మృత్యుకుహర
Published Fri, Nov 15 2013 2:28 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
గుర్ల, న్యూస్‌లైన్:వారు ముగ్గురూ ప్రాణ స్నేహితులు.. ప్రతిరోజూ కలిసిమెలిసి పాఠశాలకు వెళ్తుంటారు.. బాలల దినోత్సవం కావడంతో విద్యార్థులందరూ సరదాగా పిక్నిక్‌కు వెళ్లారు. అంతా కలసి బంతాట ఆడారు. ఆ సమయంలో వీరు ఆడుతున్న బంతి చంపావతి నదిలోని ఓ గొయ్యి వద్ద పడింది. అక్కడే మృత్యువు పొంచి ఉందని.. ఆ గొయ్యే వారి ప్రాణాలను బలి తీసుకుంటుందని పాపం ఆ పసివాళ్లు ఊహించలేకపోయారు. బాలల పండగ రోజునే.. ముగ్గురు బాలికలు విగతజీవులయ్యారు. ఈ హృదయ విదారక ఘటన గుర్ల మండలం చింతలపేట సమీపంలో చంపావతి నది వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గురువారం బాలల దినోత్సవం,
సెలవు దినం కావడంతో గుర్ల మండలం చింతలపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సుమారు 40 మంది పిక్నిక్‌కు వెళ్లారు. గ్రామ సమీపంలో ఉన్న చంపావతి నది పక్కన మామిడితోటలో అంతా ఆటపాటలతో గడిపారు. అదే గ్రామానికి చెందిన పిల్లా గీత(14), సుంకరి భవాని(13), తాళ్లపూడి మౌనిక(14) బంతాట ఆడుతుండగా... సమీపంలోని చంపావతి నదిలో గుంత వద్దకు బంతి చేరుకుంది. బంతిని తీయడానికి వెళ్లిన భవానీ గుంతలో పడి మునిగిపోయింది. ఆమెను కాపాడేందుకు వెళ్లిన గీత కూడా గుంతలోకి జారిపడింది. కళ్ల ముందే జరుగుతున్న ఘోరాన్ని చూసి.. నేస్తాలను రక్షించే ప్రయత్నంలో మౌనిక కూడా వెళ్లి గుంతలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయింది. మిగతా విద్యార్థులు గమనించి వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించారు. అప్పటికే వీరు ముగ్గురూ ప్రాణాలు విడిచారు. మృతదేహాలను పోలీసులు బయటకు తీసి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement