
విదేశీ యూనివర్సిటీలో సేంద్రియ సేద్యంపై ఉన్నత చదువు.. పురుగులమందులమ్మే బహుళ జాతి కంపెనీలో లక్షణమైన ఉద్యోగం.. లక్షల్లో జీతం.. ఏసీ కారు.. ఇవేవీ ఆయనకు సంతృప్తినివ్వలేదు! ఏటేటా తన జీతం పెరుగుతున్నా తాను అమ్మిన పురుగుమందులు రైతుల జీవితాల్లో నిప్పులు పోస్తుండటం అతన్ని ఆలోచనలో పడేసింది. కేవలం తన ఉద్యోగం తన సంపాదన గురించి మాత్రమే∙ఆలోచించకుండా.. సుస్థిర వ్యవసాయ పద్ధతుల ద్వారా చిన్న, సన్నకారు రైతుల జీవితాలకు గౌరవప్రదమైన నికరాదాయం అందించేలా తనకు చేతనైనది చేయాలనే తపన నిత్యం ఆయన మదిని తొలచివేసింది.
ఆ తపనే ఉద్యోగానికి స్వస్తి చెప్పి సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారేలా చేసింది. సేంద్రియ రైతుకు ఆదాయ భద్రత లభించాలంటే.. చైతన్యవంతమైన వినియోగదారులు విశ్వసించే పారదర్శక మార్కెటింగ్ గొలుసును నిర్మించడం ఒక్కటే మార్గమని బలంగా నమ్ముతున్నారు. ఆయన పేరు అంబవరం అనిల్‌కుమార్. పుట్టిన ఊరు కడప. విదేశీ కంపెనీలతో ముందస్తు కొనుగోలు ఒప్పందాల మేరకు మన చిన్న, సన్నకారు రైతులతో సేంద్రియ వ్యవసాయం చేయిస్తున్నారు.
రాలిన బత్తాయి పిందెల ద్వారా రాయలసీమ రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు... సేంద్రియ పత్తి ద్వారా విజయనగరం గిరిజన రైతాంగానికి ఆదాయ భద్రత కల్పించేందుకు కృషి చేస్తుండటం విశేషం...
మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన యువకుడు అంబవరం అనిల్ కుమార్ నెదర్లాండ్స్‌లోని వాగెనింగెన్ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ(సేంద్రియ వ్యవసాయం) చదివి, ఆరేళ్ల పాటు బహుళజాతి సంస్థల్లో పనిచేశారు. గాలిలో దీపంలా మారిన రైతు జీవితాలను మార్చాలంటే మార్కెటింగ్ వ్యవస్థలో గుణాత్మక మార్పునకు శ్రీకారం చుట్టాల్సిన ఆవశ్యకతను గుర్తించి ఉద్యోగానికి స్వస్తి చెప్పారు. గ్రామీణ వికాస్ కేంద్రం అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా రైతుల అభ్యున్నతి కోసం అనేక జిల్లాల్లో పనిచేస్తున్నారు.
స్మార్ట్ ఫోన్ ద్వారా రైతులు, వినియోగదారుల అనుసంధానం
అట్టడుగున పత్తి రైతు బతుకు పచ్చగా ఉండాలంటే.. టీషర్టులు, జీన్స్ వస్త్రాలు కొనుగోలు చేసే దేశ విదేశీ వినియోగదారుల్లో అందుకు సంబంధించిన చైతన్యాన్ని రగిలించాలి. ఇది వినడానికి కష్టతరమని తోచినా అసాధ్యం కాదంటున్నారు అనిల్‌కుమార్. చిన్న, సన్నకారు సేంద్రియ పత్తి రైతులు అనుసరిస్తున్న పర్యావరణ పరిరక్షణ పద్ధతులు, వారి ఆర్థిక అవసరాల గురించి విశ్వసనీయమైన, పారదర్శకమైన అమ్మకపు గొలుసు ద్వారా దేశ విదేశాల్లో చైతన్య సంపన్నులైన వినియోగదారులకు తెలియజెప్పగలిగితే.. మన బడుగు రైతుల జీవితాల్లో అనిశ్చితి చీకట్లను పారదోలి శాశ్వత వెలుగులు నింపవచ్చని అనిల్‌కుమార్ మనసా వాచా కర్మణా నమ్ముతున్నారు. టీషర్టుపై ముద్రించే కోడ్‌ను స్మార్ట్ ఫోన్‌తో స్కాన్ చేస్తే.. దాన్ని పండించిన రైతు వివరాలు, అనుసరించిన సాగు పద్ధతి వంటి నమ్మకమైన వివరాలు ఒకటిన్నర నిమిషంలో వినియోగదారునికి చప్పున అర్థమయ్యేలా నెదర్లాండ్స్ నిపుణులతో కలిసి సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. తాము చెల్లించే డబ్బు ఆ రైతుకు భద్రంగా చేరుతుందన్న పారదర్శక మార్కెటింగ్ చైన్‌ను నిర్మిస్తే.. అదనంగా డబ్బు చెల్లించడానికి కూడా చైతన్యవంతులైన వినియోగదారులు వెనకాడబోరన్నది ఈ ప్రయత్నం వెనుక ఉన్న భావన.
ఉత్తరాంధ్రలో సేంద్రియ పత్తికి శ్రీకారం!
అన్విత ఆర్గానిక్ కాటన్ ప్రోగ్రామ్ ద్వారా విజయనగరం జిల్లాలో ఈ ఏడాది 46 మంది గిరిజన రైతులతో 50 ఎకరాల్లో సేంద్రియ పత్తి ప్రయోగాత్మక సాగుకు శ్రీకారం చుట్టారు. జట్టు ట్రస్ట్ తోడ్పాటుతో కొత్తవలస, దోరజమ్ము, బుడ్డెంకర్జ ప్రాంతాల్లో జన్యుమార్పిడి చేయని హైబ్రిడ్ విత్తనాల ద్వారా సేంద్రియ పత్తిని పండిస్తున్నారు. డచ్ కంపెనీలతో సేంద్రియ పత్తి కొనుగోలు ఒప్పందం చేసుకున్న తర్వాతే రైతులతో సాగు చేయిస్తున్నారు. గతంలో రసాయనిక పద్ధతుల్లో పత్తి సాగు చేసే గిరిజన రైతులతో ఇప్పుడు పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయిస్తున్నారు. పంట చీడపీడల్లేకుండా చక్కగా ఎదుగుతుండటంతో రైతులు సంతృప్తితో ఉన్నారు.
పురుగుమందుల్లో 99 శాతం వృథా..
దేశంలో పత్తి సాగు విస్తీర్ణం 14 శాతం అయినప్పటికీ 54 శాతం రసాయన పురుగుమందులను చల్లుతున్నారు. ఇందులో 99 శాతం తిరిగి గాలిలో, భూమిలో, నీటిలో కలిసి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని హరిస్తున్నాయి. రసాయనాల వల్ల ప్రతీ ఏటా పెట్టుబడులు పెరుగుతుండ టంతో పాటు భూసారం తగ్గడం, దిగుబడి లోపించటం వంటి సమస్యలతో గిరిజన రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుఖల్లు పంచాయతీ బుడ్డెంకర్జ, కొత్తవలస, దోరజమ్ము గ్రామాల్లో ఈ ఏడాది పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పత్తిని సాగు చేయిస్తున్నారు.
రసాయన ఎరువులు, పురుగుమందులతో ఎకరా పత్తి సాగు చేస్తే రూ. 20 వేల వరకు ఖర్చయ్యేదని, ఖర్చులు పోగా రూ.5 వేల నుంచి రూ.10 వేలు ఆదాయం వచ్చేదని గిరిజన రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది విత్తనాలు మాత్రమే కొన్నామని, జీవామృతం, కషాయాలను కొద్దిపాటి శ్రమతో తయారు చేసుకుంటున్నామని మంచి ఆదాయం వస్తుందని ఆశిస్తున్నామని రైతులు అంటున్నారు.
–బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం
అధిక ధర ఇవ్వడానికి విదేశీ వినియోగదారుల సంసిద్ధత!
చిన్న, సన్నకారు రైతుల జీవితాలు మార్కెట్ మాయాజాలం వల్ల గాలిలో దీపాలుగా మారాయి. ఈ మార్కెట్ వ్యవస్థలో రైతు శ్రమకు గుర్తింపు, విలువ లేవు. సప్లై చైన్‌ను పారదర్శకంగా, విశ్వసనీయమైన రీతిలో ఉంచగలిగితే వ్యవస్థాగత మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. చిన్న, సన్నకారు రైతులు పండించే సేంద్రియ పత్తితో తయారైన టీషర్టులు, జీన్స్ వస్త్రాలను అధిక ధర చెల్లించైనా కొనడానికి దేశవిదేశాల్లో చైతన్యవంతమైన వినియోగదారులు సిద్ధంగా ఉన్నారు. ఈ మార్గంలో చిన్న రైతుకు ఆదాయ భద్రత కల్పించడమే మా ప్రయత్నం. డచ్ కంపెనీలతో ముందస్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆ భరోసాతోనే ఇప్పుడు విజయనగరం జిల్లాలో జట్టు ట్రస్టు తోడ్పాటుతో 46 మంది రైతులతో కలిసి పనిచేస్తున్నాం. అమెరికా, ఐరోపా, బెల్జియం కంపెనీలతో ఇప్పుడు మాట్లాడుతున్నాం. మున్ముందు 50–60 గ్రామాల్లో కనీసం 5 వేల రైతు కుటుంబాలతో సేంద్రియ పత్తి సాగు చేయించాలన్నది మా లక్ష్యం.
– అంబవరం అనిల్‌కుమార్ (84890 51484), డైరెక్టర్, గ్రామీణ వికాస కేంద్రం anilwur@gmail.com
బత్తాయి పిందెల ద్వారా ఎకరానికి రూ. 30 వేల ఆదాయం!
మార్కెట్ మాయాజాలంలో చిక్కుకున్న బత్తాయి రైతులకు రాలిన బత్తాయి పిందెల విక్రయం ద్వారా అదనపు ఆదాయం పొందే మార్గాన్ని అనిల్‌కుమార్ అన్వేషించడం విశేషం. బత్తాయి మొక్కలు నాటిన ఐదేళ్లకు కాపుకొస్తాయి. వంద పిందెలు వస్తే కాయలుగా పెరిగేది సుమారు 20% మాత్రమే. సూక్ష్మధాతువుల లోపమో, తెగుళ్లో మరొకటో ఇందుకు కారణమవుతున్నాయి. ఇలా అర్థాంతరంగా రాలిపోతున్న రైతుల ఆశలను కొంతమేరకైనా తీర్చేందుకు అనిల్ కొత్త ఆలోచన చేశారు. ఈ పిందెల్లో హెస్పారిడిన్ అనే ఫ్లావనాయిడ్ ఉంటుంది. అది ఔషధాల తయారీకి ఉపయోగపడుతుంది. ఈ విషయం గ్రహించిన అనిల్‌కుమార్ కడప జిల్లాలో గత మూడేళ్లుగా రైతులు అదనపు ఆదాయం పొందేందుకు దోహదపడ్డారు. సుమారు 40 మంది రైతుల నుంచి పది మెట్రిక్ టన్నుల రాలిన పిందెలు సేకరించారు. జి.వి.కె. కంపెనీ, ఐరోపాకు చెందిన ఫార్మాæ కంపెనీలకు విక్రయించారు. ఎకరానికి సగటున కనీసం రూ. 30 వేల వరకు రాలిన పిందెల ద్వారా బత్తాయి రైతులకు ఆదాయం లభిస్తోందని అనిల్‌కుమార్ చెప్పారు.
సేంద్రియ ఎరువులు, కషాయాలను మేమే తయారుచేసుకుంటున్నాం..
ఘన జీవామృతం, జీవామృతం, నీమాస్త్రం వంటి వాటిని సొంతంగానే తయారు చేసుకుంటున్నాం. ఖర్చు లేదు. గతంలో రసాయన ఎరువులు కొనేందుకు ఎకరాకు సుమారు రూ. 20 వేలు ఖర్చయ్యేది. సొంతంగానే పిచికారీ చేయడం వల్ల ఆరోగ్యం పాడయ్యేది. ఇప్పుడు ఆ బాధ లేదు.
– గుమ్మడి కృష్ణారావు, గిరిజన పత్తి రైతు,బుడ్డెంకర్జ, విజయనగరం జిల్లా
అధిక దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం
సేంద్రియ ఎరువు తయారు చేసుకొని వాడటం వల్ల ప్రస్తుతం పంట ఆశాజనకంగా ఉంది. గతంలో రసాయన ఎరువులు వాడడం వల్ల పెట్టుబడి పెరగటంతో పాటు మద్దతు ధర లేకపోవడంతో నష్టాలు వచ్చాయి. కుటుంబ పోషణ కష్టమయ్యేది. సేంద్రియ పద్ధతి వల్ల అధిక ఖర్చు బాగా తగ్గింది. దిగుబడి కూడా అధికంగానే వస్తుందనుకుంటున్నాం.
– కొండగొర్రి గణపతి, గిరిజన పత్తి రైతు,కొత్తవలస, విజయనగరం జిల్లా