
కప్ప
ఇన్ని మెట్లు
ఎట్లా ఎక్కి వచ్చిందో!
కుర్చీ కింద చేరి
ధ్యానం చేసుకుంటుంది.
సన్నటి రంధ్రాల్లో
గరుడ పచ్చలు పొదిగినట్టున్న కళ్లు
మెడ లేకున్నా
గొంతులో దాచుకున్న
బెకబెకల శబ్ద సర్వస్వం
పైకి చూస్తుందా తనలోకి చూసుకుంటుందా చెప్పడం కష్టం.
దాని కళ్లలో తడియారని నీటి తళకులు.
రసాత్మక వాక్యంలో కావ్యాన్ని బంధించినట్లు దాని కంటి పొరలపైన సముద్రాలను చదువుకోవచ్చు
అక్షరాలు నన్ను చుట్టుముట్టినప్పుడు కవిత్వంగా మారిపోతాన్నేను పెన్ను ముడిచేసరికి కుర్చీ కింద కప్ప లేదు ఇల్లంతా వెతికినా
కప్పకు సంబంధించిన ఖాళీలే తప్ప కాకరకాయ చర్మం లాంటి దాని వీపు కనపడలేదు
ఎక్కడ పుట్టిందో! అడవులు పిచ్చుకకు లోకువయినట్లు కప్ప ఏ మహా సాగరాలను లొంగదీసుకుందో ఎగిరి గంతేసేటప్పుడు
దాని సాగదీసిన చలన సౌందర్యం మనసు కాన్వాసుపై ముద్రించుకుపోయింది
ఏ విశాల వర్షాలు రాల్చిన మృదు చర్మాంబర ధారియో కదా కప్ప చిన్నప్పటి మా ఊరి మడుగంతా కప్పల మహోత్సవంతో సవ్వడి చేసేది
ఇప్పటికీ ఆ కుర్చీలో కూర్చున్నప్పుడల్లా కప్ప గుర్తుకొస్తుంది అప్పుడప్పుడు నా నిద్రలో ప్రవేశించి సుప్త చేతనను జాగృతం చేస్తుంది
- డా. ఎన్.గోపి -9391028496