
లక్షణంగా.. లగ్జరీగా..
ఈ డ్రెస్‌ల ధరలు లక్షల్లో పలుకుతాయి. రోహిత్ బాల్ మ్యాజిక్ ఇది. కంటికి ఇంత ఇంపుగా ఒంటికి ఎంతో సొంపుగా ఉండటానికి అంత ధరపలకడానికి సృజనే కారణం. లక్షలు పోయలేకపోతేనేం... ఈ డిజైన్స్‌తో స్ఫూర్తిపొంది మన డిజైన్లు మనమే చేసుకొని లక్షణంగా వెలిగిపోవచ్చు.
బంగారు, జరీ దారాలతో ఆప్లిక్ వర్క్ చేసిన హాఫ్‌వైట్ శారీపై పువ్వుల మోటిఫ్స్.. బంగారు వర్ణపు చారల అంచు... అదే రంగు బ్రొకేడ్ బ్లౌజ్‌కు గోల్డెన్ కాలర్ ఈ చీరను గ్రాండ్‌గా నిలిపాయి. ధర: రూ. 2,50,000/-
పసుపు, గులాబీ కలగలిసిన నారింజ రంగు బ్రొకేడ్ లాంగ్ జాకెట్... దానికి మాండరిన్ కాలర్, ముందు భాగంలో బటన్ ప్లాకెట్. పొడవాటి చేతులు, వాటికి బటన్స్ కఫ్స్.. హాఫ్‌వైట్ ముడతల లెహంగా... బ్రొకేడ్ దుపట్టా ఈ డ్రెస్ ప్రత్యేకతలు.
ధర రూ.94,990/-
కట్‌దానా వర్క్ చేసిన పువ్వుల జాకెట్టు.. లెహంగా మీద గోల్డెన్ సీక్వెన్స్, కట్‌దానా ఎంబ్రాయిడరీ కాంబినేషన్.. మ్యాచింగ్ దుపట్టా ఈ లెహంగా సూట్ స్పెషల్. ధర. రూ. 2,49,990/-
ప్రపంచ ఫ్యాషన్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న డిజైనర్ రోహిత్‌బాల్. యాభైనాలుగేళ్ల వయసులోనూ ఇరవై నాలుగు గంటలూ సృజనాత్మకతకు ప్రాముఖ్యం ఇచ్చే బాల్ కాశ్మీర్‌వాసి. మనదేశంలోని ప్రసిద్ధ డిజైనర్లలో ఒకరు. పాతికేళ్ల క్రితం న్యూఢిల్లీలో ఓ చిన్న స్టోర్‌తో ప్రారంభించి అనతి కాలంలోనే ప్యారిస్, న్యూయార్క్, లండన్, సింగపూర్ వంటి మహానగరాలలో తన సత్తా చాటుకున్నారు. మన దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ రోహిత్‌బాల్ స్టోర్స్ ఉన్నాయి. మహిళల, పురుషుల వస్త్రనైపుణ్యంలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న బాల్ డిజైన్స్‌లో ఎక్కువగా నెమలి అలంకారాలు చూస్తాం. అలాగే వెల్వెట్, బ్రొకేడ్ ఫ్యాబ్రిక్స్, బంగారు జరీ అంచులను తన డిజైన్స్‌లో విరివిగా వాడతారు. హాఫ్‌వైట్ కలర్ ఫ్యాబ్రిక్‌తో అబ్బురపరిచే డిజైన్లు సృష్టించడం బాల్ ప్రత్యేకత. భారతదేశ గొప్పదనాన్ని, రాచకళను తన డిజైన్స్‌లో చూపించడం మరో ప్రత్యేకత. న్యూఢిల్లీ ఫ్యాషన్ టెక్నాలజీలో పట్టా అందుకున్న బాల్ రూపొందించిన ఆభరణాలకు కూడా దేశ విదేశాలలోనూ మంచి పాప్యులారిటీ ఉంది. డిజైనర్‌గానే కాకుండా ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు బాల్. రోహిత్ బాల్ మరిన్ని డ్రెస్ డిజైన్స్ కోసం http://www.rohitbal.com కు లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు.