‘‘ఫ్లయిట్ టేకాఫ్ అయింది. అంతా బాగానే ఉంది. ఇంతలోనే చిన్నపాప గుక్కపట్టిన ఏడుపు. ఉన్నపళంగా ఆ బుజ్జిదాని కోసం ఏమైనా చేయాలనిపించేంత బాధగా ఏడుస్తోంది. ఆ వైపు వెళ్లాను. ఆ బిడ్డను సముదాయించలేక తల్లి అవస్థపడుతోంది. ‘బహుశా ఆకలేస్తోందేమో.. పాలు పట్టకపోయారా?’ అడిగా. నిస్సహాయంగా చూసిన ఆమె కళ్లల్లో నీళ్లు. ‘అరే.. ఏమైంది? అంతా ఓకే కదా?’ అన్నాను కంగారుగా. ‘పోతపాలు పట్టాలి. నేను తెచ్చినవి అయిపోయాయి’ అంది ఆమె బేలగా. తోటి ప్రయాణికులు ఏడుస్తున్న పాప వంక జాలిగా చూడ్డం మెదలుపెట్టారు. ఫ్లయిట్ లైన్ అడ్మినిస్ట్రేటర్.. మిస్ షేర్లీ విల్‌ఫ్లోర్.. బిడ్డను తీసుకొని గ్యాలే (ఫ్లయిట్‌లో కిచెన్ లాంటి చోటు) కి వెళ్లమని సూచించింది. పాపాయేమో ఆగకుండా ఏడుస్తూనే ఉంది. ఫ్లయిట్‌లోకూడా పోతపాలు లేవు. నా మనసు చివుక్కుమంది. ఎలా? పాపం.. పసిదానికి ఎంత ఆకలేస్తోందో ఏమో? ఆ టైమ్‌లో నేను చేయగల పని ఒక్కటే.. సంకోచం లేకుండా ఆ తల్లికి చెప్పాను.. ‘మీకు అభ్యంతరం లేకపోతే.. మీ బిడ్డకు నేను పాలిస్తాను. నాకూ తొమ్మిది నెలల కూతురు ఉంది. ఇంకా పాలిస్తున్నాను. పట్టనా?’ అని ఆగాను. ఆ తల్లి గబగబా కళ్లు తుడుచుకొని తన బిడ్డను నా చేతుల్లో పెట్టింది. పాలు తాగుతూ తాగుతూ అలాగే నా ఒళ్లో నిద్రపోయింది చిట్టితల్లి. పాప నిద్రపోయాక ఆ అమ్మ మొహంలో చెప్పలేని రిలాక్సేషన్. బిడ్డను ఆమెకు అప్పగించి తన సీట్ వరకూ తోడు వెళ్లా. ఆమె ప్రశాంతంగా కూర్చున్నాక నేను వెనుదిరుగుతుంటే నా చేయి పట్టుకుంది.. మళ్లీ ఆమె కళ్ల నిండా నీళ్లు.. కృతజ్ఞతతో!
నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నా.. ఒక బిడ్డ ఆకలి తీర్చే శక్తి నాకు ఇచ్చినందుకు.. వరంగా అమృతాన్ని నాలో నింపినందుకు!ఈ ఫ్లయిట్ ఎక్కేముందే అనుకున్నా.. ఇది నాకు చాలా స్పెషల్ అని.. ఎందుకంటే అంతకుముందే ఎవాల్యుయేటర్‌గా ప్రమోషన్ తీసుకున్నా. కాని ఇంత ప్రత్యేకమని ఊహించలేదు.’’ఇది ఫేస్‌బుక్ పోస్ట్. నాలుగైదు రోజులుగా వైరల్ అవుతోంది. పెట్టిన రోజే 34 వేల షేర్లు పొందింది. ఈ పోస్ట్ పెట్టిన వ్యక్తి పేరు పట్రీషా ఒర్‌గానో. 24 ఏళ్లు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా వాస్తవ్యురాలు. ఆ దేశానికి చెందిన ఓ ఎయిర్‌లైన్స్‌లో ఫ్లయిట్ అటెండెంట్‌గా పనిచేస్తోంది. డ్యూటీ లేని వేళల్లో తల్లి పాల ప్రాముఖ్యతను ప్రచారం చేస్తోంది íఫిలిప్పీన్స్‌లో. మాటలే కాదు.. బిడ్డ ఆకలితీర్చే సమయమొస్తే చేతల్లోనూ చూపెట్టింది పట్రీషా. ఫ్లయిట్‌లో ఏడ్చిన బిడ్డ తల్లి అంతకుముందు రోజు రాత్రంతా కనెక్టింగ్ ఫ్లయిట్ కోసం ఎయిర్‌పోర్ట్‌లోనే ఉంది. అందుకే పోతపాలు అయిపోయాయి. ఫ్లయిట్‌లో ఉంటాయేమో అనుకుంది. తెల్లవారు ఝామున ఈ ఫ్లయిట్ ఎక్కింది. దురదృష్టవశాత్తు పోతపాలు లేవు. అదృష్టవశాత్తు అమ్మ పాలే దొరికాయి!
అమృతమూర్తి పట్రీషా
Published Fri, Nov 16 2018 12:08 AM | Last Updated on Fri, Nov 16 2018 12:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment