
కరెంట్ లేకపోతే చీకట్లో ఎలా చదువుకోవాలి?! టేస్టీగా లేకపోతే ఎలా తినాలి?! అంటూ.. రకరకాల సాకులు వెతికేవారే ఎక్కువ. కానీ, సరైన పరికరాలు లేకపోతే ఆటకు ఎలా పదును పెట్టాలి అని ప్రశ్నించలేదు పూజా వస్త్రకర్. జిమ్ లేదు కదా వర్కవుట్స్ కట్ అనుకోలేదు. గ్రౌండ్ లేదు కదా ప్రాక్టీస్ ఫట్ అనలేదు. ఇది లాక్‌డౌన్ కాలం. ఇల్లు దాటి బయటకు రాలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో ప్రాక్టీసింగ్‌కి క్రీడాకారులు కొత్త కొత్త పద్ధతులను కనుగొంటున్నారు. వారిలో ఉమెన్ క్రికెటర్ పూజా వస్త్రకర్ ఒకరు.
ఫాస్ట్ బౌలర్ ఫీట్
ఇరవైఏళ్ల పూజ వస్త్రకర్ మధ్యప్రదేశ్‌లోని షహడోల్ జిల్లా వాసి. ఉమెన్ క్రికెట్ ట్రీమ్‌లో ఫాస్ట్‌బౌలర్‌గా పేరు. 2021 వన్డే ప్రపంచ కప్‌లో పాల్గొనబోయే భారత మహిళా క్రికెట్ జట్టుకు అర్హత సాధించింది. కప్పు గెలవడం కోసం రోజూ శిక్షణతో ఆటకు మెరుగుపెట్టుకోవాలి. ఇలాంటి స్థితిలో లాక్డౌన్ అవాంతరం వచ్చింది. గడపదాటని స్థితిలో శిక్షణ ఎలా సాధ్యం అని ఊరుకోలేదు పూజ. ‘ఏం చేయాలా అని ఆలోచించా. ఇంటి పైకప్పును క్రికెట్ పిచ్‌గా మార్చేశా. వర్కవుట్స్, వెయిట్ లిఫ్టింగ్ ఎలానా అనుకున్నప్పుడు మా ఇంట్లో ఖాళీ సిలిండర్ కనిపించింది. ఇలా ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతో జిమ్‌లో చేయదగిన వ్యాయామాలన్నీ చేసేస్తున్నా’ అంటోంది ఉత్సాహంగా పూజ.
ఆన్‌లైన్‌లో ఆటకు మెరుగు
రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ స్టీఫెన్ జాన్సన్ నుండి పూజ ఆన్‌లైన్ కోచింగ్ తీసుకుంటోంది. ఉదయం ఫిట్‌నెస్ శిక్షణ, సాయంత్రం బౌలింగ్ నైపుణ్యాలు నేర్చుకుంటోంది. ‘వాట్సాప్‌లో స్టీఫెన్ నాకు వ్యాయామం, శిక్షణకు సంబంధించి షెడ్యూల్ పంపారు. వీడియో కాలింగ్ ద్వారా మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు. నేను నా శిక్షణకు సంబంధించిన వీడియోలను తీసి స్టీఫెన్‌కు పంపుతాను. వాటిని చూసి అతను కరెక్ట్ చేస్తుంటాడు’ అని చెబుతోంది పూజ. ‘ఫిట్‌గా ఉండాలంటే శిక్షణ తప్పనిసరి. రోజూ సాధన చేయాల్సిందే. ఫిట్‌నెస్‌ను మెరుగుపరచడానికి లాక్డౌన్‌ని ఇలా వినియోగించుకుంటున్నాను‘ అంటూ వివరించింది. ‘‘మిగతా టైమ్‌లో ఇంట్లోవారితో కలిసి లూడో, క్యారమ్స్ ఆడుతున్నా. రామాయణం, మహాభారతం సీరియళ్లు చూస్తున్నా‘ అంటోంది పూజ.
– ఆరెన్నార్
Comments
Please login to add a commentAdd a comment