Peppers
-
విరగ్గాసిన కాఫీ.. మురిసేలా మిరియం
సాక్షి,పాడేరు: గిరిజనుల సాగులో ఉన్న కాఫీ తోటల్లో ఈ ఏడాది కాపు అధికంగా ఉంది. విరగ్గాసిన కాయలతో పాడేరు డివిజన్లో తోటలు కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ముందస్తుగానే పక్వానికి వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే పండ్ల దశకు చేరుకుంటున్నాయి. కాపు ఆశాజనకంగా ఉందని, దిగుబడులు బాగుంటాయని గిరిజన రైతులు ఆనందంగా చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఐటీడీఏ కాఫీ విభాగం గత 20ఏళ్ల నుంచి కాఫీ సాగును ప్రోత్సహిస్తోంది. పాడేరు డివిజన్లోని 11 మండలాల్లో సుమారు 2,10,000 ఎకరాల్లో కాఫీ తోటలుండగా 1,50,000 ఎకరాల విస్తీర్ణంలో గల కాఫీ తోటలు ఫలాసాయాన్ని ఇస్తున్నాయి. మే నెల నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలు కాఫీ పంటకు ఎంతో మేలు చేశాయి. గత ఏడాది ఏడు వేల టన్నుల వరకు దిగుబడి రాగా, ఈ ఏడాది దిగుబడి మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కేంద్ర కాఫీ బోర్డు అధికారులు చెబుతున్నారు. ఆశాజనకంగా మిరియాల కాపు కాఫీ తోటల్లో గిరిజన రైతులు అంతర పంటగా సాగు చేస్తున్న మిరియాల కాపు కూడా ఆశాజనకంగానే ఉంది. ముందుగానే కాపు వచ్చింది. సుమారు లక్ష ఎకరాల కాఫీ తోటల్లో అంతర పంటగా మిరియాలను గిరిజన రైతులు సాగు చేస్తున్నారు. కాఫీ తోటకు నీడనిచ్చే సిల్వర్ ఓక్ వృక్షాలకు మిరియాల పాదులను ఎక్కించి అంతర్ పంటగా సాగు చేస్తున్నారు. ప్రతీ చెట్టుకు ఉన్న మిరియాల పాదుల ద్వారా కనీసం 10 కిలోల ఎండు మిరియాల దిగుబడి వస్తుంది. ఈ ఏడాది మిరియాల దిగుబడులు కూడా అధికంగానే ఉంటుందని ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాఫీ, మిరియాల పంటకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఐటీడీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాఫీ రైతులకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నారు. (చదవండి: అమరావతి రైతుల పేరిట ఉత్తరాంధ్రలో యాత్ర ఎలా?: చెట్టి ఫాల్గుణ) -
గరం గరం మిర్చి ... స్పేస్‌లో పండించారు మరి!
వీరంతా ‘నాసా’ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోని వ్యోమగాములు. ఇలా మిరపకాయలు చూపుతున్నారేంటి అంటుకుంటున్నారా? మరి ఇవి ఎంతో ప్రత్యేకమైనవి. భూమికి సుమారు 300 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఐఎస్ఎస్లో మైక్రో గ్రావిటీ స్థితిలో వారు పండించినవి!! వాటిని రుచి చూసే ముందు ఇలా కోతకోసిన ‘పంట’ను చూపి తెగ సంబరపడ్డారన్నమాట. ఆపై ఈ మిరపకాయల్లో కొన్నింటిని ఫజీతా బీఫ్తోపాటు కాయగూరల్లోకి చేర్చుకొని తిన్నారు. అంతరిక్షంలో మిరపకాయలు పండించడం ఇది రెండోసారి అయినప్పటికీ వాటిని వ్యోమగాములు ఆహారంలో ఉపయోగించడం మాత్రం ఇదే తొలిసారి. నెల రోజుల క్రితం ఈ సంఘటన జరిగింది. కాస్త ఆలస్యంగా కాపు... అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో పండించిన మిరపకాయలు భూమ్మీది కంటే కాస్త ఆలస్యంగా కాపుకు వచ్చాయని, 120 రోజులకు బదులు 137 రోజుల తరువాత కాయలు కోతకు సిద్ధమయ్యాయని పరిశోధనలకు నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త మాట్ రోమీన్ వివరించారు. ప్లాంట్ హ్యాబిటాట్–04లో అక్టోబర్‌లో కాయల్ని కోశామని.. అదే సమయంలో వ్యోమగాములు మారుతుండటంతో వచ్చిన వారితోపాటు మళ్లీ భూమ్మీదకు వెళుతున్న వారికీ కొన్ని మిరపకాయలను పంపామని (ల్యాబ్‌లో ప్రయోగాలకు) తెలిపారు. ఇలా 137 రోజులపాటు పంట పండించడం ఐఎస్ఎస్లో రికార్డన్నారు. ప్రయోగం విజయవంతమైనం దున త్వరలోనే చిన్నసైజు టొమాటోలు, ఆకుకూరలు పండించే ప్రయత్నం చేస్తామని రోమీన్ తెలిపారు. -
జీర్ణశక్తికి మిరియాలు
మిరియాలు ఆహారానికి రుచితో పాటు దేహానికి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. వాటితో ఉన్న కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇవి. మిరియాలకు కడుపులోని జీర్ణరసాలను స్రవింపజేసే గుణం ఉంది. ఆకలిని ప్రేరేపిస్తాయి. అందుకే ఆహారం జీర్ణం కాకుండా కడుపు ఉబ్బరం వంటి సమస్యతో బాధపడేవారు మిరియాలను తీసుకోవడం మంచిది. అవి కడుపులోని జీర్ణక్రియకు ఉపయోగపడే ఎంజైములను, రసాయనాలను పుష్కలంగా స్రవించేలా చేసి, ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు దోహదపడతాయి. మిరియాలతో కూడిన ఆహారం తీసుకునేవారిలో కడుపు సంబంధిత సమస్యలు చాలా తక్కువ. అవి మలబద్దకాన్ని, డయేరియాను సైతం నివారిస్తాయి. మిరియాలలో యాంటీబయాటిక్ గుణాలు ఉండటం వల్ల హానికరమైన ఇన్ఫెక్షన్స్ను సమర్థంగా నిరోధిస్తాయి. జలుబు, దగ్గు వంటి సమస్యలకు తొలుత స్ఫురించే చిట్కా వైద్యం మిరియాలే. అవి జలుబు, దగ్గులను నివారించడానికి వాటిలోని యాంటీబ్యాక్టీరియల్ గుణమే కారణం. ఛాతీ పట్టేసినట్లు ఉన్నా, శ్వాస తీసుకోవడం కష్టమైనా మిరియాలు తీసుకుంటే తక్షణం ఆ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎన్నో రకాల క్యాన్సర్ల నివారణకు సమర్థంగా తోడ్పడతాయి. మన శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను మిరియాలు సమర్థంగా అరికట్టడం ద్వారా క్యాన్సర్‌ను నివారిస్తాయి. మిరియాలు తీసుకునేవారిలో పొట్ట పెరగదు. అంతేకాదు... అవి బరువు పెరగకుండా కూడా తోడ్పడతాయి. మిరియాలలోని పైపరిన్ అనే పదార్థం మెదడు కణాలను ఉత్తేజపరుస్తుంది. దాంతో మతిమరపు, అలై్జమర్స్ లాంటి అనేక నాడీవ్యవస్థకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. మెదడు చురుగ్గా ఉంటుంది. -
ఇంటిప్స్
మిరపకాయలు కోసే ముందు చేతులకు కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ రాసుకుంటే మంట పుట్టదు. శెనగపిండి నిల్వ అయిపోతే పారేయాల్సిన అవసరం లేదు. దానిలో కాసింత నిమ్మరసం కలిపి పాత్రలు తోమితే తళతళలాడతాయి. చీజ్, పన్నీరు లాంటివి నిల్వ చేసే డబ్బాలో చిన్న బెల్లం ముక్క ఉంచితే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. సగం కోసిన ఉల్లిపాయ పాడవకుండా ఉండాలంటే... వెన్న రాసి ఉంచాలి.