నిధులు చిక్కన - మజ్జిగ పలుచన | People fired on govt buttermilk scheme over quality | Sakshi
Sakshi News home page

నిధులు చిక్కన - మజ్జిగ పలుచన

Published Tue, May 17 2016 11:37 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM

People fired on govt buttermilk scheme over quality

నీళ్ల మజ్జిగతోనే సరిపెడుతున్న వైనం
►  చలివేంద్రాలపై దాహార్తుల మండిపాటు
►  నిధులు దుర్వినియోగానికేనని విమర్శలు
 విజయనగరం
: ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాల్లో మజ్జిగ పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన రూ. 3కోట్లను జిల్లాకు మంజూరు చేసింది. అయితే మజ్జిగ సరఫరా చేసే బాధ్యతను ఎక్కువ ప్రాంతాలకు హెరిటేజ్ కంపెనీకే అప్పగించింది. అంతా బాగానే ఉంది. కానీ చలివేంద్రాల్లో సరఫరా అవుతున్న మజ్జిగ చూసి ఇప్పుడు దాహార్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది మజ్జిగా... లేక మజ్జిగ రంగులోఉన్న మంచినీరా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

సోమవారం ఉదయం కలెక్టరేట్ ప్రధాన గేటును ఆనుకుని ఉన్న ప్రహరీ వద్ద ప్రభుత్వ మజ్జిగ పంపిణీ కేంద్రం పేరుతో ఫ్లెక్సీ పెట్టి మరీ చలివేంద్రం ఏర్పాటు చేశారు. సోమవారం కావడంతో గ్రీవెన్స్ తాకిడి ఎక్కువగా ఉంది. వేసవి తీవ్రత కూడా తక్కువేం లేదు. ఇక వచ్చిన జనం ఎండ వేడిమికి తట్టుకోలేక సర్కారువారి మజ్జిగ సరఫరా కేంద్రానికి వెళ్లి వారిచ్చిన మజ్జిగను నోట్లో పోసుకునే సరికి ఇది మజ్జిగా మంచినీరా అని నిర్వహకులను ప్రశ్నించడం విశేషం. హెరిటేజ్ కంపెనీకి చెందిన చిన్నపాటి బకెట్‌లో పెద్ద ఎత్తున నీరు పోసి పంచుతుండటంతో అక్కడి వారు విమర్శించడం మొదలెట్టారు. చంద్రబాబు కంపెనీకి సొమ్ము ధారపోయడానికి తప్ప రూ. 3కోట్ల మజ్జిగ ఇదా అంటూ వారు ధ్వజమెత్తారు.  
 
 మంచినీరు తాగడం మేలు!
కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రంలోనే మజ్జిగ ఇలా ఉంటే ఇక మారుమూల ప్రాంతాల్లోని మజ్జిగ ఇంకెలా ఉంటుందో వేరే చెప్పాలా... ఈ మజ్జిగ తాగేకన్నా మంచినీరు శుభ్రంగా ఉంటుంది. వట్టి నీరులా ఉంది. ప్రజల ధనం ప్రజలకివ్వడంలో కూడా ఇంత లాభాపేక్షా?
 - ఎం సూరప్పడు, ఒమ్మి, నెల్లిమర్ల మండలం
 
 కోట్ల రూపాయల మజ్జిగ ఇదేనా?
 జిల్లాకు రూ. 3కోట్ల చొప్పున పంపిణీ చేసి మజ్జిగ పంచుతున్నారంటే కాస్త నాణ్యంగా ఉంటుందనుకున్నాం. తీరా తాగాక తెల్సింది మజ్జిగ నాణ్యత! కోట్లు వెచ్చించి ఇస్తున్న మజ్జిగ ఇలానే ఉంటుందా? అధికారులు పర్యవేక్షించి మజ్జిగను నాణ్యంగా అందించాల్సింది పోయి లక్షలాది బిల్లులు కళ్లు మూసుకుని ఇచ్చేస్తే ఇలానే ఉంటుంది.   - మర్రాపు గణపతి, బొబ్బిలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement