
ఒక్క ఎస్సెమ్మెస్ చాలు
ఆడపిల్లలకు ఏదైనా సందేహం కలిగినా... సలహా కావాలన్నా... సమస్య వచ్చినా... వెంటనే ఏం చేస్తారు? ఎవరితో చెప్పుకోవాలా! అంటూ ఆలోచిస్తారు. తమ బాధలను ఆర్చేవారా... తీర్చేవారు లేరనుకుంటే మాత్రం మనసు బరువు దింపుకునే పని కూడా పెట్టుకోకుండా తమలో తాము మదనపడిపోతుంటారు. దీనికి ‘తరుణోపాయం’ కనిపెట్టారు ‘తరుణి’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు మమతారఘువీర్. వరంగల్ జిల్లాలో ఈ నెల 11వ తేదీన ప్రపంచ బాలికల దినోత్సవంనాడు ‘తరుణోపాయం’ పేరుతో ఎస్‌ఎమ్‌ఎస్ సదుపాయం ప్రారంభించారు. ‘ఒక్క ఎస్‌ఎమ్‌ఎస్ మీ జీవితాన్ని నిలబెడుతుంది’ అంటున్న తరుణోపాయం గురించి మరిన్ని వివరాలు...
చదువుకునే ఆడపిల్లలు... ఉద్యోగం చేసే అమ్మాయిలు అన్ని విషయాలు తల్లితండ్రులతో చెప్పుకోలేరు. చిన్న చిన్న విషయాలు తోటివారితో చెప్పుకోవచ్చు కాని ఆరోగ్య సమస్యలు, వేధింపులు, ఆర్థిక ఇబ్బందులు, బలవంతపు పెళ్లిళ్లు, ఉద్యోగ సమస్యలు, ర్యాగింగ్....ఆడపిల్ల చుట్టూ ముళ్లకంచెలా ఆవరించి ఇబ్బందిపెట్టే ఏ విషయాన్నైనా 9000243000 అనే నెంబర్‌కి ఎస్‌ఎమ్ ఎస్ పెడితే నిమిషాల్లో పరిష్కారం దొరుకుతుంది. సలహా వంటిదైతే వెంటనే చెప్పేస్తారు. సమస్యలాంటిదైతే ఎలా బయటపడాలో చెప్పడమే కాదు ‘తరుణోపాయం’ కమిటీ దగ్గరుండి పరిష్కరిస్తుంది. ‘‘గత పదిరోజుల్లో బాలికల నుంచి చాలా ఎస్‌ఎంఎస్‌లు వచ్చాయి. వాటిలో చాలావరకూ ఆరోగ్య సమస్యలు, కెరీర్‌కి సంబంధించిన సందేహాలు ఉన్నాయి.
రెండు మూడు వేధింపులకు సంబందించినవి కూడా వచ్చాయి. వచ్చిన ఎస్‌ఎమ్‌ఎస్‌లకు సలహాలు ఇవ్వడానికి, సమస్యల్ని పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన కమిటీలో డాక్టర్ మొదలు ఎడ్వకేట్ వరకూ ఏడుగురు సభ్యులుంటారు. ఏదైనా ఆపదలో ఉన్న అమ్మాయిలను ‘తరుణోపాయం’ ఆపద్బాంధవుడిలా ఆదుకుంటుందని సగర్వంగా చెప్పగలను’’ అని చెప్పారు మమత. మహిళకు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించడానికి బోలెడు స్వచ్ఛంద సంస్థలు టోల్‌ప్రీ నెంబర్లపేరుతో ఇప్పటికే చాలా సేవలు అందిస్తున్నప్పటికీ ‘తరుణోపాయం’లో ఉన్న సౌకర్యం వల్ల ఆపద నుండి వెంటనే బయటపడడమే కాదు సమస్య ఎంత పెద్దదయినా కమిటీసాయంతో పరిష్కరించుకోవచ్చు కూడా.
- భువనేశ్వరి