ఆకాంక్షలను చిదిమేస్తున్న సర్కార్ ఆంక్షలు!
Published Sun, Oct 20 2013 2:40 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. ప్రతి నిరుపేద ఉన్నత విద్యను అందుకోవాలన్న మహోన్నత లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ప్రస్తుత పాల కులు తూట్లు పొడుస్తూ వస్తున్నారు. ఏటికేడాది లబ్ధిపొందే విద్యార్థుల సంఖ్యను తగ్గించేందుకు పలు నిబంధనలను విధిస్తున్న సర్కారు ఈ ఏడాది మరిన్ని ఆంక్షలను పెట్టింది. ఈ ఏడాది ఉపకారవేతనం, రీయింబర్స్‌మెంట్ పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
విద్యార్థులందరికీ ఆధార్ కార్డులు పూర్తిస్థాయిలో జారీ చేయకముందే ఈ నిబంధన విధించడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎలా చదువుకోవాలన్న బాధ వారిని పీడిస్తోంది. మధ్యలో ముగించవలసి వస్తుందేమోనని వారు బెంగపడుతున్నారు. వాస్తవానికి ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తిస్థాయిలో జరిగిన తరువాతే నిబంధనలు పెట్టాలి. అయితే అందుకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీంతో పేద విద్యార్థులు ఆందోళనచెందుతున్నారు. మరోవైపు ఆధార్ కార్డు లేకపోవడంతో దరఖాస్తులు చేయలేని విద్యార్థులు ఫీజులు కట్టాలని యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వేలాది మంది విద్యార్థులు సంక్షేమ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఫలితం లభించడం లేదు. మరోవైపు డిగ్రీ , పీజీ కోర్సులు చదివి ప్రస్తుతం డైట్, పాలిటెక్నికల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ రాదని స్పష్టం చేయడంతో ఆ విద్యార్థుల పరిస్థితి ముందు నుయ్యి... వెనుక గొయ్యి అన్న చందంగా ఉంది. ఇలా చదువుతున్న విద్యార్థులు జిల్లావ్యాప్తంగా 1200 మంది వరకు ఉన్నారు. తమకు అవకాశం కల్పించాలని లేనిపక్షంలో మధ్యలో తమ చదువులకు స్వస్థి చెప్పాల్సి ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 45వేల మంది రెన్యూవల్ విద్యార్థులున్నారు.
వీరు ఉపకార వేతనాలు కోసం దరఖాస్తులు చేసుకోవటానికి గడువు ఇచ్చి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు కేవలం 13,264 మంది విద్యార్థులు మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. మిగిలిన వారు ఆధార్ కార్డుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. అలాగే కొత్తగా ఉపకారవేతనాలు పొందగోరే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 35 వేల మంది ఉండగా వీరిలో కేవలం 2500 మంది మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి దరఖాస్తులు చేసుకోవటానికి గడువు ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నప్పటికీ ఊహించిన స్థాయిలో దరఖాస్తులు రావడం లేదు. సంక్షేమ శాఖాధికారులు మాత్రం ఆధార్ కార్డులు ఉంటేనే దరఖాస్తులు చేసుకోవ డానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. దీంతో తమ చదువులు ఏమవుతాయోనన్న ఆందోళనతో పేద విద్యార్థులు కొట్టు మిట్టాడుతున్నారు.
రెన్యువల్ విద్యార్థులు ఇలా దరఖాస్తులు చేసుకోవాలి
ఈపాస్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రెన్యువల్ విద్యార్థులు మార్కుల మెమో పాస్/ఫెయిల్‌తో పాటు ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా జెరాక్సు కాపీ, ఆదాయ ధ్రువీకరణ పత్రం, డిక్లరేషన్ తో దరఖాస్తులు చేసుకోవాలి.కొత్తవారుఆధార్ కార్డులు నంబర్‌తో పాటు కుల, ఆదాయ, ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డు జెరాక్సుకాపీ , అడ్మిషన్ రసీదు, సెట్ ఎలాట్‌మెంట్ జెరాక్సు కాపీలు జతచేయాల్సి ఉంటుంది.
Advertisement
Advertisement