కల్పవల్లి... పైడితల్లి! | Paiditalli Srimanu Utsavam in Vizianagaram | Sakshi
Sakshi News home page

కల్పవల్లి... పైడితల్లి!

Published Wed, Oct 16 2013 11:51 PM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM

Paiditalli Srimanu Utsavam in Vizianagaram

విజయనగరంలో కొలువైన ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లమ్మను ప్రజలు ఆడబిడ్డగా ఆడపడుచుగా భావించి ఆత్మీయంగా అక్కున చేర్చుకుంటారు. ఆమెను ఏటా మూడునాలుగు సార్లయినా తలచుకుని చీరా, సారె పెట్టి మొక్కుతీర్చుకుంటారు.
 
కల్పవల్లి... పైడితల్లి!
అమ్మవార్లను, గ్రామదేవతలను పూజించడం మన రాష్ట్రంలో చిరకాలంగా ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా చాలా చోట్ల అమ్మవారిని, గ్రామ దేవతను తల్లిగా, ఇంటి ఇలవేల్పుగా భావించి కొలవడం సాధారణం. అలాగే విజయనగరంలో కొలువైన ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లమ్మను  ప్రజలు  ఆడపడుచుగా భావించి ఆత్మీయంగా అక్కున చేర్చుకుంటారు. ఆమెను ఏటా మూడునాలుగు సార్లయినా తలచుకుని చీరా, సారె పెట్టి మొక్కుతీర్చుకుంటారు. వాస్తవానికి విజయనగరం సంస్థానాధీశుల తోబుట్టువు అయిన పైడితల్లమ్మను ఆ సంస్థానం పరిధిలోని ప్రజానీకమంతా ఆడపడుచుగానే ఆదరించి నిత్యపూజలు చేస్తున్నారు.
 
 స్థలపురాణం: 1757లో బొబ్బిలి రాజులకు, విజయనగరాన్ని పాలిస్తున్న విజయరామరాజుకు యుద్ధం ప్రారంభమైంది. ఈ సందర్భంగా విజయనగర ప్రభువులు ఫ్రెంచి సేనాని బుస్సీ దొర మద్దతుతో బొబ్బిలి సంస్థానం పాలకుడైన రంగారావుపై దండెత్తారు.  విజయరామరాజు సోదరి అయిన చిన్నారి పైడిమాంబ యుద్ధం వల్ల వినాశనం తప్ప ఒరిగేదేమీ లేదని భావించి,   యుద్ధాన్ని ఆపడానికని స్వయంగా గుర్రపుబగ్గీపై బయల్దేరుతుంది.

మార్గమధ్యంలో ఉండగానే తన సోదరుడు విజయరామరాజు బొబ్బిలి వీరుడైన తాండ్రపాపారాయుడి చేతిలో హతమైనట్లు తెలుసుకుని హతాశురాలవుతుంది.  ఆమె సృ్పహ తప్పి పడిపోగా వెంటనున్న అనుచరుడు పతివాడ అప్పలనాయుడు ఆమెను సేదదీర్చారు.  తానిక జీవించజాలనని, దేవిలో ఐక్యమవుతున్నానని, అయితే తన ప్రతిమ మాత్రం విజయనగరంలోని పెద్ద చెరువులో లభ్యమవుతుందని, దాన్ని తీసుకొచ్చి నిత్యపూజలు చేయాలని చెప్పి ఆమె తనువు చాలిస్తుంది.  ఆమె చెప్పినట్లుగానే పెద్ద చెరువులో వెతకగా అమ్మవారి ప్రతిమ లభిస్తుంది.

ఈ ప్రతిమనే రైల్వే స్టేషన్ సమీపంలో ప్రతిష్టించి, దీన్ని వనం గుడిగా పేర్కొంటూ పూజలు చేస్తుంటారు. అనంతరం అమ్మవారి కోసం మూడు లాంతర్ల సమీపంలో చదురు గుడిని నిర్మించారు. ఈ నేపథ్యంలో అమ్మవారిని వైశాఖ మాసం శుద్ధ నవమి వరకూ వనం గుడిలో ఉంచుతారు. దశమినాడు భారీ ఊరేగింపుతో చదురు గుడికి తీసుకొస్తారు.

విజయదశమి తరువాత వచ్చే సోమ, మంగళవారాల్లో విజయనగరం భక్తులతో పోటెత్తుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని చీర, సారె, పసుపు కుంకాలు అర్పిస్తారు. అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించే విజయనగరం ప్రజానీకం ఈ ఉత్సవాల సందర్భంగా తమ  అక్కచెల్లెళ్లను ఇళ్లకు ఆహ్వానించి విందు ఏర్పాటు చేసి చీర, పసుపు కుంకుమలతో సత్కరించి పంపుతారు.  
 
 పండగంటే ఇలా ఉండాలి... పైడితల్లమ్మ పండగను రెండ్రోజులపాటు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగేది తొలేళ్ల ఉత్సవం. ఇది ప్రత్యేకంగా రైతుల కోసం నిర్వహించేది. అమ్మవారి ఆశీస్సులతో సాగు ప్రారంభిస్తే పంటలు బాగా పండుతాయని రైతుల విశ్వాసం. ఈ సందర్భంగా ఘటాలను ఊరేగిస్తారు. మేళతాళాలతో ఊరేగింపు ఉంటుంది.
 
 సిరిమాను చూడాల్సిందే..
 అమ్మవారి పండగలో ప్రధానమైనది సిరిమాను ఉత్సవం. ఈ ఉత్సవానికి నెల రోజుల ముందుగా ప్రధానార్చకుడి కలలోకి అమ్మవారు వచ్చి ‘ఫలానాచోట సిరిమానుకు సంబంధించిన చెట్టుంది. దాన్ని తీసుకురండి...’ అని ఉపదేశిస్తారని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే అమ్మవారు సూచించిన పొడుగాటి చింత మానుతో ఎత్తై సిరిమానును ఏర్పాటు చేస్తారు. దీని చివర్న అమ్మవారి ఆలయ ప్రధానార్చకుడు కూర్చుంటారు. ఈ సందర్భంగా సిరిమాను ఊరేగిస్తారు. అనంతరం చదురు గుడి నుంచి కోట వరకు మూడుసార్లు సిరిమానును అటు-ఇటు నడుపుతారు.   ఈ సందర్భంగా పులివేషాలు, సాముగరిడీల వంటి పోటీలుంటాయి. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ 21, 22 తేదీల్లో ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
 
 - కొప్పర గాంధీ, సాక్షి ప్రతినిధి, విజయనగరం
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement