
అత్యంత తియ్యటి పండ్లలో సపోటా ఒకటి. చాలా భారతీయ ప్రాంతాల్లో దీన్ని చికూ అని అంటుంటారు. దీనిలో ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు, మినరల్స్ కూడా కలిగి ఉండి తన తియ్యదనంతో ఎంతటి రుచిని ఇస్తుందో... తన పోషకాలతోనూ అంతే మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. సపోటాతో సమకూరే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలివి. గర్భిణులకు, బాలింతలకు, పాలిచ్చే తల్లులకు సపోటా ఎంతో మేలు చేస్తుంది. ఇక నెలతప్పిన వారిలో ఉండే వేవిళ్లు, వికారం, వాంతులను సపోటా సమర్థంగా అరికడుతుంది. సపోటాలో విటమిన్–ఏ పుష్కలంగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సపోటా.. జీర్ణవ్యవస్థలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, ఈసోఫేజైటిస్, ఎంటిరైటిస్, ఇరిటబుల్ బవెల్ సిడ్రోమ్ వంటి వ్యాధులను అరికడుతుంది.
ఇందులో పీచు పుష్కలంగా ఉండటం వల్ల విరేచనం తేలిగ్గా అయ్యేలా చూస్తుంది. మలబద్దకం లేకుండా చేస్తుంది. సపోటాలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఫ్రీ–రాడికిల్స్‌ను హరించి, వయసు పెరుగుదల వేగాన్ని మందగింపజేసి, చాలాకాలంపాటు యౌవనంగా ఉండేలా చేస్తాయి. మేని మీద ముడతలు రాకుండా కూడా చేస్తాయి ఈ యాంటీఆక్సిడెంట్స్. పాలసపోటా చర్మంలో పెరిగే చాలా రకాల ఫంగల్ పెరుగుదలను అరికడుతుంది. సపోటాలో క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఐరన్ పాళ్లు చాలా ఎక్కువ. దాంతో అది ఎముకలు పటిష్టంగా ఉంచడంలోనూ, వాటి ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక భూమిక వహిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment