ఆలివ్ ఆయిల్ మసాజ్
బ్యూటిప్స్
పొడిబారి, జీవం లేనట్టుగా ఉండే జుట్టుకు గోరువెచ్చని ఆలివ్ నూనె ఎంతో మేలుచేస్తుంది. అర కప్పు ఆలివ్ ఆయిల్ (లేదా మీ జుట్టుకు తగినంత) వేడి చేయాలి. చల్లారాక వేళ్లతో అద్దుకొని, జుట్టు కుదుళ్లకు పట్టించాలి. దువ్వెనతో కుదుళ్ల దగ్గర నుంచి కిందవరకు దువ్వాలి. ఆ తర్వాత షవర్ క్యాప్ లేదా టవల్‌ను తలకు చుట్టాలి. అలా రాత్రి మొత్తం ఉంచవచ్చు. మరుసటి రోజు ఉదయం రసాయనాల గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టుకు జీవకళ వస్తుంది. కొబ్బరి నూనెతోనూ ఇలాగే చేయవచ్చు.
పొడిబారిన మాడు దురద కూడా పెడుతుంటుంది. ఈ సమస్యకు విరుగుడుగా అర కప్పు ఆలివ్ ఆయిల్‌లో 2 టీ స్పూన్ల తేనె కలిపి మాడుకు పట్టించాలి. వేడి నీళ్లలో ముంచిన టవల్‌ని గట్టిగా పిండి, దానిని తలకు చుట్టాలి. (భరించగలిగేంటతటి వేడి మాత్రమే ఉండాలి) 15 నిమిషాల తర్వాత హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి.
అర కప్పు వేడి చేసిన ఆలివ్‌ను తలకు పట్టించి, 2-3 గంటల తర్వాత తలస్నానం చేయాలి. చివర్లో 3-4 టీ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలిపిన మగ్గు నీళ్లతో తలంతా తడపాలి. పది నిమిషాల తర్వాత మంచి నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కురులు, మాడుపై చర్మం మృదువుగా మారుతుంది. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.