Paiditallamma
-
ప్రశాంతంగా సిరిమానోత్సవం
విజయనగరం క్రైం: పైడితల్లమ్మ సిరిమానోత్సవం మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచి పోలీ సులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం పూట పార్వతీపురం ఏఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు నిర్వహించా రు. ప్రతి క్యూలైన్‌ను పార్వతీపురం ఏఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ స్వయంగా పరిశీలించి భక్తులకు ఎటువంటి ఇబ్బందు లు తలెత్తకుండా చేశారు. పైడితల్లమ్మ గుడి వద్ద విజయనగరం డీఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్, అడిషనల్ ఎస్పీ ఎ.రమణ బందోబస్తును పర్యవేక్షించారు. సిరిమాను తిరిగే పైడితల్లమ్మ గుడి నుంచి కోట వరకు సుమారు 500 మంది సిబ్బందిని నియమించారు. సిరిమాను తిరగక ముందు ఒకసారి ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్, రెండుసార్లు అదనపు ఎస్పీ ఎ.వి.రమణ సిరిమాను తిరిగే ప్రాంతంలో ఉన్న బందోబస్తును పర్యవేక్షించారు. సిరిమాను తిరిగే ప్రాంతమంతా పోలీసు బలగాలను మొహరించారు. సిరిమాను తిరగక ముందు ఎస్పీ సిరిమాను వద్ద ఉండగా, అడిషనల్ ఎస్పీ కోట వద్ద ఉండి బందోబస్తును పరిశీలించారు. పైడితల్లమ్మ గుడి వెనుక భాగంలో భక్తులు బారీకేడ్లుపై పడి ముందుకు రావడానికి ప్రయత్నించడంతో పోలీసులు నిలువరించారు. గురజాడ అప్పారావు రోడ్డులో ఆకతాయిలు మహిళలపై పడడంతో పోలీసులు వారిని తరిమారు. కొన్ని సందర్భాలలో భక్తులు సిరిమాను తిరిగే ప్రాంతంలోకి వచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు నిలువరించారు.మొత్తంగా ప్రశాంతంగా సిరిమానోత్సవం ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎస్పీని గార్డులతో మూసిన పోలీసులు సిరిమాను మొదటిసారి తిరిగిన సమయంలో ఎస్పీ నవదీప్సింగ్గ్రేవాల్ కోట వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో సిరిమాను కోట వద్దకు రావడంతో భక్తులు అరటిపళ్లను పూజారిపై విసిరారు. ఈ సమయంలో ఎస్పీకి సెక్యూరిటీగా వచ్చిన సిబ్బంది గార్డులతో ఆయనను మూసి భద్రతగా నిలిచారు. సిరిమానోత్సానికి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. పట్టణంలోకి వచ్చే వాహనాలు, ట్రాఫిక్ ఆంక్షలను పక్కాగా అమలు చేయడంలో పోలీసులు సఫలీకృతులయ్యూరు. విజయనగరం మున్సిపాలిటీ: కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లి సిరిమానోత్సవం సందర్భంగా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సహాయ, సహాకారాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనను మొత్తం లక్షన్నర మంది సందర్శించారు. మూడు లక్షల రూపాయల వ్యయంతో స్థానిక మహారాజ సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను సోమ, మంగళవారాల్లో భక్తుల సందర్శనార్ధం ఏర్పాటు చేశారు. ఇందు లో భాగంగా తొలేళ్లు జరిగిన సోమవారం సుమారు లక్ష మంది భక్తులు సందర్శనకు వచ్చినట్లు అధికారు లు అంచనా వేస్తుండగా సిరిమానోత్సవం జరిగిన మంగళవారం మరో 50 వేల మంది సందర్శించినట్లు చెబుతున్నారు. తొలి రోజు ప్రదర్శనలో ఉంచిన బౌన్సా యి మొక్కలు, గ్లాస్ పెయింటింగ్స్, బుద్ధుడు, వినాయక విగ్రహాలు, కూరగాయలతో చేసిన వివిద ఆకృతుల ప్రదర్శనలు, అమ్మవారి సైకత శిల్పం ప్రదర్శనల్లో ఎటువంటి మార్పు లేకపోగా... ఐస్‌తో తయారు చేసిన వినాయక ప్రతిరూపం అందరినీ ఆకట్టుకుంది. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఆయా శాఖల పరంగా లబ్ధిదారులకు సబ్సిడీపై అందజేసే ఉత్పత్తులను రెండవ రోజు ప్రదర్శనలో కొనసాగించారు. ఈ ప్రదర్శనను జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఎన్.మోహనరావు, జిల్లా ఉద్యానశాఖ సహాయ సంచాలకులు పి.లక్ష్మణప్రసాద్ పర్యవేక్షించారు. కిక్కిరిసిన ఆర్టీసీ కాంప్లెక్స్ విజయనగరం అర్బన్: జిల్లా ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి పండుగ ఆర్టీసీకి సందడి తెచ్చింది. మూడు రో జులుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రయాణికుల రాకపోకలతో రద్దీ నెలకొంది. భక్తులకు రవాణా సేవలందించడంతో పాటు ఆదాయాన్ని తెచ్చుకొనే ప్రయత్నంలో ఆర్టీసీ అధికారులు నానాయాతన పడ్డారు. పార్వతీపురం, సాలూ రు, విశాఖ, శ్రీకాకుళం, పాలకొండ డిపోల అధికారులు, సిబ్బంది ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లోని ఆవరణలో విధులు నిర్వహించి సంబంధిత డిపో బస్సుల్లో ప్రయాణికులను దగ్గరుండి ఎక్కించి సేవలందించారు. దీంతో కాంప్లెక్స్ ప్రయాణికులతో కళకళలాడింది. భక్తులకు అందుబాటు లో సర్వీసులను అందజేస్తూ సంస్థకు ఆదాయాన్ని చేకూర్చడానికి ఆర్టీసీ అధికారులు కృషిచేశారు. జిల్లాలోని వివి ధ డిపోలనుంచి 150సర్వీసులను అదనంగా ఏర్పాటుచేసి సేవలను అందుబాటులో ఉంచారు. ప్రధానంగా విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, పాలకొండ, సాలూరు, పార్వతీ పురం వైపు ఏర్పాటు చేసిన సర్వీసుల నుంచి ప్రయాణికు ల రాకపోకలు అధికంగా సాగాయి. పట్టణానికి వచ్చిన బస్సులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రద్దీగా ఉ న్నాయి. సిరిమానోత్సవం తరువాత తిరుగు ప్రయాణం చేసే ప్రయాణికులు పెరిగారు. సాయంత్రానికి ప్రయాణికుల రద్దీ పెరిగింది. బుధ, గురువారాలలో కూడా తిరుగు ప్రయాణ సర్వీసులను అందుబాటులో ఉంచుతామని డి ప్యూటీ సీటీఎం కె.శ్రీనివాసరావు తెలిపారు. సర్వీసుల ఏ ర్పాటులో ఆర్ఎం అప్పన్న, జోనల్ ఈడీ కార్యదర్శి వేణుగోపాల్, విజయనగరం డిపో మేనేజర్ పద్మావతి, స్టేషన్ మాస్టర్ రమేష్ తదితరులు తమ విధులు నిర్వహించారు. -
‘ఎఫ్ఐఆర్’పై హైకోర్టుకు ఢిల్లీ సర్కారు
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్: పైడితల్లమ్మ పండగ సందర్భంగా విజయనగరం చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో పోలీసులను భారీగా మోహరించనున్నారు. పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి బొత్ససత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు డీసీసీబీ కార్యాలయం వద్ద నుంచి సిరిమాను ఉత్సవాన్ని తిలకిస్తారు. ఆ పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో పోలీసు బలగాలను మోహరిస్తున్నట్టు సమాచారం. బొత్స రాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉం డేందుకే బలగాలను భారీగా పెంచుతున్నట్టు సమాచారం. సిరిమాను తిరిగే ప్రాం తాల్లోని భవనాల యజమానులకు పోలీసులు నోటీసులు జారీచేస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాల యజమానులతో పాటు సిరిమాను తిరిగే పరిసరాల్లో భవనాలు, షాపుల యజమానులకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఆ రోజుషాపులు మూసివేయాలని బెదిరిస్తున్నట్టు సమాచారం. గుర్తుతెలియని వ్యక్తులను మేడల మీదకు అనుమతించరాదని, ఏదైనా జరిగితే బాధ్యత మీదేనని పోలీసులు బెదిరిస్తున్నట్లు షాపుల యజమానులు చెబుతున్నారు. సమైక్యాంధ్ర ఆందోళనల కారణంగా నష్టపోయిన ఆదాయాన్ని... పండగ రోజుల్లో పెరిగే అమ్మకాల ద్వారా కొంతవరకైనా పొందవచ్చని ఆశలు పెట్టుకున్న వ్యాపారులకు పోలీసుల హెచ్చరికలు అశనిపాతమయ్యాయి. సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా పట్టణంలోని భారీ స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం జరిగింది. ప్రధానంగా మంత్రి, పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణకు చెందిన ఆస్తులపై ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. ఈ నెల 4, 5 తేదీల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విజయనగరంలో విధ్వంసకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. 6వ తేదీనుంచి పట్టణంలో కర్ఫ్యూ విధించారు. అయినా 6, 7 తేదీల్లో కూడా కర్ఫ్యూను సైతం ధిక్కరించి ఆందోళనలు చేసి బొత్సతీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జిల్లాకు వచ్చేందుకు ఆయన వెనుకంజ వేశారు. కర్ఫ్యూ అమలు చేసిన పోలీసులు సమ్యైదులను అరెస్ట్ చేయడంతో భీతిల్లిన పట్టణ ప్రజలు బయటకు రాలేదు. పరిస్థితులు సద్దుమణగడంతో దసరా సందర్భంగా భారీ బందోబస్తు మధ్య జిల్లాలో ట్రయిల్ రన్‌గా అడుగుపెట్టారు. పైడితల్లమ్మ పండగ సందర్భంగా ప్రతి ఏడాది మంత్రి బొత్ససత్యనారాయణ అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఇటీ వల జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ ఏడాది పైడితల్లమ్మ పండుగ బందోబస్తుకు సుమారు 900 మంది పోలీసులను నియమించేవారు. ఈ ఏడాది సుమారు 2500 మంది వరకు నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్ఏఎఫ్, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఏఆర్, సివిల్ పోలీస్ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. పైడితల్లమ్మ పండుగకు ఇంత భారీ స్థాయిలో పోలీసు బందోబస్తును నియమించడంతో వేరే ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పండగకు వెళ్లాలా?, వద్దా? అన్న సంశయంలో పడ్డారు. జిల్లా వాసులు కూడా ఎప్పుడూ ఉండేలా ఈ సారి పండగ సరదా ఉండదని, తమకిదేం బాధని వాపోతున్నారు. -
కల్పవల్లి... పైడితల్లి!
విజయనగరంలో కొలువైన ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లమ్మను ప్రజలు ఆడబిడ్డగా ఆడపడుచుగా భావించి ఆత్మీయంగా అక్కున చేర్చుకుంటారు. ఆమెను ఏటా మూడునాలుగు సార్లయినా తలచుకుని చీరా, సారె పెట్టి మొక్కుతీర్చుకుంటారు. కల్పవల్లి... పైడితల్లి! అమ్మవార్లను, గ్రామదేవతలను పూజించడం మన రాష్ట్రంలో చిరకాలంగా ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా చాలా చోట్ల అమ్మవారిని, గ్రామ దేవతను తల్లిగా, ఇంటి ఇలవేల్పుగా భావించి కొలవడం సాధారణం. అలాగే విజయనగరంలో కొలువైన ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లమ్మను ప్రజలు ఆడపడుచుగా భావించి ఆత్మీయంగా అక్కున చేర్చుకుంటారు. ఆమెను ఏటా మూడునాలుగు సార్లయినా తలచుకుని చీరా, సారె పెట్టి మొక్కుతీర్చుకుంటారు. వాస్తవానికి విజయనగరం సంస్థానాధీశుల తోబుట్టువు అయిన పైడితల్లమ్మను ఆ సంస్థానం పరిధిలోని ప్రజానీకమంతా ఆడపడుచుగానే ఆదరించి నిత్యపూజలు చేస్తున్నారు. స్థలపురాణం: 1757లో బొబ్బిలి రాజులకు, విజయనగరాన్ని పాలిస్తున్న విజయరామరాజుకు యుద్ధం ప్రారంభమైంది. ఈ సందర్భంగా విజయనగర ప్రభువులు ఫ్రెంచి సేనాని బుస్సీ దొర మద్దతుతో బొబ్బిలి సంస్థానం పాలకుడైన రంగారావుపై దండెత్తారు. విజయరామరాజు సోదరి అయిన చిన్నారి పైడిమాంబ యుద్ధం వల్ల వినాశనం తప్ప ఒరిగేదేమీ లేదని భావించి, యుద్ధాన్ని ఆపడానికని స్వయంగా గుర్రపుబగ్గీపై బయల్దేరుతుంది. మార్గమధ్యంలో ఉండగానే తన సోదరుడు విజయరామరాజు బొబ్బిలి వీరుడైన తాండ్రపాపారాయుడి చేతిలో హతమైనట్లు తెలుసుకుని హతాశురాలవుతుంది. ఆమె సృ్పహ తప్పి పడిపోగా వెంటనున్న అనుచరుడు పతివాడ అప్పలనాయుడు ఆమెను సేదదీర్చారు. తానిక జీవించజాలనని, దేవిలో ఐక్యమవుతున్నానని, అయితే తన ప్రతిమ మాత్రం విజయనగరంలోని పెద్ద చెరువులో లభ్యమవుతుందని, దాన్ని తీసుకొచ్చి నిత్యపూజలు చేయాలని చెప్పి ఆమె తనువు చాలిస్తుంది. ఆమె చెప్పినట్లుగానే పెద్ద చెరువులో వెతకగా అమ్మవారి ప్రతిమ లభిస్తుంది. ఈ ప్రతిమనే రైల్వే స్టేషన్ సమీపంలో ప్రతిష్టించి, దీన్ని వనం గుడిగా పేర్కొంటూ పూజలు చేస్తుంటారు. అనంతరం అమ్మవారి కోసం మూడు లాంతర్ల సమీపంలో చదురు గుడిని నిర్మించారు. ఈ నేపథ్యంలో అమ్మవారిని వైశాఖ మాసం శుద్ధ నవమి వరకూ వనం గుడిలో ఉంచుతారు. దశమినాడు భారీ ఊరేగింపుతో చదురు గుడికి తీసుకొస్తారు. విజయదశమి తరువాత వచ్చే సోమ, మంగళవారాల్లో విజయనగరం భక్తులతో పోటెత్తుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని చీర, సారె, పసుపు కుంకాలు అర్పిస్తారు. అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించే విజయనగరం ప్రజానీకం ఈ ఉత్సవాల సందర్భంగా తమ అక్కచెల్లెళ్లను ఇళ్లకు ఆహ్వానించి విందు ఏర్పాటు చేసి చీర, పసుపు కుంకుమలతో సత్కరించి పంపుతారు. పండగంటే ఇలా ఉండాలి... పైడితల్లమ్మ పండగను రెండ్రోజులపాటు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగేది తొలేళ్ల ఉత్సవం. ఇది ప్రత్యేకంగా రైతుల కోసం నిర్వహించేది. అమ్మవారి ఆశీస్సులతో సాగు ప్రారంభిస్తే పంటలు బాగా పండుతాయని రైతుల విశ్వాసం. ఈ సందర్భంగా ఘటాలను ఊరేగిస్తారు. మేళతాళాలతో ఊరేగింపు ఉంటుంది. సిరిమాను చూడాల్సిందే.. అమ్మవారి పండగలో ప్రధానమైనది సిరిమాను ఉత్సవం. ఈ ఉత్సవానికి నెల రోజుల ముందుగా ప్రధానార్చకుడి కలలోకి అమ్మవారు వచ్చి ‘ఫలానాచోట సిరిమానుకు సంబంధించిన చెట్టుంది. దాన్ని తీసుకురండి...’ అని ఉపదేశిస్తారని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే అమ్మవారు సూచించిన పొడుగాటి చింత మానుతో ఎత్తై సిరిమానును ఏర్పాటు చేస్తారు. దీని చివర్న అమ్మవారి ఆలయ ప్రధానార్చకుడు కూర్చుంటారు. ఈ సందర్భంగా సిరిమాను ఊరేగిస్తారు. అనంతరం చదురు గుడి నుంచి కోట వరకు మూడుసార్లు సిరిమానును అటు-ఇటు నడుపుతారు. ఈ సందర్భంగా పులివేషాలు, సాముగరిడీల వంటి పోటీలుంటాయి. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ 21, 22 తేదీల్లో ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. - కొప్పర గాంధీ, సాక్షి ప్రతినిధి, విజయనగరం