
మిరియాలు ఆహారానికి రుచితో పాటు దేహానికి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. వాటితో ఉన్న కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇవి.
మిరియాలకు కడుపులోని జీర్ణరసాలను స్రవింపజేసే గుణం ఉంది. ఆకలిని ప్రేరేపిస్తాయి. అందుకే ఆహారం జీర్ణం కాకుండా కడుపు ఉబ్బరం వంటి సమస్యతో బాధపడేవారు మిరియాలను తీసుకోవడం మంచిది. అవి కడుపులోని జీర్ణక్రియకు ఉపయోగపడే ఎంజైములను, రసాయనాలను పుష్కలంగా స్రవించేలా చేసి, ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు దోహదపడతాయి. మిరియాలతో కూడిన ఆహారం తీసుకునేవారిలో కడుపు సంబంధిత సమస్యలు చాలా తక్కువ. అవి మలబద్దకాన్ని, డయేరియాను సైతం నివారిస్తాయి. మిరియాలలో యాంటీబయాటిక్ గుణాలు ఉండటం వల్ల హానికరమైన ఇన్ఫెక్షన్స్‌ను సమర్థంగా నిరోధిస్తాయి. జలుబు, దగ్గు వంటి సమస్యలకు తొలుత స్ఫురించే చిట్కా వైద్యం మిరియాలే. అవి జలుబు, దగ్గులను నివారించడానికి వాటిలోని యాంటీబ్యాక్టీరియల్ గుణమే కారణం.
ఛాతీ పట్టేసినట్లు ఉన్నా, శ్వాస తీసుకోవడం కష్టమైనా మిరియాలు తీసుకుంటే తక్షణం ఆ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎన్నో రకాల క్యాన్సర్ల నివారణకు సమర్థంగా తోడ్పడతాయి. మన శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను మిరియాలు సమర్థంగా అరికట్టడం ద్వారా క్యాన్సర్‌ను నివారిస్తాయి. మిరియాలు తీసుకునేవారిలో పొట్ట పెరగదు. అంతేకాదు... అవి బరువు పెరగకుండా కూడా తోడ్పడతాయి. మిరియాలలోని పైపరిన్ అనే పదార్థం మెదడు కణాలను ఉత్తేజపరుస్తుంది. దాంతో మతిమరపు, అలై్జమర్స్ లాంటి అనేక నాడీవ్యవస్థకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. మెదడు చురుగ్గా ఉంటుంది.