పిల్లల హార్ట్లోని రంధ్రాలు
పిల్లల్లో గుండెలో రంధ్రాల సాధారణంగా రెండు రకాలుగా ఉండే అవకాశం ఉంది. ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ (ఏఎస్‌డీ... అంటే గుండె పై గదుల్లోని గోడలో రంధ్రాలు)గాని, వెంట్రిక్యులార్ సెప్టల్ డిఫెక్ట్ (వీఎస్‌డీ... అంటే గుండె కింది గదుల్లోని గోడలో రంధ్రాలు) గాని ఉండవచ్చు. వీటి వల్ల పిల్లలకు ఉండే లక్షణాలు... పాలు తాగలేకపోవడం, ఆయాసం, పెరుగుదల సరిగా లేకపోవడం, ఊపిరితిత్తుల్లో నెమ్ము రావడం సాధారణంగా కనిపిస్తాయి. కొందరిలో రక్తనాళాల సమస్య వల్ల నీలంగా మారిపోయే అవకాశం ఉంటుంది.
ఆ పిల్లలకు తక్షణ శస్త్రచికిత్స అవసరం. పాలు తాగలేకపోవడం, ఆయాసం, పెరుగుదల సరిగా లేకపోవడం, ఊపిరితిత్తుల్లో నెమ్ము రావడం... ఈ సమస్యలకు చికిత్స అనేది రంధ్రం పరిమాణం, స్థానాన్ని బట్టి చికిత్స చేస్తారు. అవి వాటంతట అవే మూసుకుపోతాయా లేదా అన్నది కూడా ఆ రంధ్రాల పరిమాణం, అవి ఉన్న స్థానాలను బట్టి, ఆ రంధ్రాలు ఉండటం వల్ల వచ్చే ఇతరత్ర సమస్యలపై ఆధారపడి ఉంటుంది.
గుండె పై గదుల మధ్య ఉన్న గోడకు రంధ్రం ఉన్న పిల్లలకు దాదాపు 60 శాతం నుంచి 70 శాతం మందిలో అవి వాటంతట అవే మూసుకుపోతాయి. గుండె కింది గదుల్లోని గోడకు రంధ్రం ఉన్న పిల్లలకు దాదాపు 30 శాతం నుంచి 70 మందిలోనూ స్థానాన్ని బట్టి ఆ రంధ్రాలు వాటంతట అవే మూసుకుపోవచ్చు. అలాగని గుండె గోడలకు ఉన్న రంధ్రాలన్నీ వాటంతట అవే మూసుకుపోతాయ నేందుకు అవకాశం ఉండదు. పిల్లల్లో గుండె రంధ్రాలు ఉన్నప్పుడు పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌కు చూపించాలి. అంటే ప్రత్యేకంగా పిల్లలకోసం ఉండే గుండె చికిత్స నిపుణులు అన్నమాట. కొందరిలో అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స చేయించాల్సి ఉంటుంది. అయితే అది వెంటనే చేయాలా లేక కాస్తంత వ్యవధి తీసుకోవచ్చా అన్నది పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ నిర్ణయిస్తారు. సరైన సమయంలో చికిత్స చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది.లేకపోతే ఊపిరితిత్తులు కూడా పాడై పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్న ఆధునిక వైద్య పరిజ్ఞానం సహాయంతో ఆపరేషన్ లేకుండానే చాలా వరకు రంధ్రాలను మూయవచ్చు.