భవన విజయం
ఓ ఇంట్లో పూలు పూసే మొక్కలు, కాయలు కాసే చెట్లను చూసుంటాం. ఇంకో ఇంట్లో పిట్టలో, పెంపుడు జంతువులనో చూసుంటాం. మరో చోట ఆకుకూరలతో ‘ఇంటి’ పంట చూసుంటాం. ఇవన్నీ, మరికాసిన్ని ఒకేచోట చూడాలంటే... ఏ అడవికో పోనవసరం లేదు. యూసఫ్‌గూడ క ల్యాణ్నగర్లో ఉన్న ‘వనకుటీరం’ వెళ్తే చాలు! ఈ ఏడాది రాష్ట్రంలో నిర్వహించిన గార్డెన్స్ ఫెస్టివల్లో ఫస్ట్‌ప్లేస్‌లో నిలిచిన టై గార్డెన్ అది. కొన్నేళ్లుగా ప్రకృతి ప్రేమికులకు, పాఠశాల విద్యార్థులకు దర్శనీయ స్థలం కూడా.
..:: ఎస్.సత్యబాబు
ఈ వన కుటీరం సృష్టికర్త రామరాజు. భీమవరం సమీపంలోని కాళ్లకూరు గ్రామానికి చెందిన రామరాజు బాల్యం పచ్చని పంటలు, ప్రకృతి నీడలో సాగింది. కాలక్రమంలో కాంక్రీట్ జంగిల్‌కు వల సొచ్చినా.. పూలు, ముచ్చటైన మొక్కలు, వన్యప్రాణులతో తిరిగి దోస్తీ చేయాలనుకున్నారు. ఆ అభిరుచికి తన భవనాన్నే వేదిక చేసుకున్నారు. కల్యాణ్‌నగర్ మూడో ఫేజ్‌లో, తోడల్లుడితో కలసి తాను కట్టుకున్న ఇంటిలోని కొంచెం స్థలంలో వనకుటీరం ఏర్పాటు చేశారు. వ్యయప్రయాసలకోర్చి దానిని దినదిన ప్రవర్ధమానం అయ్యేలా చేస్తున్నారు.
కూల్ అండ్ గ్రీన్...
మామిడి, సపోటా, గంధం, మారేడు.. భిన్న రకాల చెట్లు ఆయన భవనానికి నాలుగు పక్కలా ఉంటాయి. ‘మాకు ఎండ తీవ్రత తెలీదు. మండే ఎండల్లో కూడా ఇంట్లో టెంపరేచర్ 32 డిగ్రీలు దాటదు’ అని చెప్పే రామరాజు రూమ్ టెంపరేచర్ కొలిచే సాధనం కూడా తనింట్లో ఏర్పాటు చేసుకున్నారు. మూడంతస్తుల భవనం టై మీద రామరాజు పరచిన పచ్చదనం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. టై మీద ఒకటో రెండో కుండీలు పెట్టుకుని ఆనందించే రొటీన్ గార్డెనింగ్‌కు భిన్నంగా ఆయన తన మేడ మీద ఖాళీస్థలంలో అంగుళం వదలకుండా గ్రీనరీనిపరిచారు.
ఎన్నెన్నో జాతులు..
రాత్రిపూట ఉదయించి, పొద్దునే అస్తమించే బ్రహ్మకమలం, ఎండాకాలంలో సూర్యోదయంతో పాటు విచ్చుకుని మధ్యాహ్నానికి మాయమయే కాక్టస్.. ఇలాంటి విశేషాలున్న మొక్కలు రామరాజు టైని అపురూపమైన గార్డెన్‌గా మార్చాయి. బోన్సాయి మర్రి, బోధి చెట్టు, రోడ్ డివైడర్స్‌కు మధ్యలో వేసే సైకస్లతో పాటు తీపి చింత, సీడ్లెస్ జామ, వెల్వెట్ బత్తాయి, ఆకుకూరలు, మట్టిలో ఊరే పెండ్లం, ఆల్స్పైస్ (మసాలా ఆకు), రెడ్ జింజిర్, ఆర్నమెంటల్ పైనాపిల్, విక్స్ ఆకు మొక్క, లవంగ, వాటర్ యాపిల్, పూలమొక్కలు... ఇలా 120 రకాల మొక్కలు పెంచుతున్నారు. దీనికి 1,600 చదరపు అడుగుల స్థలంపోగా మిగిలిన 200 చదరపు అడుగుల స్థలంలో చిన్న గది కట్టుకున్నారాయన.
ప్లాన్డ్గా ప్లాంట్స్...
భవనం పైభాగంలో మొక్కలు పెంచితే పడే బరువు ఏమేరకు ఉండవచ్చునో ఇంజనీరింగ్ నిపుణుల చేత ముందుగానే తనిఖీ చేయించారు రామరాజు. నీటికి కటకటలాడే నగరంలో, అదీ ఐదు కుటుంబాలు నివసించే చోట నీళ్ల సమస్య తప్పదు. తన గార్డెన్‌కు ఆ సమస్య రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. కృత్రిమ రసాయనాలు కాకుండా వెల్లుల్లిరసం, వేపనూనె లను స్వయంగా తయారు చేసి చీడపీడలకు విరుగుడుగా వాడుతున్నారు.
గువ్వల కువకువ... తాబేళ్ల తమాషా...
మొక్కలు పచ్చదనాన్ని అటుంచితే... ఈ టై గార్డెన్లో పిచ్చుకలు, పావురాల గూళ్లకు కొదవేలేదు. ‘ప్రకృతి అంటే కేవలం పచ్చదనం మాత్రమే కాదు. మరెన్నో జీవులు కూడా’అంటారు రామరాజు. ప్రత్యేకంగా ఒక సిమెంట్ తొట్టెనే పాండ్‌గా రూపొందించి అందులో చేపలు, తాబేళ్లను పెంచుతున్నారు. మేడ మీద లవ్‌బర్డ్స్‌తో పాటు పాల పిట్టలు, పావురాలు వగైరా 50 దాకా నివసించేలా ఒక గూడు సైతం ఏర్పాటు చేశారు.
అతిథి దేవోభవ..
ప్రతి రోజూ ఈ ఇంటిని పెద్ద సంఖ్యలో పిచ్చుకలు పలకరిస్తుంటాయి. ఆ భ‘వనా’న విరిసే పూలమీద మకరందాన్ని తాగేందుకు తేనెటీగలు వస్తాయి. రెడ్ చెర్రీ మొదట పచ్చగా ఉంటుంది. ఆ తర్వాత ఎరుపు రంగులోకి మారుతుంది. సరిగ్గా అది ఎరుపు రంగులోకి మారేటప్పటికి దాన్ని తినడానికి ఎవరో చెప్పినట్టు కోయిల వస్తుంది. రామరాజు చెర్రీపండుని కోసుకోరు. కోయిల రావడాన్ని, చెర్రీని తినడాన్ని సంతోషంగా చూస్తారు. ఉడతలు సైతం ఆయన వనానికి అతిథులే. అంతేకాదు... నెలకోసారైనా ఏదో ఒక స్కూల్ పిల్లలు ఆయన ఇంటికి చుట్టాలవుతారు. ఇక వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ అధికారులు, సిబ్బంది తరచుగా ఆయన తోటకు హాయ్ చెబుతూనే ఉంటారు. అందర్నీ ఆప్యాయంగా ఆహ్వానించి మర్యాదలు చేసే రామరాజు... తమ కాలనీలోని పిల్లలకు మొక్కల ప్రాధాన్యత గురించి వివరిస్తుంటారు. వారికి మొక్కల్ని బహుమతులుగా అందిస్తుంటారు. ప్రకృతి ఇచ్చిన వాటిని ఆహారంగా మార్చుకోవడం మాత్రమే కాదు ఆహ్లాదంగా ఆస్వాదించడం కూడా తెలిసిన వారాయన. అందుకే సాయంత్రాల్లో తన వనంలో టీ తాగుతూ సేదతీరుతారు రామరాజు.