మరోసారి... టెన్ కమాండ్‌మెంట్స్!
డిస్కవరీ
హాలీవుడ్ సినిమా ‘టెన్ కమాండ్‌మెంట్స్’(1923) ఆ రోజుల్లో నిశ్శబ్దంగా సాధించిన సంచలన విజయం అంతా ఇంతా కాదు. ఆ సినిమా విడుదలై తొంభై సంవత్సరాలు దాటినా దాని విశేషాల గురించి గొప్పగా మాట్లాడుకుంటూనే ఉంటాం. ముఖ్యంగా ఆ సినిమా కోసం వేసిన భారీ సెట్‌ల గురించి.
ఆ రోజులలో సినిమాకు సంబంధించిన సాంకేతికపరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందలేదు కాబట్టి ఎంత పెద్ద నిర్మాణాన్ని అయినా భారీ సెట్స్‌గా వేసేవారు. అలా ‘టెన్ కమాండ్‌మెంట్స్’కోసం కాలిఫోర్నియాలోని వాడాలూపె సముద్ర తీరంలో ఎన్నో అందమైన భారీ సెట్లు వేశారు. విశేషమేమిటంటే, చా...లా కాలం తరువాత ‘టెన్ కమాండ్‌మెంట్స్’ కోసం వేసిన దేవాలయం సెట్‌లో కొంత భాగాన్ని, సింహిక (sphinx)ను ఆర్కియాలజిస్ట్‌లు వాడాలూపె సముద్ర తీరంలో కనుగొన్నారు.
షూటింగ్ పూర్తి కాగానే చిత్రబృందం చాలా సెట్‌లను ధ్వంసం చేసింది. అయితే ఇప్పుడు బయటపడిన సెట్ మాత్రం పాక్షికంగానే ధ్వంసమై కాలక్రమంలో ఇసుకలో కూరుకుపోయింది. ‘‘పాత సినిమాలకు సంబంధించిన గొప్ప గొప్ప సెట్‌లను ఆనాటి వ్యక్తుల జ్ఞాపకాలు, పుస్తకాల్లో మాత్రమే గుర్తు చేసుకోగలం. ఇలా భౌతికంగా కనిపించడం మాత్రం చాలా అరుదైన సంఘటన’’ అంటున్నారు హిస్టారికల్ ఆర్కియాలజిస్ట్ కోలిన్ హమల్టిన్. తవ్వకాల్లో బయటపడిన ‘సింహిక’ను ప్రస్తుతం వాడాలుపె ‘డూనెస్ సెంటర్’ మ్యూజియంలో భద్రపరిచారు. ఆనాటి మరుపురాని సెట్‌లను వెలికితీయడానికి విరాళాలు కూడా సేకరిస్తున్నారు.
తవ్వకాల్లో మరిన్ని సెట్‌లు, వాటి తాలూకు వస్తువులు బయటపడితే...ఇక వాటిని ‘డూనెస్ సెంటర్’లో భద్రపరచనక్కర్లేదు. ‘టెన్ కమాండ్‌మెంట్స్’ పేరుతో ఏకంగా ఒక మ్యూజియంనే ప్రారంభించవచ్చు!