ఒక నిమిషం – ఒక విషయం
ద్వారానికి అంత ప్రాముఖ్యం ఎందుకు ఇస్తారు?
ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపం అందుకే దానికి మామిడి తోరణం కడతారు. కింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు. శాస్త్రపరంగా చెప్పాలంటే గడపకు పసుపు రాయడం వల్ల క్రిమికీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి అనుకోవచ్చు.
పంచామృతం, పంచగవ్యాలు తేడా ఏమిటి?
ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదారల మిశ్రమాన్ని పంచామృతం అంటారు. దీనిని పూజలో దేవునికి నివేదిస్తారు.
ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రంల మిశ్రమమే పంచగవ్యం. దీనిని పంటల రోగనివారణకు వాడతారు.
అన్నప్రాశన ఎన్నో నెలలో చేయాలి ?
ఆడపిల్లలకు ‘5‘ వ నెలలో, మగ పిల్లలకు ‘6 ‘ వ నెలలో అన్నప్రాశన చేయాలి. 6 నెల 6వ రోజున ఇద్దరికీ పనికివస్తుంది. కొందరు ఆడపిల్లలకు ఏడవనెల ఏడవరోజున చేయాలని అంటారు. 6వ నెల ఆరవ రోజు లేదా ఏడవనెల ఏడవ రోజు చేసేటప్పుడు ముహూర్తం చూడనక్కరలేదనీ, ఆ రోజున ఏ తిథి అయినా మంచిదేననీ అంటారు.
తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు?
తొలితీర్థం శరీర శుద్ధికి, శుచికి. రెండవ తీర్థం ధర్మ, న్యాయ ప్రవర్తనకు, మూడవ తీర్థం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం కొరకు.
ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుంది?
గృహంలో ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుంది. నది ప్రాంతంలో చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది. గోశాలలో చేస్తే వంద రెట్లు, యాగశాలలో అంతకు మించి ఫలితం వస్తుంది. పుణ్య ప్రదేశాల్లో, దేవతా సన్నిధిలో చేస్తే పదివేల రెట్లు వస్తుంది. శివసన్నిధిలో చేస్తే మహోన్నతమైన ఫలం వస్తుంది. పులి తోలు మీద కూర్చుని జపిస్తే మోక్షం కలుగుతుంది. అలాగే వెదురు తడక మీద కూర్చుని జపం చేస్తే దరిద్రం ఆవహిస్తుంది. రాతి మీద కుర్చుని జపిస్తే రోగాలు వస్తాయి. నేల మీద కూర్చొని చేస్తే దుఃఖం, గడ్డి మీద చేస్తే కీర్తి నాశనం అవుతుంది.