లండన్ : జుట్టు ముగ్గుబుట్టవడం..ముడతలు పడిన చర్మం..ఉద్యోగం దూరమవడం ఇవన్నీ వయసు తెచ్చే మార్పులే. 60 దాటగానే అన్నీ అయిపోయాయనుకునే నిర్వేదం నుంచి 70లు దాటితేనే అసలైన జీవితాన్ని ఆస్వాదించవచ్చంటున్నారు ఈ నయా బామ్మలు. వయసు శరీరానికే కానీ మనసుకు కాదని చెప్పే వాళ్లని చూశాం కానీ, వయసు తమ శరీరానికీ దూరమే అన్నట్టు ఈ వృద్ధుల దినచర్య అందరి కళ్లకు కడుతోంది. బోల్డర్ అనే వెబ్‌సైట్ చేసిన పరిశోధనలో చలాకీ వృద్ధుల దూకుడు వెల్లడైంది. కృష్ణ రామా అనుకుంటూ కాలక్షేపం చేస్తారనుకునే 70 ఏళ్ల పైబడిన వారినే ఈ వెబ్‌సైట్ పలుకరించగా వారి చురుకైన లైఫ్‌స్టైల్ చూసి విస్తుపోయే పరిస్థితి ఎదురైంది. వీరిలో ఒకరు 82 ఏళ్ల వయసులో ప్రేమలో పడి వివాహం చేసుకున్నవారు కాగా, మరొకరు 85 ఏళ్ల వయసులో ఏకంగా రోజూ ఒక మైలు దూరం స్విమ్ చేస్తున్నారు. వీరంతా ఇప్పటికీ ఏదో ఒక పనిచేస్తుండటం గమనార్హం. తమ జీవితంలో అత్యంత సంతోషదాయకమైన దశ ఇదేనని వారంతా చెప్పుకొచ్చారు. వృద్ధాప్యం జీవితంలో అత్యంత దుర్భర దశ అనుకుని అసలు వాస్తవం గ్రహించాలని వీరిని ఇంటర్వ్యూ చేయగా భిన్నమైన పరిస్ధితి తమ పరిశోధనలో వెల్లడైనట్టు ఆ వెబ్‌సైట్ పేర్కొంది.
87 ఏళ్ల వయసులో టెన్నిస్..
తాను ఇప్పటికి 70 ఏళ్లు పైగా టెన్నిస్ ఆడుతున్నానని కెనడాలోని ఒంటారియాకు చెందిన ముఫీ గ్రీవ్ (87) వెల్లడించి ఇంటర్వ్యూ చేసిన వారిని షాక్‌కు గురిచేశారు.తాను 30, 40, 50 ఇలా వయసు పెరుగుతున్న కొద్దీ ఎలాంటి సమస్యలూ ఎదుర్కోలేదని, జీవితంలో ఎదుగుతున్న కొద్దీ ఎదో రంగంలో విజయం సాధిస్తే తమకు లభించే ఆత్మవిశ్వాసం ఎంతో గొప్పదని ఆమె చెప్పుకొచ్చారు. తాను 62 ఏళ్ల వయసులో బ్రైన్ ట్యూమర్‌తో బాధపడినా సానుకూల దృక్పథంతో సమస్యలు అధిగమించానని వెల్లడించారు. సమస్యలతో దిగాలుపడి కూర్చోవడం తనకు ఇష్టం ఉండదని పాజిటివ్ మైండ్‌తో పరిగెత్తడమే తనకు తెలిసిన విషయమన్నారు. గోల్ప్‌లో 90 స్కోర్ చేయడమే తన తదుపరి లక్ష్యమని చెప్పారు.
ఏడు పదుల వయసులో స్విమ్మింగ్
ఎలరీ మెక్‌గొవన్ ఏడు పదుల వయసు దాటిన ఈ బామ్మ స్విమ్మింగ్‌లో పలు వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లను కైవసం చేసుకున్నారు. రష్యాలో వింటర్ స్విమ్మింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో తనకు గాయమైనా రేస్ ముగిసే వరకూ రక్తం కారుతున్నా తనకు ఆ విషయం తెలియలేదని ఎలరీ చెబుతారు. తాను ప్రతివారం పైలేట్స్, స్పిన్ క్లాసులు తీసుకుంటానని ఆరోగ్యకర ఆహారం, పరిమితంగా రెడ్‌వైన్ తీసుకోవడమే తన ఆరోగ్య రహస్యమని ఆమె చెప్పకొచ్చారు. గత ఏడాది తన కుమారుడు జేమ్స్ హఠాన్మరణం చావు పట్ల తొలిసారిగా భయాన్ని కల్పించిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడే జీవితాన్ని చాలించాలని లేదని, కానీ నా వయసు ఏటికేడు పెరుగుతూ పోతోందని అన్నారు. అయినా తాను జీవితంలో సాధించాలనే పట్టుదలను వీడలేదని, అంటార్కిటికాను ఈదడం తన తదుపరి టార్గెట్ అని చెప్పారు.
పదహారు ఫ్లోర్లు: అవలీలగా ఎక్కేస్తారు
రీటా గిల్మోర్ 87 ఏళ్ల వయసులో తన రెస్టారెంట్‌లోని 16 ఫ్లోర్లనూ ఎక్కిదిగుతారు. కస్టమర్లు, సిబ్బందితో కలివిడిగా ఉంటూ బ్రెయిన్‌ను చురుకుగా ఉంచుకుంటానని ఆమె చెబుతారు. మద్యం ముట్టకుండా..పొగ తాగకుండా ఉండటమే తాను ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణమనే రీటా రోజూ మేకప్ వేసుకోవడమే కాదు స్ధానిక దుస్తుల కంపెనీకి ఇప్పటికీ మోడల్‌గా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment