అదనపు నైపుణ్యాల కోసం ఆన్‌లైన్ కోర్సులు
మై క్యాంపస్ లైఫ్
కాశీ.. దేశంలో పరిచయం అక్కర్లేని ఊరు. ఒకవైపు కాశీ విశ్వేశ్వరుడు, విశాలాక్షి చల్లని చూపులతో.. మరోవైపు పవిత్ర గంగానది ప్రవాహ హోయలతో విలసిల్లుతున్న ఈ నగరం.. ప్రాచీనకాలం నుంచే భారతీయుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. ఇక్కడ కొలువుదీరిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎందరో విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దుతోంది. ఇక్కడ బీటెక్.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో సెకండియర్ చదువుతున్న భువనగిరి పవన్ ప్రియతమ్ తన క్యాంపస్ ముచ్చట్లను మనతో పంచుకుంటున్నారిలా..
ఎక్కువమంది తెలుగు విద్యార్థులే
క్యాంపస్‌లో ర్యాగింగ్ లేదు. ర్యాగింగ్ జరిగినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ఐఐటీ-బెనారస్‌లో నాలుగేళ్ల బీటెక్‌లో అన్ని బ్రాంచ్‌లు కలిపి 300 మంది వరకు తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచి 5 గంటల వరకు ఉన్న సమయంలో తరగతులు, ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఫ్యాకల్టీ చాలా బాగా బోధిస్తారు. బోధనలో భాగంగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్స్, ప్రొజెక్టర్, ఐసీటీలను వినియోగిస్తారు. ఫ్యాకల్టీ ఎలాంటి సందేహాలు ఎదురైనా నివృత్తి చేస్తారు. వారంలో మూడు రోజులు గంట చొప్పున ట్యుటోరియల్ సెషన్స్ ఉంటాయి. అధ్యాపకులతోపాటు ప్రతి ఫ్యాకల్టీకి నలుగురు టీచింగ్ అసిస్టెంట్స్ ఉంటారు. వీరు ట్యుటోరియల్ సెషన్‌లో విద్యార్థుల సందేహాలకు సమాధానాలిస్తారు. ల్యాబ్ ప్రాక్టికల్స్‌లో కూడా సహాయం చేస్తారు. వివిధ పరిశ్రమలు, విద్యా సంస్థల నుంచి గెస్ట్ లెక్చరర్స్ కూడా వచ్చి వివిధ అంశాలపై ఉపన్యసిస్తారు.
ప్రొఫెషనల్ కమ్యూనికేషన్‌ను అధ్యయనం చేశా
సెమిస్టర్‌కు అన్ని ఫీజులు కలుపుకుని దాదాపు రూ.75,000 వరకు ఖ ర్చు అవుతుంది. ప్రతి సెమిస్టర్‌లో పరీక్షలు ఉంటాయి. సెమిస్టర్ మధ్యలో రెండుసార్లు పీరియాడికల్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. సాధారణంగా ప్రతి సెమిస్టర్‌కు ఆరు సబ్జెక్టులు, మూడు ల్యాబ్స్ ఉంటాయి. మొదటి ఏడాదిలో ఇంజనీరింగ్ సబ్జెక్టులతోపాటు తప్పనిసరిగా ప్రొఫెషనల్ కమ్యూనికేషన్‌ను అధ్యయనం చేయాలి. ప్రస్తుతం మొదటి ఏడాది విద్యార్థులకు ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ బదులుగా హ్యుమానిటీస్‌ను ప్రవేశపెట్టారు. నేను ఇప్పటివరకు 10కి 8.08 సీజీపీఏ సాధించాను. ఆన్‌లైన్‌లో కోర్సులు అందించే ఎడెక్స్, కోర్సెరా వెబ్‌సైట్స్‌లో లైనక్స్, నెట్‌వర్కింగ్ కోర్సులు పూర్తి చేశాను. మైక్రోసాఫ్ట్ నుంచి డేటా స్ట్రక్చర్స్ కోర్సును తప్పకుండా పూర్తి చేయాలి. దేశంలో అన్ని ఐఐటీలు కలిసి ప్రారంభించిన ఎన్‌పీటీఈఎల్ వెబ్‌సైట్‌ను కూడా చూస్తుంటాను.
ఇంక్యుబేషన్ సెంటర్ అందించే సేవలెన్నో
విద్యార్థులు ప్లేస్‌మెంట్స్ కంటే స్టార్టప్స్‌ను నెలకొల్పడానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. విద్యార్థుల ఐడియాస్‌ను స్వీకరించి ఉత్తమమైనవాటిని ఎంపిక చేస్తారు. తర్వాత ఫండింగ్ సదుపాయం కూడా కల్పిస్తారు. స్టార్టప్ విజయవంతం కావడానికి కావాల్సిన సూచనలు, సలహాలు కూడా అందిస్తారు. పరిశ్రమల నుంచి నిపుణులను ఆహ్వానించి స్టార్టప్స్‌పై అవగాహన కూడా కల్పిస్తారు.
ల్యాబ్‌లు మినహా
ప్రత్యేకంగా ప్రతి విద్యార్థికీ ఈమెయిల్ ఇస్తారు. క్యాంపస్‌లో జరిగే ఈవెంట్స్‌ను, ముఖ్య విషయాలను మెయిల్ ద్వారా తెలియజేస్తారు. క్యాంపస్‌లో అత్యుత్తమ వసతులు ఉన్నాయి. లేబొరేటరీలు మాత్రం కొంచెం పాతవి. బాస్కెట్‌బాల్, వాలీబాల్, ఫుట్‌బాల్, క్రికెట్, హ్యాండ్‌బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ మైదానాలు ఉన్నాయి. లైబ్రరీలో వై-ఫై సౌకర్యం ఉంది. అన్ని గ్రంథాలు, జర్నల్స్, మ్యాగజైన్స్ లైబ్రరీలో లభిస్తాయి. ఇక దక్షిణ భారత, ఉత్తర భారత వంట కాలను అందించే క్యాంటీన్లు క్యాంపస్‌లో ఉన్నాయి. ఆహారం రుచికరంగా ఉంటుంది.
కలర్‌ఫుల్ ఈవెంట్స్
క్యాంపస్‌లో ప్రతి ఏటా మూడు ఫెస్ట్‌లు నిర్వహిస్తారు. అవి.. టెక్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్, స్పోర్ట్స్ ఫెస్ట్. కల్చరల్ ఫెస్ట్‌లో భాగం గా డ్యాన్సులు, పాటలు, డ్రామాలు.. టెక్ ఫెస్ట్‌లో రోబో కాంపిటీషన్స్ ఉంటాయి. కోర్సు పూర్తయ్యాక క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో జాబ్ సాధించి రెండేళ్లు ఏదైనా కంపెనీలో పనిచేస్తాను. తర్వాత జీఆర్‌ఈ రాసి విదేశాల్లో ఎంఎస్ చదువుతా.