చాలెంజ్కు పోతే జుట్టూడిపోయింది!
బీజింగ్: సోషల్ మీడియాలో పాపులర్ అయిన వీడియోను అనుకరించబోయిన చైనా మహిళకు చేదు అనుభవం ఎదురైంది. పవర్ డ్రిల్ మెషిన్ సహాయంతో మొక్కజోన్న కంకిని వేగంగా తినడానికి ప్రయత్నించి జుట్టును పోగొట్టుకుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోను ఆన్లైన్లో ఎక్కువమంది వీక్షిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల చైనా సోషల్ మీడియాలో 'కార్న్ డ్రిల్ చాలెంజ్' పేరుతో ఓ వీడియో బాగా పాపులర్ అయింది. డ్రిల్ మిషన్కు మొక్కజోన్న కంకిని జోడించి అది వేగంగా తిరుగుతున్న సమయంలో కేవలం 10 సెకన్లలో ఆ కంకిని తినేయడం ఆ వీడియోలో కనిపించింది. ఐస్ బకెట్ చాలెంజ్, నాజుకు నడుము అని తెలిపేందుకు ఏ4 పేపర్ చాలెంజ్ లాగే దీనిని కూడా యువత వెర్రిగా అనుకరిస్తున్నారక్కడ. దీనిలో భాగంగా ఓ గుర్తుతెలియని మహిళ అనుకరించే సమయంలో ప్రమాదవశాత్తు డ్రిల్ మిషన్లో జుట్టు ఇరుక్కుపోయింది. క్షణకాలంలో జరిగిన ఈ ఘటనలో మహిళ తల ముందుభాగంలోని జుట్టు ఊడిపోయింది. దీంతో బట్టతల మాదిరిగా కనిపిస్తున్న ఆ మహిళకు డాక్టర్లు చికిత్స అందించారు. త్వరలోనే మళ్లీ జుట్టు వస్తుందని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది.
దీనిపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఇలాంటి ప్రమాదకర చాలెంజ్లు అనుకరించొద్దని కొందరంటుంటే.. అది పూర్తిగా ఆ మహిళ తప్పిదమే అని కొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా చాలెంజ్తో ఇంత పాపులర్ అయ్యేదో కాదో తెలియదు కానీ.. ప్రమాదంతో మాత్రం సదరు మహిళ ఫుల్ పాపులర్ అయింది అంటున్నారు ఇంకొందరు.