రెక్కాడితేగాని డొక్కాడని ఒక కూలివాడు ఉండేవాడు. రాళ్లు కొట్టి రోళ్లను తయారు చేసే ఒక ఆసామి దగ్గర ఇతను రోజుకూలి చేస్తుండేవాడు. ఈ పని చేసి చేసి అతడికి విసుగెత్తింది. నా జీవితంలో మార్పు కావాలి అనుకున్నాడు. ఇందుకు తన శక్తి చాలదని ఏ శక్తో తోడు కావాలని తలచాడు. ఏదో ఒక శక్తిని ప్రసన్నం చేసుకుంటే తన జీవితం బాగు పడుతుందని భావించాడు. ఆ ఆలోచన వచ్చిందే తడువు అతను పర్వత శిఖరం మీదకు చేరుకున్నాడు. అక్కడ కొలువై ఉన్న దేవతను తన కోర్కెను తీర్చవలసిందిగా ప్రాధేయపడుతూ పదే పదే చేతులు జోడించసాగాడు. అయితే ఆమె ఎంతకూ బదులివ్వకపోవడంతో మరికాస్తా పెద్ద దేవతను ఆరాధిస్తే బాగుంటుందనుకున్నాడు. ఈ దేవత కన్నా పెద్ద దేవత ఎవరా అని ఆలోచిస్తూ ఆకాశం వైపు చూస్తే సూర్యుడు కనిపించాడు. ప్రత్యక్షదైవం సూర్యుడే కాబట్టి సూర్యుణ్ణి ఆరాధిస్తే బాగుంటుందనుకున్నాడు. అంతే! సూర్యారాధన మొదలు పెట్టాడు. పొద్దుగూకులూ అదే ధ్యాస అతనికి. కొండమీది ఫలవృక్షాల నుంచి కొన్ని పండ్లు కోసుకు తిని ఆకలి తీర్చుకోవడం, అక్కడే ఉన్న నీటికుంటలో స్నానం చేయడం, సూర్యుణ్ణి ధ్యానం చేయడం, నిద్ర వస్తే ఏ చెట్టు కిందనో, కొండగుహలోనో పడుకోవడం.... ఇవే అతని నిత్యకృత్యాలు. సూర్యుడు ఏనాటికైనా కరుణిస్తే తన జీవితం మారిపోతుందని ఎదురు చూసేవాడు.
ఇలా ఉండగా ఒకరోజు సూర్యుణ్ణి మేఘాలు కప్పివేయడంతో సూర్యుడు కనిపించకుండా పోయాడు. దాంతో సూర్యుడి కంటే మేఘాలే గొప్పవనుకుని సూర్యారాధన మాని వేసి, మేఘాలను ప్రార్థించసాగాడు. కొద్దికాలంలోనే మేఘాలు పర్వతాలను ఢీకొని అక్కడే అంతమౌతున్నాయి కాబట్టి పర్వతాలే గొప్పవని తోచింది. అందువల్ల పర్వతాలను ప్రార్థించసాగాడు. ఈ క్రమంలో రోజూ తన పలుగు దెబ్బకే పర్వతాలు పగిలిపోతున్నాయి కాబట్టి తానే వాటి కంటే బలం గలవాడినన్న సంగతి స్ఫురణకొచ్చింది. వెంటనే అతని ఆలోచనా విధానం మారింది. అందరికన్నా తానే శక్తిమంతుడినని తోచి తన స్వశక్తినే నమ్ముకోవడం మొదలు పెట్టాడు. చూస్తుండగానే అతను ఎన్నో అద్భుతాలు చేయగలిగాడు. అందరికన్నా గొప్పవాడు కాగలిగాడు. మనిషి శక్తి అతనిలోనే ఉంటుంది. దానిని అతను తనంతట తానైనా గుర్తించగలగాలి లేదంటే ఇతరులెవరైనా గుర్తించి దానిని వెలికి తీయాలి. అప్పుడు అతను తనకు తానే సాటి అవుతాడు.
- డి.వి.ఆర్.
Comments
Please login to add a commentAdd a comment