
గుండెకు ముల్లు అడ్డుపడుతుంటే.. గొంతులోకి ముద్ద ఎలా దిగుతుంది? అడ్డుగా ఉన్నదానిని బయటికి తెచ్చేసుకునే శక్తి మనకు లేకపోవచ్చు. గుండె మాత్రం ఎంతోకాలం లోపల ఉంచుకోలేదు. తనే శక్తిని కూడదీసుకుని ముల్లును గొంతులోంచి బయటికి తోసేస్తుంది.
తనుశ్రీ దత్తాను బాలీవుడ్ నటి అనేందుకు లేదు. బాలీవుడ్‌ను ఈసడించుకుని పదేళ్ల క్రితమే యు.ఎస్. వెళ్లిపోయి, మళ్లీ ఈ మధ్యే ఆమె ఇండియా వచ్చారు. కనుక తనుశ్రీని ఒక యువతి అని మాత్రమే అనాలి. ఒక సాధారణ యువతి అని కూడా అనొచ్చు. ఒకప్పుడు ఆమె సాధించిన ‘మిస్ ఇండియా యూనివర్స్’ టైటిల్ కన్నా, ఈ ‘సాధారణ యువతి’ అనే మాట.. మోర్ పవర్‌ఫుల్ టైటిల్ అనిపిస్తుంది ఆమె విషయంలో. మోర్ గ్లామరస్ అనబోయి మోర్ పవర్‌ఫుల్ అనడం కాదు. గ్లామర్ ప్రపంచాన్ని గిరాటు వేసి వెళ్లిపోయారు తనుశ్రీ. అందుకు పవర్‌ఫుల్. వెళ్లేటప్పుడు తనుశ్రీ వయసు 24 ఏళ్లు. ఇప్పుడు 34. ఈ పదేళ్లలో తనుశ్రీలో వచ్చిన మార్పు ఒకటే. అందంగా ఉండేవారు.. ఇంకొంచెం అందంగా అయ్యారు. అందాన్ని తనే పక్కన పెట్టేశారు కాబట్టి ఎవరైనా ఇప్పుడు ఆమె అందం గురించి మాట్లాడ్డం అనుచితమే అవుతుంది.
‘హార్న్ ఓకే ప్లీజ్’ (2008) చిత్రంలో తనుశ్రీదత్తా లేరు. ఉండేవారే. సగంలో వెళ్లిపోయారు. లైంగిక వేధింపులు కారణం! సినిమాలో హీరోగా నటిస్తున్న 57 ఏళ్ల వ్యక్తి సినిమా సెట్స్‌లో తన పాలిట విలన్‌గా మారాడని అప్పుడే చెబితే ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. ‘ఇక్కడ ఇదంతా మామూలే’ అన్నట్లు చూశారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ చెబితే ‘నువ్వింకా మర్చిపోలేదా’ అన్నట్లు చూశారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు చెబితే.. ‘అవునా!’ అన్నట్లు ముఖాలు పెట్టేశారు. వేధింపులు జరుగుతున్నప్పుడే కంప్లయింట్ చేస్తే పట్టించుకోని ‘సింటా’ (సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్).. పదేళ్ల తర్వాత.. కొద్దిరోజుల క్రితమే తనుశ్రీకి అపాలజీ చెప్పింది!
అపాలజీ కోసం తనుశ్రీ దత్తా సినిమాలు మాని ఇన్నేళ్లపాటు పోరాటం చేయలేదు. తనతో తను చేస్తున్న పోరాటంలో ఓడిపోవడం ఇష్టం లేక ప్రతి ఇంటర్వ్యూలోనూ ఆనాటి చీడకలను రిపీట్ చేస్తూ వస్తున్నారు. ‘నేనేం చేయలేకపోయాను’ అని తన మనసుకు తను, తన దేహానికి తను అపాలజీ చెప్పే దుస్థితిని తప్పించుకోవడం కోసం తనుశ్రీ ఫైట్ చేస్తున్నారు. మొదటైతే తన నుంచి తను తప్పించుకోవాలనే ప్రయత్నించారు. ‘హార్న్ ఓకే ప్లీజ్’ను వదిలేసి.. హిమాలయాల వైపు వెళ్లిపోయారు. తక్షణం రెక్యుపరేట్ అవ్వాలి తనప్పుడు. ఒంటిపైన ఏదో పాకింది. దాన్నుంచి రెక్యుపరేషన్. మనసు మోకాళ్లపై ముడుచుకుపోయింది. దాన్నుంచి రెక్యుపరేషన్.
కానీ అక్కడేం వైద్యం దొరకలేదు! ఆధ్యాత్మికత ఆమెకు ఏమాత్రం చికిత్స చేయలేకపోయింది. లడఖ్ వెళ్లి కొన్నాళ్లు బౌద్ధారామంలో ఉన్నారు. కొన్నాళ్లు విపస్సన. ఆ ధ్యానం కొంత పని చేసింది. ఆశ్రమాల్లో కూడా గడిపారు కానీ.. ఈ జ్ఞానప్రాప్తి, నిర్వాణం, మోక్షం.. అంతా ఎద్దుపేడ అనిపించింది తనుశ్రీకి. భార్యలొచ్చేవారు. భర్తలు వదిలేశారని ఏడ్చేవారు. తల్లిదండ్రులు వచ్చేవారు. పిల్లలు పట్టించుకోవడం లేదని ఏడ్చేవారు. ఇంకేం స్పిరిచువాలిటీ! గురువులుండేవాళ్లు. ఇంతమంది గురువులున్న దేశంలో ఇన్ని రేప్‌లు ఏంటని మనసులో మరో ముల్లు. తనుశ్రీ మళ్లీ డిస్టర్బ్ అయ్యారు. యు.ఎస్. వెళ్లిపోయారు. అక్కడ ఆమెకు గ్రీ¯Œ కార్డు ఉంది. అయితే ఇండియాలో తను ‘తీర్చుకోవలసింది’ ఇంకా అలాగే ఉండిపోయింది. అది తనను తిననివ్వడం లేదు. పడుకోనివ్వడం లేదు. దిగులు కూడు. మనసు గోడు.
ఇప్పుడు కొంచెం ఆమెకు నెమ్మదిగా ఉండి ఉండాలి. ఆశ్రమాల్లో దొరకని నెమ్మది. అమెరికాలో దొరకని నెమ్మది. పదేళ్ల క్రితం తనను లైంగికంగా వేధించిన వ్యక్తిపై కేసు పెట్టారు తనుశ్రీ. ఆమెను చూసి ధైర్యంగా మరికొంత మంది నటీమణులు బయటికి వచ్చారు. కొందరు మగాళ్లు కూడా వీళ్లకు మద్దతు ఇస్తున్నారు కానీ, ఈ మద్దతు ఇచ్చే మగాళ్లపైన కూడా ఏనాటివో కథలు బయటపడితే.. అప్పుడిక అంతా ఒక్కటే. మగవాడి మద్దతు కూడా ఒక లైంగిక వేధింపు కన్నా తక్కువగా ఏమీ పరిగణన పొందదు. నీతులు బోధించే మీడియా సైతం.. ‘దీప్తీ.. కమ్ టు మై క్యాబిన్’ అని ఇంటర్‌కమ్‌లో పిలిచి.. ముఖంలోకి ముఖం పెట్టి ‘లక లక లక’ మన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
వీటినిక ఆరోపణలు అనడం మానేయాలి. ఆవేదనలు అనాలి. ఏం జరిగినా నోరెత్తని హిస్టరీ ప్రపంచ మహిళలది. అలాంటి వారు ఏమీ జరక్కుండానే నలుగురి నోళ్లలో నానడానికి ఇల్లొదిలి, ఇంట్లోని మనుషుల్ని వదిలి, బయటికి వచ్చేస్తారా? తనుశ్రీ దత్తా కంటే ముందు బాలీవుడ్‌లో బాధిత మహిళలు తమ ఒంటిపై గాయాలను విప్పి చూపించారు కానీ ఆ గాయాల్ని ఎవరు చేశారో పైకి చెప్పుకోలేదు. ‘ఇలా జరుగుతోందండీ. ఇది న్యాయమా అండీ..’ అన్నంత వరకే వాళ్లు ఆగిపోయారు. తనుశ్రీ వచ్చి ధనుస్సు ఎక్కుపెట్టారు. విల్లు సారించారు, శరాన్ని సంధించారు. ఇంతకాలం తన మనసు చాటున తనే దాక్కుండిపోయిన ఒక్కో మహిళా వచ్చి, ఒక్కో శరమై తనుశ్రీ భుజానికి ఉన్న అమ్ములపొదిలో కూర్చుంటోంది. తనను తనే సంధించుకుంటోంది. ప్రేరణ తనుశ్రీ. చేతన ప్రతి స్త్రీ.
యు.ఎస్.లో నిరుడు అమెరికన్ స్త్రీలు, ఇండియాలో నేడు భారతీయ మహిళలు తమపై జరిగిన లైంగిక వేధింపులను బహిర్గతం చేస్తూ ఒక ఉద్యమంలా, ఒక విప్లవంలా, ఒక తిరుగుబాటులా బయటికి రావడంతో ఇది ‘రెండో అక్టోబర్ విప్లవం’ అన్న అభివర్ణన వినిపిస్తోంది. నూరేళ్ల క్రితం అక్టోబర్‌లో, గతేడాది అక్టోబర్‌లో, ఈ ఏడాది అక్టోబర్‌లో.. రష్యాలో, యు.ఎస్.లో, ఇండియాలో జరిగినవీ, జరుగుతున్నవీ, ప్రపంచం మొత్తానికీ వ్యాప్తిస్తున్నవీ.. అన్నీ సాంస్కృతిక తిరుగుబాట్లే. వీటిని రాజేసినదీ, రాజేస్తున్నదీ నాడూ, నేడు.. కవులు, కళాకారులు, రచయితలు, రంగస్థల నటులు, చిత్రకారులే. వారి అంశ అయిన బాలీవుడ్‌లో, హాలీవుడ్‌లో, మిగతా ఉడ్‌లలో ఇప్పుడు జ్వలిస్తోన్న అక్టోబర్ విప్లవం కూడా సాంస్కృతికమైనదే. స్త్రీని గౌరవించే సంస్కృతిని మనం కోల్పోతున్నా.. సంస్కృతి నుంచి మాత్రం మన పేగుబంధాన్ని ఎప్పటికీ తెంచుకోలేం. ఎందుకంటే.. స్త్రీనే మన సంస్కృతి. స్త్రీనే మన సాంస్కృతిక, సంస్కారాల రిఫ్లెక్షన్.
‘అప్పుడే నేను ఎందుకు చెప్పలేదంటే..’ అని సోషల్ మీడియా ఉద్యమం ఒకటి ఈ ఏడాది సెప్టెంబరులో కొన్నాళ్లు నడిచింది. అది ట్రంప్‌కు వ్యతిరేకంగా నడిచిన ఉద్యమం. ‘అప్పుడే నేను ఎందుకు చెప్పలేదంటే..’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో బాధితులు తమపై ఎప్పుడో జరిగిన లైంగిక వేధింపుల్ని షేర్ చేసుకున్నారు. యు.ఎస్.కి కొత్తగా వచ్చిన సుప్రీంకోర్టు జడ్జి బ్రెట్ కవానా మీద.. జడ్జిగా ఆయన నామినేషన్‌కు ముందు క్రిస్టీన్ బ్లేసీ ఫోర్డ్ అనే అమెరికన్ ప్రొఫెసర్ బయటికొచ్చి, హైస్కూల్లో ఉండగా కవానా తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడని ఆరోపించారు.
ఇద్దరూ ఒకే స్కూల్లో చదివినప్పటి మాట ఇది. ట్రంప్ వెంటనే ‘వై యు డిడెంట్ రిపోర్ట్’ అని అడిగాడు. దానికి సమాధానమే ‘వై ఐ డిడెంట్ రిపోర్ట్’. ‘వీళ్లంతా ఇప్పుడెందుకు చెబుతున్నారు.. పబ్లిసిటీ కోసం కాకపోతే!’ అని మన దగ్గర కూడా పాయింట్ పైకి తీస్తున్నారు. గుండెకు ముల్లు అడ్డుపడుతుంటే.. గొంతులోకి ముద్ద ఎలా దిగుతుంది? అడ్డుగా ఉన్నదాన్ని బయటికి తెచ్చేసుకునే శక్తి మనకు లేకపోవచ్చు. గుండె మాత్రం ఎంతోకాలం లోపల ఉంచుకోలేదు. తనే శక్తిని కూడదీసుకుని తన లోపలి ముల్లును గొంతులోంచి బయటికి తోసేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment