‘నాక్కూడా ఇలా జరిగింది’ అని చెప్పుకోవడం ‘మీటూ’.‘మగజాతికి కూడా ఇలా జరుగుతోంది’ అని ప్రతిధ్వనిగా నినదించడం ‘మెన్‌టూ’. ‘నాక్కూడా’ అని ఒక్కరే ధైర్యం చేసి బయటికి రావడం, ‘మేము కూడా’ అని నలుగుర్ని పోగేసుకుని రావడం ఒకటే అవుతుందా?!
మాధవ్ శింగరాజు
బాలీవుడ్ పూర్వపు నటి పూజాబేడీ బర్త్‌డే ఇవాళ. అయితే పూజ గురించి అకస్మాత్తుగా మనమి ప్పుడు మాట్లాడుకోడానికి కారణం ఆమె బర్త్‌డే కాదు. పూజ త్వరలో ‘మెన్ టూ’ అనే ఉద్యమాన్ని లాంచ్ చెయ్యబోతున్నారు! ‘మీటూ’ వంటిదే ‘మెన్‌టూ’. మీటూలో బాధిత మహిళలు ఉంటారు. ‘మెన్‌టూ’ లో బాధిత పురుషులు ఉంటారు. రెండూ భిన్నమైన ఉద్యమాలు. ఈ ‘వార్ ఆఫ్ సెక్సెస్’ ఎప్పుడూ ఉన్నదే. అయితే పురుషుల తరఫున ఒక మహిళ.. మహిళలపై ఇలా యుద్ధ శంఖారావం పూరించడం మునుపెన్నడూ లేనిది! తన బెస్ట్ ఫ్రెండ్ కరణ్ ఒబెరాయ్‌పై అన్యాయంగా అత్యాచారం కేసు పెట్టి, జైలు పాలు చేశారని పూజ ఆవేదన. ఆ ఆవేదనలోంచి ఆవిర్భవించినదే ‘మెన్‌టూ’ అనే ఆలోచన. కరణ్ ఒబెరాయ్ టీవీ యాక్టర్. యాంకర్, సింగర్. ‘ఇండీపాప్ బాయ్ బ్యాండ్’, ‘ఎ బ్యాండ్ ఆఫ్ బాయ్స్’ బృందంలో సభ్యుడు. నలభై ఏళ్లుంటాయి.
ముంబైలోని అంథేరీ కోర్టు గురువారం నాడు అతడిని పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఫ్యాషన్ డిజైనర్–కమ్– హీలర్ అయిన ఒక యువతి.. కరణ్ తనపై అత్యాచారం చేశాడని, లక్షల్లో డబ్బును దోచుకున్నాడని ఫిర్యాదు చేయడంతో మే 6న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కరణ్‌కి అండగా పూజాబేడీ నిలబడ్డారు. అతడు అలాంటి వాడు కాదని, ఆ అమ్మాయే అతడి వెంట పడిందని ఆమె వాదన. అందుకు సాక్ష్యంగా పూజ.. వాళ్లిద్దరి మధ్య (కరణ్, యువతి) సాగిన మెసేజ్ సంభాషణల్లో ఒకదానిని సాక్ష్యంగా చూపిస్తున్నారు. అదే సాక్ష్యాన్ని చూపించి కరణ్‌కు బెయిల్ తెప్పించడం కోసం అతడి న్యాయవాది దినేష్ తివారి ప్రయత్నిస్తున్నారు.ఒక డేటింగ్ యాప్ ద్వారా 2016 చివర్లో కరణ్, ఆ యువతి ఒకరికొకరు పరిచయం అయ్యారు. గత ఏడాది డిసెంబరులో ఆ యువతి మీద కరణ్ లైంగిక వేధింపుల కేసు పెట్టాడు.
ఈ నెల మొదటి వారంలో ఆమె అతడి మీద కేసు పెట్టింది. మత్తుమందు కలిపి తనపై అత్యాచారం చేశాడని, దానిని కెమెరాలో చిత్రీకరించాడని ఆమె ఫిర్యాదు. ఆ ఫిర్యాదులో 2017లో అత్యాచారం జరిగినట్లుగా ఉంది. మరి ఈ మధ్యకాలంలో ఏం జరిగింది, అప్పుడే ఆమె ఎందుకు బయటపడలేదు అని పూజ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రశ్నించారు. 2017 జనవరి 13న కరణ్‌కి ఆ యువతి పంపిన మెసేజ్‌ని, దానికి కరణ్ ఇచ్చిన సమాధానాన్ని పైకి చదివి వినిపించారు. ‘ఏ బంధాన్నీ, అనుబంధాన్ని ఏర్పడనివ్వకుండా మన రెండు దేహాలను.. కొంత సమయం స్వేచ్ఛగా మాట్లాడుకోనిద్దామా? అందుకు నా దేహం సిద్ధంగా ఉంది. ఏమంటావ్?’ అని యువతి పంపినట్లుగా పూజ చూపించిన మెసేజ్‌లో ఉంది. అందుకు కరణ్ ఇచ్చిన సమాధానం.. తనకు కెరీర్ పట్ల తప్ప ఇక దేనిపైనా ఆసక్తి లేదని. ఆ తర్వాతనైనా ఒకవేళ ఆ ఇద్దరిదేహాలు మాట్లాడుకున్నా.. అది ఆమె తరఫు నుంచి వచ్చిన ప్రేరేపణ అవుతుంది తప్ప, రేప్ ఎలా అవుతుందని పూజ పాయింట్ అవుట్ చేస్తున్నారు.
ఈ సందర్భంలోనే ‘మెన్‌టూ’ అనే కొత్త ఉద్యమ కాన్సెప్ట్‌ని పైకి తెచ్చారు. పూజ కూడా ఒకప్పుడు స్త్రీల హక్కుల కోసం పోరాడినవారే. స్త్రీ స్వేచ్ఛను, స్త్రీ విముక్తిని ఆకాంక్షిస్తూ పూజ మంచి మంచి ఆర్టికల్స్ రాశారు. మరి ఇప్పుడేమిటి ఇలా?! పైగా.. ‘మనమిలా వీకర్ సెక్షన్ అంటూ స్త్రీలను సమర్థించుకుంటూ పోతే సమసమాజం ఏనాటికీ సిద్ధించదు. అందుకనే ‘మెన్‌టూ’ ఉద్యమం ప్రారంభించి అమాయకులైన పురుషుల వైపు నిలబడతాను’ అని ప్రతిన పూనారు! మెన్‌టూ అనే ఆలోచనకు పూజాబేడీని పురికొల్పిన కారణాలు ఏవైనా కానివ్వండి. పూజ అనే ఏముంది.. మగవాళ్లలోనే చాలామందికి ఈ ఆలోచన ఇప్పటికే వచ్చి ఉంటుంది. అయితే ‘మీటూ’లా.. ‘మెన్‌టూ’ నిలబడుతుందా? మీటూ సబ్జెక్టివ్. ‘నాక్కూడా ఇలా జరిగింది’ అని చెప్పుకోవడం. ‘మెన్‌టూ’ ఆబ్జెక్టివ్. ‘మగజాతికి కూడా ఇలా జరుగుతోంది’ అని ప్రతిధ్వనిగా నినదిం చడం. ‘నాక్కూడా’ అని ఒక్కరే బయటికి రావడం, ‘మేము కూడా’ అని నలుగుర్ని పోగేసుకుని రావడం ఒకటే అవుతుందా? కరణ్ గుడ్ బాయ్ అనుకున్నా.. అతడు చేసిన బ్యాడ్ థింగ్స్ కొన్ని కనిపిస్తున్నాయి.
కెరీర్ తప్ప ఏమీ ఇంట్రెస్ట్ లేనివాడు ఆ అమ్మాయిని అన్నాళ్లు ఎందుకు ‘భరించినట్లు’? కెరీర్ తప్ప అసలేమీ ఇంట్రెస్ట్ లేనివాడు మొదట్లోనే ఆ అమ్మాయి స్నేహాన్ని ఎందుకు తుంచేయనట్లు? కెరీరే సర్వస్వం అనుకున్నవాడు ఎప్పటివో మెసేజ్‌లను తనకు తను ఇచ్చుకున్న సర్టిఫికెట్‌లలా ఎందుకు భద్రంగా ఉంచుకున్నట్లు?‘పాపం.. కొంతమంది మగాళ్లు’ అని పూజాబేడీ అంటున్నవాళ్లలో కరణ్ కూడా ఒకడని అనుకున్నా.. ఆ కొంతమంది కోసం కాదు కదా ఉద్యమాలు నడవాల్సింది, అసలు ఉద్యమాన్ని ఒకరెక్కడి నుంచో వచ్చి నడిపించడం ఏంటి? ఉద్యమమే నడిపిస్తుంది బాధితుల్నంతా ఒక చోటకు రప్పించి! అలాంటి ఉద్యమమే ‘మీటూ’. కరణ్ నిజంగా ఇన్నోసెంట్ అయుండీ, ఆ అమ్మాయి నాట్ ఇన్నోసెంట్ అయి ఉన్నా కూడా.. ‘మెన్‌టూ’ అని పిడికిలి బిగించే హక్కు మగాళ్లకేం వచ్చేయదు.. బాధింపును ఒక హక్కుగా వినియోగించుకుంటున్నవాళ్లే ఎక్కువమంది ఉన్నప్పుడు.
Comments
Please login to add a commentAdd a comment