అమ్మవారి జాతరకు భారీ బందోబసు
Published Sun, Oct 20 2013 2:38 AM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్: పైడితల్లమ్మ పండగ సందర్భంగా విజయనగరం చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో పోలీసులను భారీగా మోహరించనున్నారు. పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి బొత్ససత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు డీసీసీబీ కార్యాలయం వద్ద నుంచి సిరిమాను ఉత్సవాన్ని తిలకిస్తారు. ఆ పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో పోలీసు బలగాలను మోహరిస్తున్నట్టు సమాచారం. బొత్స రాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉం డేందుకే బలగాలను భారీగా పెంచుతున్నట్టు సమాచారం. సిరిమాను తిరిగే ప్రాం తాల్లోని భవనాల యజమానులకు పోలీసులు నోటీసులు జారీచేస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాల యజమానులతో పాటు సిరిమాను తిరిగే పరిసరాల్లో భవనాలు, షాపుల యజమానులకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు.
ఆ రోజుషాపులు మూసివేయాలని బెదిరిస్తున్నట్టు సమాచారం. గుర్తుతెలియని వ్యక్తులను మేడల మీదకు అనుమతించరాదని, ఏదైనా జరిగితే బాధ్యత మీదేనని పోలీసులు బెదిరిస్తున్నట్లు షాపుల యజమానులు చెబుతున్నారు. సమైక్యాంధ్ర ఆందోళనల కారణంగా నష్టపోయిన ఆదాయాన్ని... పండగ రోజుల్లో పెరిగే అమ్మకాల ద్వారా కొంతవరకైనా పొందవచ్చని ఆశలు పెట్టుకున్న వ్యాపారులకు పోలీసుల హెచ్చరికలు అశనిపాతమయ్యాయి. సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా పట్టణంలోని భారీ స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం జరిగింది. ప్రధానంగా మంత్రి, పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణకు చెందిన ఆస్తులపై ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. ఈ నెల 4, 5 తేదీల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విజయనగరంలో విధ్వంసకర సంఘటనలు చోటుచేసుకున్నాయి.
6వ తేదీనుంచి పట్టణంలో కర్ఫ్యూ విధించారు. అయినా 6, 7 తేదీల్లో కూడా కర్ఫ్యూను సైతం ధిక్కరించి ఆందోళనలు చేసి బొత్సతీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జిల్లాకు వచ్చేందుకు ఆయన వెనుకంజ వేశారు. కర్ఫ్యూ అమలు చేసిన పోలీసులు సమ్యైదులను అరెస్ట్ చేయడంతో భీతిల్లిన పట్టణ ప్రజలు బయటకు రాలేదు. పరిస్థితులు సద్దుమణగడంతో దసరా సందర్భంగా భారీ బందోబస్తు మధ్య జిల్లాలో ట్రయిల్ రన్‌గా అడుగుపెట్టారు. పైడితల్లమ్మ పండగ సందర్భంగా ప్రతి ఏడాది మంత్రి బొత్ససత్యనారాయణ అమ్మవారి ఆశీస్సులు పొందుతారు.
ఇటీ వల జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ ఏడాది పైడితల్లమ్మ పండుగ బందోబస్తుకు సుమారు 900 మంది పోలీసులను నియమించేవారు. ఈ ఏడాది సుమారు 2500 మంది వరకు నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్‌ఏఎఫ్, సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఏఆర్, సివిల్ పోలీస్ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. పైడితల్లమ్మ పండుగకు ఇంత భారీ స్థాయిలో పోలీసు బందోబస్తును నియమించడంతో వేరే ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పండగకు వెళ్లాలా?, వద్దా? అన్న సంశయంలో పడ్డారు. జిల్లా వాసులు కూడా ఎప్పుడూ ఉండేలా ఈ సారి పండగ సరదా ఉండదని, తమకిదేం బాధని వాపోతున్నారు.
Advertisement