విజయనగరం మెయిన్ రోడ్డులో సిరిమానోత్సవ సందడి. (ఇన్‌సెట్‌లో) పైడితల్లికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న మంత్రి కొట్టు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం కనుల పండువగా సాగింది. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా కట్టుదిట్టమైన ఆంక్షల నడుమ ఉత్సవం జరిగింది. ఈ ఏడాది ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో భక్తులు పోటెత్తారు. విజయనగరం వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలివచ్చారు.
రికార్డు స్థాయిలో దాదాపు 4.5 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి , దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సంప్రదాయం ప్రకారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు, అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు దంపతులు అమ్మవారికి వస్త్రాలను తీసుకొచ్చారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం 5.22 గంటలకు సిరిమాను కదిలింది.
పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానుపై ఆశీనులై భక్తులకు దర్శనం ఇచ్చారు. చదురుగుడి నుంచి కోట వరకు మూడు పర్యాయాలు సిరిమానును తిప్పారు. సాయంత్రం 6.42 గంటలకు సిరిమాను జాతర పూర్తయింది. డీసీసీబీ బ్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సిరిమాను ఉత్సవాన్ని వీక్షించారు. కోటపై నుంచి ఆలయ అనువంశిక ధర్మకర్తలు పూసపాటి అశోక్ గజపతిరాజు, సునీలా గజపతిరాజు, సుధా గజపతిరాజు, ఊర్మిళా గజపతిరాజు తదితరులు ఉత్సవాన్ని తిలకించారు.
Comments
Please login to add a commentAdd a comment