను పెద్ద దురదృష్టవంతుడిని. చిన్నప్పటి నుంచీ అంతే! ఏ పని చేసినా సరైన ఫలితం రాదు. ఎప్పుడూ నా దగ్గర డబ్బు ఉండదు. నా అంత దురదృష్టవంతుడు లోకంలోనే ఉండరు. కన్నకొడుకును కూడా కాపాడుకోలేని అసమర్థుణ్ణి..’’ దుఃఖం కమ్ముకొస్తుండగా చెప్పాడు గిరిధర్‌. చావే శరణ్యంగా భావించిన గిరిధర్‌కి వర్క్‌షాప్‌ ద్వారా పరిచయం అయ్యింది పాస్ట్‌లైఫ్, ఫ్యూచర్‌లైఫ్‌ థెరపీ. ప్రపంచంలో ఈ థెరపీ ద్వారా ఎంతమంది మానసికంగా స్వస్థత పొందారో, తమ జీవితాలను బాగుపరుచుకున్నారో తెలుసుకున్నాడు. తన సమస్యను కౌన్సెలర్‌ ముందుంచాడు. గిరిధర్‌ దుఃఖం తగ్గే వరకు చూసిన కౌన్సెలర్, ‘‘గిరిధర్‌! అదృష్టం మీ హృదయద్వారాలను తెరుస్తుంది. నమ్మకం ఉంచండి’’ అని చెప్పాడు. గిరిధర్‌కి థెరపీ మొదలైంది. ధ్యానప్రక్రియలో ఉన్న గిరిధర్‌కి కౌన్సెలర్‌ సూచనలు అందుతున్నాయి. చేతనం నుంచి అంతఃచేతనం వైపు పరుగులు తీస్తున్నాడు గిరిధర్‌.

గతం తెలిపిన సత్యం
అతని మస్తిష్కంలో ఎదుగూ బొదుగూ లేని ఉద్యోగం, కాలేజీ రోజుల్లో పడిన అవస్థలు, స్కూల్‌ రోజుల్లో ఫీజు కట్టలేని దుఃస్థితి, అటు నుంచి బాల్యంలో ఎదుర్కొన్న గడ్డు స్థితి... అన్నీ మనోఫలకం మీద చూస్తున్నాడు. అక్కడ నుంచి తన గత జన్మలోకి వెళ్లాడు. ఎంత కష్టపడినా, డబ్బులు రావడం లేదు. స్నేహితులు మోసం చేశారు. బంధువులు డబ్బులు ఎగ్గొట్టారు. సంపదను అనుభవించే యోగ్యత తనకు లేదని కుమిలిపోతున్నాడు. కుటుంబాన్ని పోషించలేని దుఃస్థితికి విలవిలలాడిపోతున్నాడు. అసమర్థుyì నని తనను తానే తిట్టుకుంటున్నాడు. కుటుంబం అంతా తనను వదిలేసి వెళ్లిపోవడం చూశాడు.

‘‘గిరిధర్‌! ఇప్పుడు ఈ జన్మలోకి రండి’’ అన్నారు కౌన్సెలర్‌. గత జన్మకు మల్లే ఈ జన్మ జీవితమూ ఉంది. ఈ రెండు జన్మలనూ చూసుకున్న గిరిధర్‌ తాను ఎక్కడ పొరపాటు చేస్తున్నాడో అర్థమైంది. తను బంగారు పట్టుకుంటే మట్టి అవుతుందనే నమ్మకం మస్కిష్తంలో గాఢంగా పడిపోయిందని తెలిసింది.

అషై్టశ్వర్యాల భవిష్యత్తు
‘‘గిరిధర్‌! ఇప్పుడు మీరు పదేళ్ల్ల తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో దర్శించండి’’ అన్నారు కౌన్సెలర్‌. గిరిధర్‌ ప్రయాణం భవిష్యత్తు వైపు పరుగులు తీసింది. పదేళ్ల తర్వాత... పోయిన ఆస్తులు తిరిగి రావడం కనిపించింది. తనో అందమైన భవనాన్ని నిర్మించుకున్నాడు. భార్య, కొడుకుతో ఆనందంగా ఉన్నాడు. కొడుకు ఉద్యోగంలో చేరి మంచి హోదాలో ఉన్నాడు. స్నేహితులు, బంధువులు తన చుట్టూ ఉన్నారు. మరో పదేళ్లకు కొడుకుకి పెళ్లి చేయడం, మనుమలు, మనుమరాళ్లతో తను ఎంతో సంపన్నుడిగా కనిపిస్తున్నాడు. కౌన్సెలర్‌ సూచనలు పూర్తయ్యాయి. గిరిధర్‌ ఎంతో ఆనందంగా కళ్లు తెరిచాడు.

‘‘డాక్టర్‌! నాకు ఈ జీవితాన్ని అనుభవించే యోగ్యత ఉందా? ఈ విషయం నాకు తెలియనే లేదు’’ అన్నాడు ఆనందంగా!‘‘మీకు యోగ్యత ఉంది. మీలాగే ఈ సృష్టిలో అందరికీ సంపదలు అనుభవించే యోగ్యత ఉంది. అందుకు కావాల్సిందల్లా – నమ్మకంతో ఆలోచనావిధానంలో మార్పు చేసుకోవడమే’’ అన్నారు కౌన్సెలర్‌.కౌన్సెలర్‌ ఇచ్చిన సూచనలు గిరిధర్‌ జీవితాన్ని మార్చేసింది. కొన్ని రోజుల్లో మెరుగైన ఫలితాలు చూశాడు. తిరిగి రాదనుకున్న భార్య సౌమ్య, కొడుకును తీసుకొని తన దగ్గరకు వచ్చేసింది. మోసం చేశారనుకున్న స్నేహితుడు డబ్బులు చేతికొచ్చాయని తిరిగి ఇచ్చేశారు. మూసేసిన కంపెనీని కొన్ని నెలల వ్యవధిలో తిరిగి ప్రారంభించగలిగాడు. సమయానికి డబ్బు అందివ్వలేని స్థితిని వివరించిన తమ్ముడిని క్షమించేశాడు. క్షీణించాయనుకున్న బంధుత్వాలు బలపడ్డాయి. సుసంపన్నంగా మారిన జీవితం నుంచి తన చుట్టూ ఉన్నవారికి ఆనందాలను పంచుతూ అందరికీ ఆత్మీయుడయ్యాడు గిరిధర్‌.

ఎవరికి వారు స్వీయ కుబేరులు అవ్వాలి. కుచేలత్వం నుంచి కుబేర త్వం వైపు నువ్వు వెళ్లాలంటే నీలో ఉన్న అపసవ్య ఆలోచనల్ని దారి మళ్లించాలి. సాందీప మహర్షి వద్ద కృష్ణుడు, కుచేలుడు చదువుకున్నారు. కుచేలుడు దరిద్య్రాన్ని అనుభవిస్తూ కృష్ణుడి వద్దకు వెళ్లాడు. కుచేలుడికి ఆతిథిమర్యాదలు చేస్తూ అతని పాదాలను ప్రేమతో నొక్కాడు కృష్ణుడు. దీంతో కుచేలునిలోని రాంగ్‌ థాట్స్‌ అన్నీ పోయాయి. ఆ తర్వాత కుచేలుణ్ణి వెతుక్కుంటూ అషై్టశ్వర్యాలు వచ్చేశాయి.

ఆలోచనల్లో మార్పు వస్తే సంపదలు వస్తాయా..?
తప్పకుండా అషై్టశ్వర్యాలు సిద్ధిస్తాయి. ‘డబ్బు చెట్లకు కాస్తుందా? నేనెవరి కన్నా డబ్బు ఇస్తే తిరిగి రాదు, డబ్బు వస్తే జబ్బులు వస్తాయి. డబ్బు మహా పాపం. నాకు యోగ్యత లేదు. ఎంతో కష్టపడితే తప్ప డబ్బు రాదు. డబ్బు ఇవ్వడం వల్ల చాలా కష్టాలు పడ్డాను. డబ్బు ఉన్నవారి వల్ల అణచివేతకు గురయ్యాను’ – ఇలాంటి ఆలోచనల్లో కూరుకుపోతే సంపదలకు నిజంగానే దూరమైపోతారు. ‘ప్రతీది అనుభవించడానికి నేను యోగ్యుడినే’ అని నమ్మితే విశ్వం అంతా మనకు అనుకూలంగా మారిపోతుంది. డబ్బును దాచుకోవడం చేయకూడదు. సర్క్యులేషన్‌లో ఉంచాలి. తిన్న ఆహారం కడుపులో అలాగే దాచడం లేదు. ఇది కూడా అంతే! తీవ్రంగా కోరుకోవాలి. ఉత్సాహంగా పనిచేయాలి. గొప్పగా ఊహించాలి. బలంగా నమ్మాలి – ఇవన్నీ డబ్బుకు పాజిటివ్‌ ద్వారాలు. ‘నాకు డబ్బును అనుభవించడానికి పూర్తి యోగ్యత ఉంది. డబ్బుకు ఎక్కడా అడ్డుపడను..’ అనుకోవాలి. డబ్బు రాకపోవడం, నిలవకపోవడం వంటివి గత జన్మలో సబ్‌కాన్షియస్‌ మైండ్‌లో బలంగా నాటుకుని‘బ్లాక్స్‌’గా ఏర్పడి ఉంటాయి. వాటిని తుడిచేసుకుంటే, సరైన అవగాహన కలుగుతుంది. ఫ్యూచర్‌లోకి తీసుకెళ్ళి, ‘ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడివో చూడు’ అంటే పాజిటివ్‌ కాన్షియస్‌నెస్‌ ఎస్టాబ్లిష్‌ అవుతుంది. లక్‌ (అదృష్టం) ఫ్యాక్టర్‌ కూడా వృద్ధి పొందుతుంది. మానవ సంబంధాలు, ఆరోగ్యం, ఆనందం... అన్నీ సంపదలే! అన్నింటినీ మనం ఆకర్షించాలి.   – డాక్టర్‌ హరి కుమార్, ఫ్యూచర్‌ థెరపిస్ట్, బ్లిస్‌ఫుల్‌ ఫౌండేషన్, హైదరాబాద్‌

నీటి అలలు... ఆలోచనలు
డా.అబ్రహం అమెరికన్‌ రచయిత. ‘లా ఆఫ్‌ ఎట్రాక్షన్‌’ (ఆకర్షణ  సిద్ధాంతం) పేరుతో సంపదను ఆకర్షించడం ఎలా? పుస్తకం రాశారు. డా. మసరు ఎమోటో జపనీస్‌ రచయిత. ‘మన ఆలోచనలు మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి’ అనేది ఉదాహరిస్తూ నీటి అలల మీద ప్రయోగం చేశారు. నీళ్లు మన శరీరంలో 70 శాతం ఉంటాయి. ఆ అలలు మన ఆరోగ్యం, ఆలోచనల మీద ఎంతగా ప్రభావితం చూపుతాయో వివరించారు ఈ రచయిత.
– నిర్మల చిల్కమర్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement