
బొబ్బర్లలో ఫోలిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉన్నందున గర్భవతులు లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వారు వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. దాంతో పుట్టబోయే బిడ్డలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా నివారించవచ్చు. ఇది మాత్రమే కాదు... వీటితో ఆరోగ్య ప్రయోజనాలెక్కువే. అందుకే బొబ్బర్లను తరచూ తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బొబ్బర్లతో ఒనగూరే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలివి...
విటమిన్ బి కాంప్లెక్, విటమిన్–సి కూడా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని సమకూర్చి అనేక వ్యాధులను నివారిస్తాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటానికీ, మలబద్దకాన్ని నివారించడానికి దోహదపడతాయి. అంతేకాదు పెద్దపేగు క్యాన్సర్‌ను నివారిస్తాయి. బొబ్బర్లలో పిండిపదార్థాలు చాలా ఎక్కువ. అయినప్పటికీ తిన్న తర్వాత జీర్ణమై ఒంటికి పట్టేటప్పుడు ఆ చక్కెరలు మెల్లగా రక్తంలోకి వెలువడతాయి.అందుకే డయాబెటిస్ రోగులకు మంచివి.
పొటాషియమ్ పాళ్లు ఎక్కువగానే ఉండటం వల్ల రక్తపోటును నియంత్రిస్తాయి. ప్రోటీన్లు కూడా ఎక్కువే. కండరాల రిపేర్లకు ఇవి తోడ్పడతాయి. గాయాలు త్వరగా తగ్గడానికి ఉపకరిస్తాయి. విటమిన్–ఏ ఎక్కువగా ఉండటం వల్ల కంటిచూపును కాపాడతాయి. అనేక నేత్రసంబంధ రుగ్మ తలను నివారిస్తాయి. జింక్, మెగ్నీషియమ్, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలం. అందువల్ల మెరిసే ఒల్తైన జుట్టుకూ, దాని పెరుగుదలకు దోహదపడతాయి. అనేక చర్మసమస్యలనూ అరికడతాయి. క్యాల్షియమ్, ఫాస్ఫరస్ పాళ్లు కూడా ఎక్కువే. అందువల్ల ఎముకలు బలంగా, పటిష్టంగా ఉంచడానికి బొబ్బర్లు ఉపయోగపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment