vizinagaram
-
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా చిన్నప్పలనాయుడు పేరు ఖరారు
-
పాండవుల వనవాసంలో కొన్నాళ్ళు ఇక్కడే నివాసం..
-
తల్లి ఘాతుకం.. బాలిక శరీర భాగాలు పెరిగేందుకు ఇంజెక్షన్లు, టాబ్లెట్లు
విజయనగరం (క్రైమ్): ఆ బాలిక తల్లి దారి తప్పింది. పెళ్లయిన కొన్నేళ్లకే మొదటి భర్తకు విడాకులిచ్చింది. ఆ తరువాత సబ్ ఇంజనీర్‌ను వివాహం చేసుకుంది. కొంతకాలానికి అతనితోనూ తెగతెంపులు చేసుకుని వ్యభిచారం ప్రారంభించింది. చివరకు తన 15 ఏళ్ల కుమార్తెను కూడా వ్యభిచార కూపంలోకి దింపాలని, అనంతరం సినీ, టీవీ రంగంలోకి పంపించాలని భావించింది. ఆ బాలిక శరీర భాగాలు విపరీతంగా పెరిగేలా.. యుక్తవయసు అమ్మాయిలా కనిపించేలా చేసేందుకు హార్మోన్ ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లను వాడించడం మొదలుపెట్టింది. తల్లి చేష్టలను భరించలేక బాధిత బాలిక 1098 నంబర్‌కు ఫోన్‌చేసి చైల్డ్ లైన్‌ను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. నవోదయ పాఠశాలలో చదువుతున్న ఓ బాలిక ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసి అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. ఆ బాలిక విజయనగరంలో ఉంటున్న తల్లి దగ్గరకు ఇటీవల వచ్చింది. తెలియని వ్యక్తులు తరచూ ఇంటికి రావడం.. తల్లి తనముందే వారితో వ్యభిచరించడాన్ని భరించలేక.. తల్లితో విభేదించింది. బాలికను కూడా తన మాదిరిగానే ఇంటికి వచ్చే వ్యక్తులతో చనువుగా ఉండాలని తల్లి ఒత్తిడి చేయడాన్ని తట్టుకోలేకపోయింది. శరీర భాగాలు పెరిగేందుకు ఇచ్చే ఇంజెక్షన్లు, టాబ్లెట్ల వల్ల అనారోగ్యానికి గురయింది. ఈ పరిస్థితుల్లో తల్లి ఒత్తిడిని తట్టుకోలేక గురువారం రాత్రి చైల్డ్‌లైన్ 1098కి కాల్ చేసి రక్షణ కోరింది. రంగంలోకి దిగిన చైల్డ్‌లైన్ సభ్యులు, దిశ పోలీసులు ఆ బాలికను దిశ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ జరిపారు. బాలిక నుంచి ఫిర్యాదు తీసుకున్నాక అదేరోజు రాత్రి స్వధార్ హోమ్‌కు తరలించారు. అనంతరం విశాఖలోని ప్రభుత్వ బాలికల పునరావాస కేంద్రంలో చేర్పించారు. బాలిక సంక్షేమం చూడాలంటూ పునరావాస కేంద్రం సూపరింటెండెంట్‌కు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు సూచించారు. ఈ విషయాన్ని విజయనగరం ఎస్పీ ఎం.దీపిక దృష్టికి తీసుకువెళ్లారు. బాలిక తల్లిని అదుపులోకి తీసుకుని చిల్డ్రన్స్ కోర్టులో విచారణ జరిపారు. -
కనుల పండువగా పైడితల్లి సిరిమానోత్సవం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం కనుల పండువగా సాగింది. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా కట్టుదిట్టమైన ఆంక్షల నడుమ ఉత్సవం జరిగింది. ఈ ఏడాది ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో భక్తులు పోటెత్తారు. విజయనగరం వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలివచ్చారు. రికార్డు స్థాయిలో దాదాపు 4.5 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి , దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సంప్రదాయం ప్రకారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు, అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు దంపతులు అమ్మవారికి వస్త్రాలను తీసుకొచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం 5.22 గంటలకు సిరిమాను కదిలింది. పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానుపై ఆశీనులై భక్తులకు దర్శనం ఇచ్చారు. చదురుగుడి నుంచి కోట వరకు మూడు పర్యాయాలు సిరిమానును తిప్పారు. సాయంత్రం 6.42 గంటలకు సిరిమాను జాతర పూర్తయింది. డీసీసీబీ బ్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సిరిమాను ఉత్సవాన్ని వీక్షించారు. కోటపై నుంచి ఆలయ అనువంశిక ధర్మకర్తలు పూసపాటి అశోక్ గజపతిరాజు, సునీలా గజపతిరాజు, సుధా గజపతిరాజు, ఊర్మిళా గజపతిరాజు తదితరులు ఉత్సవాన్ని తిలకించారు. -
అయ్యో.. మొబైల్ పోయిందా? ఇలా చేయండి
విజయనగరం క్రైమ్: ఎంతో విలువైన మొబైల్ మిస్సయిందా? కంగారు పడకండి. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. జిల్లా పోలీస్‌శాఖ నూతనంగా రూపకల్పన చేసి నిరంతర పర్యవేక్షణకు సైబర్ సెల్‌ను ఏర్పాటుచేసింది. మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తులు ఇటీవలికాలంలో పెరుగుతుండడంతో, బాధితులకు ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకండా, ఫిర్యాదుల స్వీకరణను సులభతరం చేస్తూ ఎస్పీ ఎం.దీపిక చర్యలు చేపట్టారు. మొబైల్ పొగొట్టుకున్న బాధిత ఫిర్యాదు దారు పేరు, చిరునామా, సంప్రదించాల్సిన మొబైల్ నంబర్, మొబైల్ మోడల్, ఐఎంఈఐ నంర్, ఫోన్ పోయిన తేదీ, సమయం, ప్రాంతం వంటి వివరాలను పోలీస్ వాట్సాప్ నంబర్ 8977945606కు పంపించాలి. ఫిర్యాదు అందుకున్న వెంటనే సైబర్‌సెల్ పోలీసులు బాధిత ఫోన్‌ను ట్రాక్ చేస్తారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చర్యలు చేపడతారు. పోగొట్టుకున్న ఫోన్లను ట్రాక్ చేసి తర్వాత తిరిగి బాధితులకు అందజేస్తారు. ఒకవేళ పోయిన ఫోన్లు ట్రాక్ కాకుంటే చట్టపరమైన చర్యలు చేపట్టి, దర్యాప్తు చేస్తారు. వాట్సాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను సైబర్ సెల్ సిబ్బంది స్వీకరించి, వాటిని రిజిస్టర్లో నమోదుచేసి, పోయిన మొబైల్స్‌ను కనుగొనేందుకు చర్యలు చేపడతారు. ఆందోళన అవసరం లేదు జిల్లాలో మొబైల్స్ పోగొట్టుకున్న ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జస్ట్ డయల్ 8977945606కు చేసి ఫిర్యాదు చేస్తే సైబర్ సెల్ నిరంతర పర్యవేక్షణ చేస్తుంది. పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. పోలీస్ శాఖ కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ఎం.దీపిక, ఎస్పి, విజయనగరం -
ప్రేమోన్మాదానికి ముగ్గురి బలి
♦ పెట్రోలు పోసి నిప్పు అంటించిన ఉన్మాది ♦ అక్కడికక్కడే మృతి చెందిన యువతి ♦ రక్షించేందుకు యత్నించిన తమ్ముడి కన్నుమూత ♦ అనంతరం విజయనగరంలో నిందితుడి ఆత్మహత్య ♦ భీమిలి మండలం టి.నగరప్పాలెంలో సంచలనం రేపిన ఘటన మధురవాడ / భీమునిపట్నం : ప్రేమోన్మాదం రెండు కుటుంబాల్లో చిచ్చు రేపింది. మూడు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఇంటిలోకి వెళ్లి యువతిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించి గడియ పెట్టేయడంతో ఆమె అక్కడికక్కడే అగ్నికి ఆహుతయింది. రక్షించేందుకు యత్నించిన యువతి సోదరుడు తీవ్ర గాయాలపాలై కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ప్రేమోన్మాది కూడా రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం సంచలనం రేపిన ఈ సంఘటన భీమిలి రూరల్ మండలం టి.నగరప్పాలెంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానికులు, భీమిలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భీమిలి రూరల్ మండలం టి.నగరప్పాలేనికి చెందిన పొట్నూరి రూప(19) తగరపువలసలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం పూర్తి చేసి రెండో సంవత్సరంలోకి ప్రవేశించింది. బతుకు తెరువు కోసం తండ్రి రమణతో విజయనగరం నుంచి తగరపువలస వచ్చిన పతివాడ హరిసంతోష్ ఆరు నెలలుగా రూప వెంటపడుతున్నాడు. ప్రేమించమని వేధిస్తుండడంతో బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. దీంతో ఆ గ్రామ పెద్దలు తగరపువలస వచ్చి స్థానిక పెద్దల సమక్షంలో హరిసంతోష్ను హెచ్చరించి ఓ లెటర్ కూడా రాయించుకున్నారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. వేధింపులు ఆగకపోవడంతో మూడు నెలల నుంచి రూప కళాశాలకు వెళ్లడం మానేసింది. ఈ నేపథ్యంలో నేరుగా రూప ఉంటున్న టి.నగరప్పాలెం కొత్తూరులోని ఇంటికి శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో హరిసంతోష్ చేరుకున్నాడు. తనను ప్రేమించమని వాదనకు దిగాడు. రూప నిరాకరించడంతో ఒక్కసారిగా ఉన్మాదిలా మారిన సంతోష్ అప్పటికే తనవెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను యువతిపై పోసి నిప్పు అంటించాడు. అనంతరం తలుపు గడియ పెట్టి పరారయ్యాడు. పరిస్థితి గమనించి రక్షించేందుకు యత్నించిన రూప సోదరుడు ఉపేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంటిలో నుంచి దట్టమైన పొగలు రావడంతో గమనించిన స్థానికులు అక్కడకు చేరుకున్నారు. మంటలు పూర్తిగా వ్యాపించడంతో రూప అగ్నికి ఆహుతైపోయింది. ఉపేంద్రను చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న భీమిలి సీఐ బాలసూర్యారావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు అనుకోని దుర్ఘటన జరగడంతో టి.నగరప్పాలెంలో విషాదం నెలకొంది. రూపకు ఐదేళ్ల వయసప్పుడు తల్లి వదిలేసి వెళ్లిపోవడంతో ఆమె తండ్రి పొట్నూరు సూరిబాబు రెండో వివాహం చేసుకున్నాడు. రూప, ఉపేంద్ర మొదటి భార్యకు కలిగిన సంతానం. తండ్రి రెండో వివాహం చేసుకుని పాతూరులో ఉండడంతో రూప, ఉపేంద్ర నాన్నమ్మ అప్పచ్చమ్మ, తాత ఎల్లయ్య, చిన్నాన్న రవి, పిన్ని నీరజల సంరక్షణలో ఉంటున్నారు. ఇంతలో ఇలా జరగడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆస్పత్రిలో ఉపేంద్ర మృతి అక్క మంటల్లో చిక్కుకోవడంతో తాను ఏమైపోయినా ఫర్వాలేదని ప్రాణాలకు తెగించి రూపను కాపాడే క్రమంలో తీవ్ర గాయాలపాలైన ఉపేంద్ర (14) కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. అంతకుమునుపే ఆస్పత్రికి వచ్చిన న్యాయమూర్తి హరినారాయణ ఆ బాలుడి నుంచి వాగ్మూలం తీసుకున్నారు. నిందితుడి ఆత్మహత్య విజయనగరం టౌన్ : ప్రేమించలేదనే అక్కసుతో యువతిపై పెట్రోల్ పోసి తగులబెట్టి చంపేసిన నిందితుడు హరిసంతోష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయనగరం రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బతుకుదెరువు కోసం విజయనగరం నుంచి తగరపువలస వెళ్లి అక్కడ బొంతలు కుట్టే పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వెంకటరమణ, గోపమ్మలకు ఇద్దరు ఆడపిల్లల తర్వాత హరి సంతోష్ (22) పుట్టాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకూ చదువుకున్న సంతోష్ తర్వాత చదువు ఆపేసి, తండ్రికి సహాయం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో భీమిలి మండలం టి.నగరప్పాలెంలో రూప అనే విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధిస్తూ శనివారం నిప్పు అంటించి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి భయంతో బైక్ తీసుకుని పారిపోయాడు. విజయనగరం బీసీ కాలనీ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సంతోష్ బంధువులందరూ బీసీ కాలనీలో నివాసముంటున్నారు. రైల్వే జీఆర్పీ ఎస్ఐ చెల్లూరు శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చల్లనితల్లికి బూరెలతో నివేదన
విజయనగరం టౌన్ : ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారికి ఆలయ అధికారులు మంగళవారం బూరెలతో నివేదన చేశారు. మంగళవారం వేకువ జామునుంచి అమ్మవారికి పంచామతాలతో అభిషేకాలు, అనంతరం సహస్ర కుంకుమార్చనలు జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు తాళ్లపూడి భాస్కరరావు, దూసి కష్ణమూర్తి, రమణ, రవిప్రసాద్, ధనుంజయ్‌లు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. స్థానిక మూడులాంతర్లువద్ద ఉన్న చదురుగుడిలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించి పసుపు,కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అదేవిధంగా రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడి వద్ద ఉన్న అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. కార్యక్రమాలను ఆలయ సూపరింటెండెంట్ సత్యనారాయణ, సూపర్వైజర్లు రామారావు, ఎం.అప్పలనాయుడులు పర్యవేక్షించారు. 23విజెడ్‌జి 174 : బూరెలతో అమ్మవారికి నివేదన -
సంఘర్షణలతో... సమున్నతానికి...
ఆర్మీలో చేరాలనుకున్నా... పోలీసు అధికారినయ్యా డాక్టర్ అవ్వాలన్న తల్లి కోరిక నెరవేర్చలేకపోయా విధి నిర్వహణలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా సవాళ్లను సానుకూలంగా మలచుకుంటా ఇప్పటికి 22 బదిలీలు అయినా తరగని ఆత్మవిశ్వాసం సాక్షితో ఎస్పీ ఎల్.కె.వి.రంగారావు సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఆయనకు బదిలీలు కొత్తకాదు. సవాళ్లెదురైతే సానుకూలంగా మలచుకోగలరు. అనుకున్నది సాధించేవరకూ అలుపెరుగని పోరాటం చేస్తారు. ఎక్కడికెళ్లినా పాలనలో తనదైన ముద్రపడాలని ఆకాంక్షిస్తారు. ఆయనే విజయనగరం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎల్.కె.వి.రంగారావు. మనలో ఎన్నో ఆకాంక్షలుంటాయి. వాటికి పరిస్థితులు అనుకూలించకపోతే... కొత్తవాటిని పొంది సంతప్తి చెందాలి. తల్లి ప్రోత్సాహంతో ఉన్నత విద్యనభ్యసించి సైనికుడిగా దేశానికి సేవ చేయాలనే సత్సంకల్పంతో ముందుకు సాగి.. పరిస్థితుల ప్రభావంతో పోలీసు అధికారిగా మారారు రంగారావు. తల్లిదండ్రులకు ఆసరాగా ఎవరూ లేకపోవడంతో సివిల్ సర్వీసెస్‌ను లక్ష్యంగా ఎంచుకుని పోలీస్ శాఖలో చేరారు. ఎక్కువసార్లు బదిలీలు, పోలీసు ఉద్యోగంలోకి ఎందుకొచ్చానన్న అసహనం ఆయనకూ ఎదురైంది. కానీ పోలీసు విధి ఉద్యోగం కాదు... మిషన్లాంటిదని, సవాళ్లతో కూడిన బాధ్యతని నమ్మారు. అందులోనే విజయాలు సాధిస్తున్నారు. సాక్షితో ఆయన పంచుకున్న మరిన్ని విషయాలు మీ కోసం... డోకిపర్రు మాస్టారి కొడుకుగా... మాది కష్ణాజిల్లా డోకిపర్రు. మాది మధ్యతరగతి కుటుంబమే. అమ్మ అనసూయమ్మ, నాన్న శీరాబంది రాజు. నాన్నగారు ఉపాధ్యాయునిగా పనిచేశారు. అమ్మేమో గహిణి. విద్యాభ్యాసమంతా ఊళ్లోనే జరిగింది. నేను ఒక్కడ్నే కుమారుడ్ని, ఇద్దరు అక్కచెల్లెళ్లు. ఆరో తరగతిలో చేరే లోపే అమ్మ నాకు భగవద్గీత, రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలను నేర్పించింది. అందులో నీతిని వివరించేది. అవే నేటికీ నాకు మార్గదర్శకాలయ్యాయి. పాపం డాక్టర్ కావాలన్న అమ్మ కోరిక తీరనేలేదు. డాక్టర్ అవ్వాలని మా అమ్మ కోరిక. దానికోసం ప్రయత్నం చేశాను. మెడిసిన్‌కి అప్లై చేసిన దగ్గర నుంచి ఏదో రకమైన ఇబ్బందులే ఎదురయ్యాయి. వ్యయప్రయాసలు పడి పరీక్షలకు సిద్ధమయ్యాను. కానీ, హాల్ టిక్కెట్ ఆలస్యంగా రావడం, నిర్దేశిత సమయానికి గుంటూరు మెడికల్ కళాశాలలోని పరీక్ష కేంద్రానికి చేరలేకపోవడంతో పరీక్ష రాయలేకపోయాను. అమ్మకోరిక తీర్చలేకపోయానే... అని ఆరోజు బాధపడ్డాను. ఆర్మీలో చేరాలనుకుని అనుకోకుండా ఐపీఎస్ యాక్ట్యువల్ గా నేను ఆర్మీలో చేరాలనుకున్నాను. కానీ ఒక్కడ్నే కొడుకుని కావడం వల్ల మా అమ్మ, నాన్నలను అంటిపెట్టుకుని ఉండాల్సి వచ్చింది. అందుకే అది కాస్తా విరమించుకున్నాను. ఇంటర్లో చేరిన తర్వాత వయసు ప్రభావం వల్ల సమాజంలో మార్పు తీసుకురావాలంటే నక్సలిజమే కరెక్ట్ అనుకున్నా. సొసైటీని మార్చే అవకాశం దానికే ఉందనుకున్నాను. మానసిక సంఘర్షణకు లోనైన ఆ సమయంలో మాకు బాగా ఆత్మీయులైన వైద్యులు రాజారావు(ఇల్లందు)తో చర్చించాను. తప్పటడుగని కౌన్సెలింగ్ ఇచ్చారు. Ðð ంటనే దాన్ని విరమించుకున్నాను. సమాజసేవ కోసం సివిల్ సర్వీసెస్ కరెక్ట్ అనుకుని అందుకోసం కష్టపడి చదివాను. ఎక్కడా ఎక్కువ కాలం చేసింది లేదు ఐపీఎస్‌కు ఎంపికయ్యాక తీవ్ర వాద నిరోధక విభాగంలో 14ఏళ్లు పనిచేశాను. అందులో పనిచేసే వారికున్న ఇబ్బందులు తెలియనివి కావు. నాన్నను కూడా సరిగా చూడలేక పోయాను. సాధారణంగా విధుల్లో ఎటువంటి వారికైనా ఒత్తిళ్లు తప్పవు. సమాజాన్ని మార్చాలనే తపన నన్ను ఎక్కడా ఉండనివ్వలేదు. రాజకీయ కారణాలు వల్ల ఇప్పటికే 22 బదిలీలు చవిచూశాను. తొలి పోస్టింగ్ పెద్దాపురం ఎస్డీపీఓగా బాధ్యతలు స్వీకరించి కేవలం 11 రోజులే పనిచేశా. రెండోపోస్టింగ్ రాజమండ్రిలో పదినెలలు చేశాను. మూడోపోస్టింగ్ వరంగల్‌లో... అక్కడి నుంచి పలు చోట్ల పనిచేశాను. అన్నిచోట్లా... ఒత్తిళ్లు, సవాళ్లు ఎదుర్కొన్నాను. కొంతలో... కొంత సామాజిక సేవ పోలీసు శాఖలో వచ్చిన రివార్డు రూ. 15లక్షలను పుట్టిన ఊళ్లోని ఇంటికి దగ్గర్లో బాబా సాహెబ్ సమసమాజ సంస్కతి సదన్ పేరుతో కమ్యూనిటీ భవనం నిర్మించాను. అందులో పెద్ద లైబ్రరీ కూడా పెట్టించాను. బాల్యంలో గ్రంథాలయం ద్వారా ఎంతో లబ్ధిపొందాను. ఎన్నో పుస్తకాలను నా తండ్రి తీసుకువచ్చి అందించేవారు. అదే స్పూర్తితో లైబ్రరీ ఏర్పాటు చేశాను. ప్రజా సమస్యల పరిష్కారమే... ధ్యేయం ద్వేషం, అత్యాశ పెరిగిపోవడంవల్లే నేరాలు ఎక్కువవుతున్నాయి. చిన్న పాటి విషయాలకే చంపుకునే వరకు వెళ్తున్నారు. ప్రజల్లో అవగాహన పెరిగితేనే ఇవి తగ్గుతాయి. మీడియా, ప్రజా సంఘాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచి, అటువంటి నేరాలు తగ్గించాలన్న ఆలోచనతో వెళ్తున్నాను. పోలీసుల కోసం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. పనిచేసే వారికి గుర్తింపు ఇస్తాను. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాను. ఎన్నో బాధలు కలిగితే తప్ప పోలీసుల వద్దకు ప్రజలు రారు. అలా వచ్చినోళ్లందరికీ సాంత్వన చేకూర్చడమే కాకుండా న్యాయం జరిగేలా చూడటమే లక్ష్యం. -
జాతి శ్రేయస్సు.. జీవితానికి ఉషస్సు
ఎన్‌సీసీతో యువతకు బంగారు భవిత సమాజ సేవ.. దేశరక్షణకు వారధి అద్భుతమైన ఉద్యోగావకాశాలు విజయనగరం టౌన్ : ఎన్సీసీ అంటే బాల సైనికులు అనిపేరు. ఆర్మీలో ఏ విధంగా శిక్షణ తీసుకుని పనిచేస్తారో అదేరీతిలో బాలసైనికులను తయారుచేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థ. ఇందులో బాలసైనికులకు డ్రిల్, వెపన్ ట్రైనింగ్, మేప్ రీడింగ్ వంటివి ప్రధానంగా నేర్పిస్తారు. పదమూడేళ్లు దాటిన విద్యార్థులు ఇందులో చేరవచ్చు. 9, 10వ తరగతలకు ఎ, ఇంటర్‌కి బి, డిగ్రీకి సి సర్టిఫికెట్లను అందజేస్తారు. ప్రతి వారం క్యాంప్‌లకు ఆర్మీ సిబ్బంది వచ్చి శిక్షణ ఇస్తారు. ఏడాదిలో మూడు క్యాంప్‌లు నిర్వహిస్తారు. కమాండింగ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి. సామాజిక సేవే లక్ష్యంగా ఎన్సీసీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సహజ వనరులు, క్యాన్సర్, రక్తదానం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై వివిధ కార్యక్రమాల నిర్వహణలో ఎన్సీసీ క్యాడెట్లు ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలో ఎన్సీసీ యూనిట్లు విజయనగరంలోని సత్య డిగ్రీ కళాశాల, మహారాజ కళాశాల, మహారాజా మహిళా కళాశాల, ఎస్కే డిగ్రీ కళాశాల, గరివిడి ఎస్డీఎస్ కళాశాల, పార్వతీపురం ఎస్వీడీ కళాశాలల్లో ఎన్సీసీ యూనిట్లు ఉన్నాయి. జిల్లాలోని ఏడు ఎన్సీసీ యూనిట్లలో 13 ఆంధ్రా బెటాలియన్ బాయ్స్ (విశాఖ), 14 ఆంధ్రా (శ్రీకాకుళం) 2 ఆంధ్రా గర్ల్స్ బెటాలియన్ (విజయనగరం), 6 ఎయిర్ వింగ్ (విశాఖ), 3 నేవల్, 4 నేవల్ (విశాఖ), 2 సీటీఆర్ (విశాఖ), ఇంజినీరింగ్ విభాగంలో 2 సీటీఆర్ (విశాఖ)లో ఇంజినీరింగ్ విద్యార్థులే ఉంటారు. ఇవన్నీ విశాఖ గ్రూప్ కిందకు వస్తాయి. ఇందులో బాలురు, బాలికల విభాగాలున్నాయి. బాలుర విభాగంలో జిల్లా వ్యాప్తంగా 700, బాలికల విభాగంలో సుమారు 300 మంది విద్యార్థినులున్నారు. ప్రత్యేక శిబిరాల నిర్వహణ ఎన్సీసీ క్యాడెట్లుగా మూడు విభాగాల్లో చేరిన విద్యార్థులకు ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తారు. బేసిక్ లీడర్షిప్, వాయు, సైనిక్, నవ్సైనిక్, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, నేషనల్ ఇంటిగ్రేషన్, థల్ సైనిక్, ఆర్మీ ఎటాచ్మెంట్, ఎయిర్‌ఫోర్స్ అటాచ్మెంట్, రిపబ్లిక్ డే, యాన్యువల్ శిబిరాలను నిర్వహిస్తారు. సీనియర్ డివిజన్ స్ధాయిలో.. ఎన్సీసీలో సీనియర్ డివిజన్ స్థాయిలో చేరిన క్యాడెట్లకు వారి ప్రతిభను బట్టి ప్రత్యేక ర్యాంకులను కేటాయిస్తారు. సీనియర్ అండర్, ఆఫీసర్, క్యాడెట్, జూనియర్ అండర్ ఆఫీసర్, కంపెనీ క్వార్టర్ మాస్టర్, సార్జెంట్, సార్జెంట్ కార్పొరల్, లాన్స్ కార్పొరల్ తదితర ర్యాంకులను ఇస్తారు. ధ్రువపత్రాల స్థాయి –ఎన్సీసీ ధ్రువæపత్రాలకు విలువ ఎక్కువ. హైస్కూల్ స్థాయిలో ‘ఎ’, కళాశాల (ఇంటర్) స్థాయిలో ‘బి’, డిగ్రీ స్థాయిలో ‘సి’ సర్టిఫికెట్‌ను ఇస్తారు. వీటికోసం నిర్వహించే పరీక్షల్లో ఎన్సీసీ క్యాడెట్లు ఉత్తీర్ణత సాధించాలి. – జూనియర్ డివిజన్లో ‘ఎ’ సర్టిఫికెట్ పొందాలంటే రెండేళ్ల శిక్షణ. 75 శాతం హాజరు ఉండాలి. థియరీ, ప్రాక్టికల్స్ సరాసరి 50 శాతం మార్కులు పొందాలి. కనీసం ఒక ఏటీసీ క్యాంపునకు హాజరుకావాలి. సీనియర్ డివిజన్ స్థాయికి ఇదే వర్తిస్తుంది. – ఎన్సీసీలో శిక్షణ పొంది, పోలీస్, నేవీ, ఆర్మీ, బోర్డర్ సెక్యూరిటీ, వంటి రక్షణ విభాగాల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులెందరో ఉన్నారు. ఎన్సీసీ అభ్యర్థులు ప్రత్యేక కోటా కింద ప్రభుత్వోద్యోగావకాశాలు దక్కించుకుంటున్నారు. -
నిధులు చిక్కన - మజ్జిగ పలుచన
► నీళ్ల మజ్జిగతోనే సరిపెడుతున్న వైనం ► చలివేంద్రాలపై దాహార్తుల మండిపాటు ► నిధులు దుర్వినియోగానికేనని విమర్శలు విజయనగరం: ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాల్లో మజ్జిగ పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన రూ. 3కోట్లను జిల్లాకు మంజూరు చేసింది. అయితే మజ్జిగ సరఫరా చేసే బాధ్యతను ఎక్కువ ప్రాంతాలకు హెరిటేజ్ కంపెనీకే అప్పగించింది. అంతా బాగానే ఉంది. కానీ చలివేంద్రాల్లో సరఫరా అవుతున్న మజ్జిగ చూసి ఇప్పుడు దాహార్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది మజ్జిగా... లేక మజ్జిగ రంగులోఉన్న మంచినీరా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సోమవారం ఉదయం కలెక్టరేట్ ప్రధాన గేటును ఆనుకుని ఉన్న ప్రహరీ వద్ద ప్రభుత్వ మజ్జిగ పంపిణీ కేంద్రం పేరుతో ఫ్లెక్సీ పెట్టి మరీ చలివేంద్రం ఏర్పాటు చేశారు. సోమవారం కావడంతో గ్రీవెన్స్ తాకిడి ఎక్కువగా ఉంది. వేసవి తీవ్రత కూడా తక్కువేం లేదు. ఇక వచ్చిన జనం ఎండ వేడిమికి తట్టుకోలేక సర్కారువారి మజ్జిగ సరఫరా కేంద్రానికి వెళ్లి వారిచ్చిన మజ్జిగను నోట్లో పోసుకునే సరికి ఇది మజ్జిగా మంచినీరా అని నిర్వహకులను ప్రశ్నించడం విశేషం. హెరిటేజ్ కంపెనీకి చెందిన చిన్నపాటి బకెట్లో పెద్ద ఎత్తున నీరు పోసి పంచుతుండటంతో అక్కడి వారు విమర్శించడం మొదలెట్టారు. చంద్రబాబు కంపెనీకి సొమ్ము ధారపోయడానికి తప్ప రూ. 3కోట్ల మజ్జిగ ఇదా అంటూ వారు ధ్వజమెత్తారు. మంచినీరు తాగడం మేలు! కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రంలోనే మజ్జిగ ఇలా ఉంటే ఇక మారుమూల ప్రాంతాల్లోని మజ్జిగ ఇంకెలా ఉంటుందో వేరే చెప్పాలా... ఈ మజ్జిగ తాగేకన్నా మంచినీరు శుభ్రంగా ఉంటుంది. వట్టి నీరులా ఉంది. ప్రజల ధనం ప్రజలకివ్వడంలో కూడా ఇంత లాభాపేక్షా? - ఎం సూరప్పడు, ఒమ్మి, నెల్లిమర్ల మండలం కోట్ల రూపాయల మజ్జిగ ఇదేనా? జిల్లాకు రూ. 3కోట్ల చొప్పున పంపిణీ చేసి మజ్జిగ పంచుతున్నారంటే కాస్త నాణ్యంగా ఉంటుందనుకున్నాం. తీరా తాగాక తెల్సింది మజ్జిగ నాణ్యత! కోట్లు వెచ్చించి ఇస్తున్న మజ్జిగ ఇలానే ఉంటుందా? అధికారులు పర్యవేక్షించి మజ్జిగను నాణ్యంగా అందించాల్సింది పోయి లక్షలాది బిల్లులు కళ్లు మూసుకుని ఇచ్చేస్తే ఇలానే ఉంటుంది. - మర్రాపు గణపతి, బొబ్బిలి -
మృత్యుకుహర
గుర్ల, న్యూస్‌లైన్:వారు ముగ్గురూ ప్రాణ స్నేహితులు.. ప్రతిరోజూ కలిసిమెలిసి పాఠశాలకు వెళ్తుంటారు.. బాలల దినోత్సవం కావడంతో విద్యార్థులందరూ సరదాగా పిక్నిక్కు వెళ్లారు. అంతా కలసి బంతాట ఆడారు. ఆ సమయంలో వీరు ఆడుతున్న బంతి చంపావతి నదిలోని ఓ గొయ్యి వద్ద పడింది. అక్కడే మృత్యువు పొంచి ఉందని.. ఆ గొయ్యే వారి ప్రాణాలను బలి తీసుకుంటుందని పాపం ఆ పసివాళ్లు ఊహించలేకపోయారు. బాలల పండగ రోజునే.. ముగ్గురు బాలికలు విగతజీవులయ్యారు. ఈ హృదయ విదారక ఘటన గుర్ల మండలం చింతలపేట సమీపంలో చంపావతి నది వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గురువారం బాలల దినోత్సవం, సెలవు దినం కావడంతో గుర్ల మండలం చింతలపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సుమారు 40 మంది పిక్నిక్కు వెళ్లారు. గ్రామ సమీపంలో ఉన్న చంపావతి నది పక్కన మామిడితోటలో అంతా ఆటపాటలతో గడిపారు. అదే గ్రామానికి చెందిన పిల్లా గీత(14), సుంకరి భవాని(13), తాళ్లపూడి మౌనిక(14) బంతాట ఆడుతుండగా... సమీపంలోని చంపావతి నదిలో గుంత వద్దకు బంతి చేరుకుంది. బంతిని తీయడానికి వెళ్లిన భవానీ గుంతలో పడి మునిగిపోయింది. ఆమెను కాపాడేందుకు వెళ్లిన గీత కూడా గుంతలోకి జారిపడింది. కళ్ల ముందే జరుగుతున్న ఘోరాన్ని చూసి.. నేస్తాలను రక్షించే ప్రయత్నంలో మౌనిక కూడా వెళ్లి గుంతలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయింది. మిగతా విద్యార్థులు గమనించి వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించారు. అప్పటికే వీరు ముగ్గురూ ప్రాణాలు విడిచారు. మృతదేహాలను పోలీసులు బయటకు తీసి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. -
ఆకాంక్షలను చిదిమేస్తున్న సర్కార్ ఆంక్షలు!
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. ప్రతి నిరుపేద ఉన్నత విద్యను అందుకోవాలన్న మహోన్నత లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ప్రస్తుత పాల కులు తూట్లు పొడుస్తూ వస్తున్నారు. ఏటికేడాది లబ్ధిపొందే విద్యార్థుల సంఖ్యను తగ్గించేందుకు పలు నిబంధనలను విధిస్తున్న సర్కారు ఈ ఏడాది మరిన్ని ఆంక్షలను పెట్టింది. ఈ ఏడాది ఉపకారవేతనం, రీయింబర్స్మెంట్ పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యార్థులందరికీ ఆధార్ కార్డులు పూర్తిస్థాయిలో జారీ చేయకముందే ఈ నిబంధన విధించడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎలా చదువుకోవాలన్న బాధ వారిని పీడిస్తోంది. మధ్యలో ముగించవలసి వస్తుందేమోనని వారు బెంగపడుతున్నారు. వాస్తవానికి ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తిస్థాయిలో జరిగిన తరువాతే నిబంధనలు పెట్టాలి. అయితే అందుకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీంతో పేద విద్యార్థులు ఆందోళనచెందుతున్నారు. మరోవైపు ఆధార్ కార్డు లేకపోవడంతో దరఖాస్తులు చేయలేని విద్యార్థులు ఫీజులు కట్టాలని యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేలాది మంది విద్యార్థులు సంక్షేమ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఫలితం లభించడం లేదు. మరోవైపు డిగ్రీ , పీజీ కోర్సులు చదివి ప్రస్తుతం డైట్, పాలిటెక్నికల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ రాదని స్పష్టం చేయడంతో ఆ విద్యార్థుల పరిస్థితి ముందు నుయ్యి... వెనుక గొయ్యి అన్న చందంగా ఉంది. ఇలా చదువుతున్న విద్యార్థులు జిల్లావ్యాప్తంగా 1200 మంది వరకు ఉన్నారు. తమకు అవకాశం కల్పించాలని లేనిపక్షంలో మధ్యలో తమ చదువులకు స్వస్థి చెప్పాల్సి ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 45వేల మంది రెన్యూవల్ విద్యార్థులున్నారు. వీరు ఉపకార వేతనాలు కోసం దరఖాస్తులు చేసుకోవటానికి గడువు ఇచ్చి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు కేవలం 13,264 మంది విద్యార్థులు మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. మిగిలిన వారు ఆధార్ కార్డుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. అలాగే కొత్తగా ఉపకారవేతనాలు పొందగోరే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 35 వేల మంది ఉండగా వీరిలో కేవలం 2500 మంది మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి దరఖాస్తులు చేసుకోవటానికి గడువు ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నప్పటికీ ఊహించిన స్థాయిలో దరఖాస్తులు రావడం లేదు. సంక్షేమ శాఖాధికారులు మాత్రం ఆధార్ కార్డులు ఉంటేనే దరఖాస్తులు చేసుకోవ డానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. దీంతో తమ చదువులు ఏమవుతాయోనన్న ఆందోళనతో పేద విద్యార్థులు కొట్టు మిట్టాడుతున్నారు. రెన్యువల్ విద్యార్థులు ఇలా దరఖాస్తులు చేసుకోవాలి ఈపాస్ వెబ్సైట్లోకి వెళ్లి రెన్యువల్ విద్యార్థులు మార్కుల మెమో పాస్/ఫెయిల్‌తో పాటు ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా జెరాక్సు కాపీ, ఆదాయ ధ్రువీకరణ పత్రం, డిక్లరేషన్ తో దరఖాస్తులు చేసుకోవాలి.కొత్తవారుఆధార్ కార్డులు నంబర్‌తో పాటు కుల, ఆదాయ, ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డు జెరాక్సుకాపీ , అడ్మిషన్ రసీదు, సెట్ ఎలాట్మెంట్ జెరాక్సు కాపీలు జతచేయాల్సి ఉంటుంది. -
‘ఎఫ్ఐఆర్’పై హైకోర్టుకు ఢిల్లీ సర్కారు
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్: పైడితల్లమ్మ పండగ సందర్భంగా విజయనగరం చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో పోలీసులను భారీగా మోహరించనున్నారు. పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి బొత్ససత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు డీసీసీబీ కార్యాలయం వద్ద నుంచి సిరిమాను ఉత్సవాన్ని తిలకిస్తారు. ఆ పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో పోలీసు బలగాలను మోహరిస్తున్నట్టు సమాచారం. బొత్స రాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉం డేందుకే బలగాలను భారీగా పెంచుతున్నట్టు సమాచారం. సిరిమాను తిరిగే ప్రాం తాల్లోని భవనాల యజమానులకు పోలీసులు నోటీసులు జారీచేస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాల యజమానులతో పాటు సిరిమాను తిరిగే పరిసరాల్లో భవనాలు, షాపుల యజమానులకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఆ రోజుషాపులు మూసివేయాలని బెదిరిస్తున్నట్టు సమాచారం. గుర్తుతెలియని వ్యక్తులను మేడల మీదకు అనుమతించరాదని, ఏదైనా జరిగితే బాధ్యత మీదేనని పోలీసులు బెదిరిస్తున్నట్లు షాపుల యజమానులు చెబుతున్నారు. సమైక్యాంధ్ర ఆందోళనల కారణంగా నష్టపోయిన ఆదాయాన్ని... పండగ రోజుల్లో పెరిగే అమ్మకాల ద్వారా కొంతవరకైనా పొందవచ్చని ఆశలు పెట్టుకున్న వ్యాపారులకు పోలీసుల హెచ్చరికలు అశనిపాతమయ్యాయి. సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా పట్టణంలోని భారీ స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం జరిగింది. ప్రధానంగా మంత్రి, పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణకు చెందిన ఆస్తులపై ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. ఈ నెల 4, 5 తేదీల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విజయనగరంలో విధ్వంసకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. 6వ తేదీనుంచి పట్టణంలో కర్ఫ్యూ విధించారు. అయినా 6, 7 తేదీల్లో కూడా కర్ఫ్యూను సైతం ధిక్కరించి ఆందోళనలు చేసి బొత్సతీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జిల్లాకు వచ్చేందుకు ఆయన వెనుకంజ వేశారు. కర్ఫ్యూ అమలు చేసిన పోలీసులు సమ్యైదులను అరెస్ట్ చేయడంతో భీతిల్లిన పట్టణ ప్రజలు బయటకు రాలేదు. పరిస్థితులు సద్దుమణగడంతో దసరా సందర్భంగా భారీ బందోబస్తు మధ్య జిల్లాలో ట్రయిల్ రన్‌గా అడుగుపెట్టారు. పైడితల్లమ్మ పండగ సందర్భంగా ప్రతి ఏడాది మంత్రి బొత్ససత్యనారాయణ అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఇటీ వల జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ ఏడాది పైడితల్లమ్మ పండుగ బందోబస్తుకు సుమారు 900 మంది పోలీసులను నియమించేవారు. ఈ ఏడాది సుమారు 2500 మంది వరకు నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్ఏఎఫ్, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఏఆర్, సివిల్ పోలీస్ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. పైడితల్లమ్మ పండుగకు ఇంత భారీ స్థాయిలో పోలీసు బందోబస్తును నియమించడంతో వేరే ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పండగకు వెళ్లాలా?, వద్దా? అన్న సంశయంలో పడ్డారు. జిల్లా వాసులు కూడా ఎప్పుడూ ఉండేలా ఈ సారి పండగ సరదా ఉండదని, తమకిదేం బాధని వాపోతున్నారు.