వ్యక్తిగత లక్ష్యాలు
సంతోషం సగం బలం...
బీ హ్యాపీ
పగటికల: మీ కలల్లోని అందమైన ప్రాంతాన్ని ఊహించుకోండి. నిదానంగా శ్వాస పీల్చి వదులుతుండండి. అది ఒక బీచ్, శిఖరాగ్రం, మీ గతంలోని ఓ చక్కని గది... ఇలా ఏదైనా కావచ్చు. ఆ ప్రాంతాన్ని తలచుకోవడం ఒక ప్రశాంతతను, ఏకాగ్రతను అందిస్తుంది.
పాజిటివ్‌గా: సంతోషకరమైన ఆనందదాయకమైన క్షణాలను నెమరువేసుకోండి. మీకున్న సౌకర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, మంచి వ్యక్తుల సామీప్యాన్ని గుర్తు తెచ్చుకోండి. ఏది జరిగినా మన మంచికే అన్న ఆశావహ దృక్పథాన్ని అలవర్చుకోండి. వీలైనంత వరకూ ఎదుటివారి గురించి కూడా మంచే ఆలోచించండి.
నెగిటివ్‌కి నో: {పతికూల ఆలోచన మైండ్‌ను పాడు చేస్తుంది. దానిని దరిచేరనీయకండి. ఎంజాయ్ ద వర్క్. అలా అని ఊరకే ఏదో ఒక పని చేస్తూనే ఉండకండి. ఒకసారి ఒక పని మాత్రమే చేయండి. అప్పుడు ఒత్తిడి ఉండదు. అలాగే వాకింగో, ఫ్రెండ్స్‌తో ముచ్చట్లకో వెళుతుంటే సెల్ ఫోన్‌కి గుడ్‌బై చెప్పండి. దాంతో చేస్తున్న పనిని ఆనందించే అవకాశం పెరుగుతుంది.
అభిరుచులు: {పతి ఒక్కరూ ఎటువంటి ప్రతిఫలాన్నీ ఆశించకుండా కేవలం ఆనందం కోసం మాత్రమే చిన్నదో పెద్దదో అభిరుచిని ఏర్పరచుకోవాలి. పూర్తి ఇష్టంతో చేసే పనుల ద్వారా మనలోని సామర్ధ్యాలన్నీ పూర్తి స్థాయిలో వెలికి వస్తాయి. పైగా నచ్చిన పని చేయడంలో ఉండే ఆనందమే వేరు.
వ్యక్తిగత లక్ష్యాలు: లక్ష్యాలనేవి పెద్దవే కానక్కర్లేదు. ఎప్పటి నుంచో చదవాలనుకుంటున్న బుక్ కావచ్చు లేదా కొన్ని క్లిష్టమైన పదాలకు అర్థం తెలుసుకోవడం కావచ్చు, ఎప్పటి నుంచో ఫోన్ చేసి మాట్లాడాలనుకుంటున్న ఫ్రెండ్స్‌కి ఫోన్ చేయడం కావచ్చు... ఇలాంటి చిన్న లక్ష్యాలు పూర్తి చేయడం పెద్ద ఆనందాన్ని అందిస్తాయి. ఆ ఆనందం మనల్ని ఆరోగ్యంగా మారుస్తుంది.
గోడతో ముచ్చట్లు: రోజువారీ పనుల్లో అన్ని భావాలనూ స్వేచ్చగా వ్యక్తీకరించలేం. చాలా వరకూ అదిమి పెట్టేస్తాం. వాటిని ఏదో ఒక సమయంలో బయటకు పంపేస్తే మనసు ఖాళీగా మారిపోయి ఆనందం నిండుతుంది. ఎందుకంటే ఆ భావాల్లో నెగిటివ్ భావాలేమైనా ఉంటే అవి మనల్ని ఒత్తిడికి గురి చేస్తాయి. కాబట్టి వాటినలా మనసులో ఉంచేసుకోవడం అస్సలు మంచిది కాదు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు ఆ భావాలన్నింటినీ బయటకు నెట్టేయండి. గోడకో, పైకప్పుకో, లేక అద్దంలోని ప్రతిబింబానికో మీ మనసులోని మాటలు చెప్పండి. స్వేచ్ఛగా మీ భావాలు పంచుకోండి.
నవ్వండి: జీవితంలో చాలా సమస్యలకు కారణం అనవసరమైన సీరియస్‌నెస్. కాబట్టి దాని జోలికి పోకండి. మిమ్మల్ని నవ్వించేది, నవ్వు తెప్పించేది ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యత ఇవ్వండి. దాన్ని వీలైనన్నిసార్లు ఆహ్వానించి ఆనందాన్ని పొందండి. సన్నిహితులతో ఆరోగ్యకరమైన నవ్వులు పంచుకోండి.
స్వచ్ఛందంగా: ఇతరులకు సహకరించడం అంటే మనకు మనం సహకరించుకోవడమే. అలా అని తప్పనిసరై చేసే సేవలో సంతోషం ఉండదు. కృత్రిమంగా ఉంటుంది. కానీ ఎంతో ఇష్టంగా స్వచ్ఛందంగా చేసే సేవ, సహకారం ఏదైనా సరే... మనకు అమితమైన ఆనందాన్ని ఇస్తుంది. మన సామాజిక దృష్టిని మారుస్తుంది. విశాలదృక్పథాన్ని అలవరుస్తుంది. మనపై సమాజానికి కూడా మంచి అభిప్రాయాన్ని కలిగిస్తుంది.
మీ కోసం మీరు: జీవితం అన్నాక ఎన్నో బాధ్యతలు. ‘మన’ అనుకున్న వాళ్లందరినీ సంతోషంగా ఉంచడం కోసం పరిపరి విధాల ప్రయత్నాలు చేస్తాం. పరుగులు పెడతాం. మరి మన సంగతేంటి? మనకోసం మనం ఏం చేసుకుంటున్నాం? అది చాలాసార్లు ఆలోచించం. జీవన ప్రవాహంలో పడి కొట్టుకుపోవడమే తప్ప... మనం సంతోషంగా ఉన్నామా అని ఆలోచించడం చాలాసార్లు మర్చిపోతుంటాం. జీవితాన్ని సాగిస్తే సరిపోదు... జీవితాన్ని జీవించాలి. అందుకుగాను మన కోసం మనం ఏదైనా చేసుకోవాలి. ఒకరోజు వంటతో సహా అన్నీ మీకు ఇష్టమైనవి చేసుకోండి. పార్క్‌కి వెళ్ళి ఒంటరిగా బెంచ్ మీద కూర్చోండి. పూలు, గడ్డి సువాసనలను ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఆస్వాదించండి. ఇంకెందులోనైనా సంతోషం ఉంటుందంటే అదీ చేయండి. ఏం చేసినా... సంతోషంగా ఉండండి.