ప్రేమోన్మాదానికి ముగ్గురి బలి
♦ పెట్రోలు పోసి నిప్పు అంటించిన ఉన్మాది
♦ అక్కడికక్కడే మృతి చెందిన యువతి
♦ రక్షించేందుకు యత్నించిన తమ్ముడి కన్నుమూత
♦ అనంతరం విజయనగరంలో నిందితుడి ఆత్మహత్య
♦ భీమిలి మండలం టి.నగరప్పాలెంలో సంచలనం రేపిన ఘటన
మధురవాడ / భీమునిపట్నం : ప్రేమోన్మాదం రెండు కుటుంబాల్లో చిచ్చు రేపింది. మూడు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఇంటిలోకి వెళ్లి యువతిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించి గడియ పెట్టేయడంతో ఆమె అక్కడికక్కడే అగ్నికి ఆహుతయింది. రక్షించేందుకు యత్నించిన యువతి సోదరుడు తీవ్ర గాయాలపాలై కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ప్రేమోన్మాది కూడా రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం సంచలనం రేపిన ఈ సంఘటన భీమిలి రూరల్ మండలం టి.నగరప్పాలెంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానికులు, భీమిలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భీమిలి రూరల్ మండలం టి.నగరప్పాలేనికి చెందిన పొట్నూరి రూప(19) తగరపువలసలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం పూర్తి చేసి రెండో సంవత్సరంలోకి ప్రవేశించింది.
బతుకు తెరువు కోసం తండ్రి రమణతో విజయనగరం నుంచి తగరపువలస వచ్చిన పతివాడ హరిసంతోష్ ఆరు నెలలుగా రూప వెంటపడుతున్నాడు. ప్రేమించమని వేధిస్తుండడంతో బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. దీంతో ఆ గ్రామ పెద్దలు తగరపువలస వచ్చి స్థానిక పెద్దల సమక్షంలో హరిసంతోష్‌ను హెచ్చరించి ఓ లెటర్ కూడా రాయించుకున్నారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. వేధింపులు ఆగకపోవడంతో మూడు నెలల నుంచి రూప కళాశాలకు వెళ్లడం మానేసింది. ఈ నేపథ్యంలో నేరుగా రూప ఉంటున్న టి.నగరప్పాలెం కొత్తూరులోని ఇంటికి శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో హరిసంతోష్ చేరుకున్నాడు.
తనను ప్రేమించమని వాదనకు దిగాడు. రూప నిరాకరించడంతో ఒక్కసారిగా ఉన్మాదిలా మారిన సంతోష్ అప్పటికే తనవెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను యువతిపై పోసి నిప్పు అంటించాడు. అనంతరం తలుపు గడియ పెట్టి పరారయ్యాడు. పరిస్థితి గమనించి రక్షించేందుకు యత్నించిన రూప సోదరుడు ఉపేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంటిలో నుంచి దట్టమైన పొగలు రావడంతో గమనించిన స్థానికులు అక్కడకు చేరుకున్నారు. మంటలు పూర్తిగా వ్యాపించడంతో రూప అగ్నికి ఆహుతైపోయింది. ఉపేంద్రను చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న భీమిలి సీఐ బాలసూర్యారావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
అనుకోని దుర్ఘటన జరగడంతో టి.నగరప్పాలెంలో విషాదం నెలకొంది. రూపకు ఐదేళ్ల వయసప్పుడు తల్లి వదిలేసి వెళ్లిపోవడంతో ఆమె తండ్రి పొట్నూరు సూరిబాబు రెండో వివాహం చేసుకున్నాడు. రూప, ఉపేంద్ర మొదటి భార్యకు కలిగిన సంతానం. తండ్రి
రెండో వివాహం చేసుకుని పాతూరులో ఉండడంతో రూప, ఉపేంద్ర నాన్నమ్మ అప్పచ్చమ్మ, తాత ఎల్లయ్య, చిన్నాన్న రవి, పిన్ని నీరజల సంరక్షణలో ఉంటున్నారు. ఇంతలో ఇలా జరగడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఆస్పత్రిలో ఉపేంద్ర మృతి
అక్క మంటల్లో చిక్కుకోవడంతో తాను ఏమైపోయినా ఫర్వాలేదని ప్రాణాలకు తెగించి రూపను కాపాడే క్రమంలో తీవ్ర గాయాలపాలైన ఉపేంద్ర (14) కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. అంతకుమునుపే ఆస్పత్రికి వచ్చిన న్యాయమూర్తి హరినారాయణ ఆ బాలుడి నుంచి వాగ్మూలం తీసుకున్నారు.
నిందితుడి ఆత్మహత్య
విజయనగరం టౌన్ : ప్రేమించలేదనే అక్కసుతో యువతిపై పెట్రోల్ పోసి తగులబెట్టి చంపేసిన నిందితుడు హరిసంతోష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయనగరం రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బతుకుదెరువు కోసం విజయనగరం నుంచి తగరపువలస వెళ్లి అక్కడ బొంతలు కుట్టే పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వెంకటరమణ, గోపమ్మలకు ఇద్దరు ఆడపిల్లల తర్వాత హరి సంతోష్ (22) పుట్టాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకూ చదువుకున్న సంతోష్ తర్వాత చదువు ఆపేసి, తండ్రికి సహాయం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో భీమిలి మండలం టి.నగరప్పాలెంలో రూప అనే విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధిస్తూ శనివారం నిప్పు అంటించి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి భయంతో బైక్ తీసుకుని పారిపోయాడు. విజయనగరం బీసీ కాలనీ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సంతోష్ బంధువులందరూ బీసీ కాలనీలో నివాసముంటున్నారు. రైల్వే జీఆర్‌పీ ఎస్‌ఐ చెల్లూరు శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.