జాతి శ్రేయస్సు.. జీవితానికి ఉషస్సు
జాతి శ్రేయస్సు.. జీవితానికి ఉషస్సు
Published Wed, Jul 20 2016 11:42 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
ఎన్‌సీసీతో యువతకు బంగారు భవిత
సమాజ సేవ.. దేశరక్షణకు వారధి
అద్భుతమైన ఉద్యోగావకాశాలు
విజయనగరం టౌన్ : ఎన్‌సీసీ అంటే బాల సైనికులు అనిపేరు. ఆర్మీలో ఏ విధంగా శిక్షణ తీసుకుని పనిచేస్తారో అదేరీతిలో బాలసైనికులను తయారుచేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థ. ఇందులో బాలసైనికులకు డ్రిల్, వెపన్ ట్రైనింగ్, మేప్ రీడింగ్ వంటివి ప్రధానంగా నేర్పిస్తారు. పదమూడేళ్లు దాటిన విద్యార్థులు ఇందులో చేరవచ్చు. 9, 10వ తరగతలకు ఎ, ఇంటర్‌కి బి, డిగ్రీకి సి సర్టిఫికెట్లను అందజేస్తారు. ప్రతి వారం క్యాంప్‌లకు ఆర్మీ సిబ్బంది వచ్చి శిక్షణ ఇస్తారు. ఏడాదిలో మూడు క్యాంప్‌లు నిర్వహిస్తారు. కమాండింగ్ ఆఫీసర్‌ల ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి. సామాజిక సేవే లక్ష్యంగా ఎన్‌సీసీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సహజ వనరులు, క్యాన్సర్, రక్తదానం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై వివిధ కార్యక్రమాల నిర్వహణలో ఎన్‌సీసీ క్యాడెట్లు ఆదర్శంగా నిలుస్తున్నారు.
జిల్లాలో ఎన్‌సీసీ యూనిట్లు
విజయనగరంలోని సత్య డిగ్రీ కళాశాల, మహారాజ కళాశాల, మహారాజా మహిళా కళాశాల, ఎస్‌కే డిగ్రీ కళాశాల, గరివిడి ఎస్‌డీఎస్ కళాశాల, పార్వతీపురం ఎస్‌వీడీ కళాశాలల్లో ఎన్‌సీసీ యూనిట్లు ఉన్నాయి. జిల్లాలోని ఏడు ఎన్‌సీసీ యూనిట్లలో 13 ఆంధ్రా బెటాలియన్ బాయ్స్ (విశాఖ), 14 ఆంధ్రా (శ్రీకాకుళం) 2 ఆంధ్రా గర్ల్స్ బెటాలియన్ (విజయనగరం), 6 ఎయిర్ వింగ్ (విశాఖ), 3 నేవల్, 4 నేవల్ (విశాఖ), 2 సీటీఆర్ (విశాఖ), ఇంజినీరింగ్ విభాగంలో 2 సీటీఆర్ (విశాఖ)లో ఇంజినీరింగ్ విద్యార్థులే ఉంటారు. ఇవన్నీ విశాఖ గ్రూప్ కిందకు వస్తాయి. ఇందులో బాలురు, బాలికల విభాగాలున్నాయి. బాలుర విభాగంలో జిల్లా వ్యాప్తంగా 700, బాలికల విభాగంలో సుమారు 300 మంది విద్యార్థినులున్నారు.
ప్రత్యేక శిబిరాల నిర్వహణ
ఎన్‌సీసీ క్యాడెట్లుగా మూడు విభాగాల్లో చేరిన విద్యార్థులకు ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తారు. బేసిక్ లీడర్‌షిప్, వాయు, సైనిక్, నవ్‌సైనిక్, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, నేషనల్ ఇంటిగ్రేషన్, థల్ సైనిక్, ఆర్మీ ఎటాచ్‌మెంట్, ఎయిర్‌ఫోర్స్ అటాచ్‌మెంట్, రిపబ్లిక్ డే, యాన్యువల్ శిబిరాలను నిర్వహిస్తారు.
సీనియర్ డివిజన్ స్ధాయిలో..
ఎన్‌సీసీలో సీనియర్ డివిజన్ స్థాయిలో చేరిన క్యాడెట్లకు వారి ప్రతిభను బట్టి ప్రత్యేక ర్యాంకులను కేటాయిస్తారు. సీనియర్ అండర్, ఆఫీసర్, క్యాడెట్, జూనియర్ అండర్ ఆఫీసర్, కంపెనీ క్వార్టర్ మాస్టర్, సార్జెంట్, సార్జెంట్ కార్పొరల్, లాన్స్ కార్పొరల్ తదితర ర్యాంకులను ఇస్తారు.
ధ్రువపత్రాల స్థాయి
–ఎన్‌సీసీ ధ్రువæపత్రాలకు విలువ ఎక్కువ. హైస్కూల్ స్థాయిలో ‘ఎ’, కళాశాల (ఇంటర్) స్థాయిలో ‘బి’, డిగ్రీ స్థాయిలో ‘సి’ సర్టిఫికెట్‌ను ఇస్తారు. వీటికోసం నిర్వహించే పరీక్షల్లో ఎన్‌సీసీ క్యాడెట్లు ఉత్తీర్ణత సాధించాలి.
– జూనియర్ డివిజన్‌లో ‘ఎ’ సర్టిఫికెట్ పొందాలంటే రెండేళ్ల శిక్షణ. 75 శాతం హాజరు ఉండాలి. థియరీ, ప్రాక్టికల్స్ సరాసరి 50 శాతం మార్కులు పొందాలి. కనీసం ఒక ఏటీసీ క్యాంపునకు హాజరుకావాలి. సీనియర్ డివిజన్ స్థాయికి ఇదే వర్తిస్తుంది.
– ఎన్‌సీసీలో శిక్షణ పొంది, పోలీస్, నేవీ, ఆర్మీ, బోర్డర్ సెక్యూరిటీ, వంటి రక్షణ విభాగాల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులెందరో ఉన్నారు. ఎన్‌సీసీ అభ్యర్థులు ప్రత్యేక కోటా కింద ప్రభుత్వోద్యోగావకాశాలు దక్కించుకుంటున్నారు.
Advertisement
Advertisement