అమ్మాహారం | Pregnant women themselves | Sakshi
Sakshi News home page

అమ్మాహారం

Published Wed, Nov 4 2015 10:26 PM | Last Updated on Sun, Sep 3 2017 12:00 PM

అమ్మాహారం

అమ్మాహారం

అమ్మ ప్రాణం పంచుకుంటుంది. పాలు పంచుతుంది.
బిడ్డ శక్తి పెరగాలని తన రక్తమాంసాలను సైతం పంచుతుంది.
అలాంటి అమ్మ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?
మన సమాజంలో బాలింతలకు పథ్యాలు చెబుతుంటారే!...
మరి తను ఏమి తినాలి? తాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఎవరు చెప్పాలి. భర్త చెప్పాలి. అత్తమామలు చెప్పాలి. తోబుట్టువులు చెప్పాలి.
తల్లిదండ్రులు చెప్పాలి. బంధువులు,  స్నేహితులు చెప్పాలి.
అమ్మను అపురూపంగా చూసుకోవాలి. పండంటి బిడ్డ కావాలని కోరుకునే
ప్రతి కుటుంబం అమ్మ ఆహారం గురించి ఆలోచించాలి. తల్లీబిడ్డా సౌఖ్యంగా, ఆరోగ్యంగా,
సంతోషంగా ఉండటానికి కొన్ని సూచనల సమాహారం ఈ  అమ్మాహారం.


మహిళలు తాము గర్భం ధంరిచడానికి మూడు నెలల ముందునుంచే ఫోలిక్ యాసిడ్ అనే పోషకాన్ని తీసుకోవాలి. ఇది పిల్లల్లో వచ్చే న్యూరల్ ట్యూబ్ సమస్యలతో పాటు మరెన్నో వైకల్యాలను నివారిస్తుంది. దీనితో పాటు ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలనూ తీసుకోవాలి. ఈ ఫోలిక్ యాసిడ్, ఐరన్ కోసం పాలకూర వంటి ఆకుకూరలతో పాటు ముల్లంగి ఆకులు, కాలీఫ్లవర్ ఆకులను కూరలుగా చేసి తీసుకోవచ్చు.
 
ఆరోగ్యమైనా, అనారోగ్యమైనా తల్లి నుంచే బిడ్డకు సంక్రమిస్తుంది. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే, తల్లి ఆరోగ్యంగా ఉండక తప్పదు. బిడ్డ ఆరోగ్యం కోసం తల్లి గర్భం దాల్చినప్పటి నుంచే జాగ్రత్తలు పాటించాలి. తగిన పోషక విలువలతో కూడిన ఆహారం అదనంగా తీసుకోవాలి. ప్రసవం తర్వాత బిడ్డకు తల్లి రొమ్ముపాలు పట్టాలి. బిడ్డ ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపాలే ఆధారం. అందువల్ల పాలిచ్చే దశలోనూ తల్లి తగిన పోషకాహారం తీసుకోవాలి. అప్పుడే బిడ్డకు తల్లిపాల ద్వారా తగిన పోషకాలు అందుతాయి. తల్లిపాల పోషణలో బిడ్డ ఎదుగుదల ఆరోగ్యకరంగా ఉంటుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. తరచు వ్యాధులకు గురయ్యే పరిస్థితి తప్పుతుంది. బిడ్డల ఆరోగ్యం కోసం ఏయే దశల్లో ఎయే జాగ్రత్తలు తీసుకోవాలో వివరించేందుకే ఈ కథనం...
 
గర్భనిర్ధారణ జరిగినప్పటి నుంచే...
గర్భందాల్చినట్లు పరీక్షల్లో నిర్ధారించినప్పటి నుంచే తల్లులు తగిన పోషకాహారం తీసుకోవడం ప్రారంభించాలి. మొదటి మూడు నెలల కాలంలో గర్భస్థ పిండం ఎదుగుదల ప్రాథమిక దశలో ఉంటుంది. ఈ దశలో కడుపులోని బిడ్డ అవయవాలు నెమ్మదిగా ఏర్పడుతుంటాయి. వాటి ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే, మొదటి మూడు నెలల కాలంలో తల్లి ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభించే పాలు, గుడ్లు, పప్పుధాన్యాలు, చికెన్, మటన్, చేపలు వంటివి తీసుకోవాలి.
 
రోగనిరోధక శక్తి పెంచడానికి..

మూడు నెలలు నిండిన తర్వాత ఆరునెలల వరకు కడుపులోని బిడ్డ మెదడు, కళ్లు వంటి అవయవాలు ఎదుగుతుంటాయి. ఎముకలు ఏర్పడుతుంటాయి. ఈ దశలో తల్లులు బిడ్డ రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని అదనంగా తీసుకోవాలి. విటమిన్లు, క్యాల్షియం వంటి మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు పుష్కలంగా తీసుకోవాలి.
 
చక్కని ఎదుగుదల కోసం...
ఆరునెలలు నిండాక బిడ్డ ఆకారం దాదాపు పూర్తిగా ఏర్పడుతుంది. ఈ దశలో తల్లులు కడుపులోని బిడ్డ ఎదుగుదల చక్కగా ఉండేందుకు తగిన ఆహారం తీసుకోవాలి. బిడ్డ ఎదిగే క్రమంలో తల్లి ఒకేసారి ఎక్కువగా తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కువ పరిమాణంలో ఆహారం తినలేని ఈ దశలో తల్లులు పుష్కలంగా పోషకాలు గల నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. ప్రొటీన్లు, ఆరోగ్యవంతమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌తో కూడిన పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు, చేపలు, చికెన్, మటన్ వంటివి తీసుకోవాలి.
 
 
సాక్షాత్తు అమృతమే

తల్లిపాలు బిడ్డకు సాక్షాత్తు అమృతంతో సమానం. శిశువులు కూడా అరిగించుకోగల ఆరోగ్యకరమైన కొవ్వులు తల్లిపాలలోనే దొరుకుతాయి. తల్లిపాలలో ముఖ్యంగా డొకాసో హైగ్జానోయిక్ యాసిడ్ (డీహెచ్‌ఏ) అనే కొవ్వులు ఉంటాయి. ఇవి బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు చాలా ముఖ్యమైనవి. పిల్లల మెదడులో ఉండేవన్నీ కొవ్వుకణాలే. వాటిలో 97 శాతం ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌కు చెందిన డీహెచ్‌ఏ కొవ్వులే ఉంటాయి. పిల్లల రెటీనాలోని కొవ్వు కణాల్లో 93 శాతం ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌కు చెందిన డీహెచ్‌ఏ కొవ్వులే ఉంటాయి. ఇవి బిడ్డకు నేరుగా తల్లిద్వారానే అందుతాయి. గర్భస్థ దశలోనే కాదు, పుట్టిన రెండేళ్ల వరకు ఇవే కొవ్వులు బిడ్డకు అందుతుండాలి. అప్పుడే బిడ్డ కంటిచూపు, మెదడు ఎదుగుదల బాగుంటాయి. తెలివితేటలకు కారణమయ్యే ‘గ్రే మ్యాటర్’ తయారీకి, చిన్నారి గుండెకు కూడా ఈ కొవ్వులే అండగా ఉంటాయి. ప్రకృతి తప్ప తల్లిపాల ఫార్ములాను ఇంతవరకు ఎవరూ కృత్రిమంగా తయారు చేయలేదు. ఫార్ములా పాలు అని చెబుతూ, మార్కెట్‌లో అమ్ముతున్న నానా కంపెనీల పాలపొడులేవీ తల్లిపాలకు సాటిరావు.
 
ఆరునెలలూ తల్లిపాలే కీలకం
ప్రసవం తర్వాత శిశువుకు ఆరునెలలు నిండేంత వరకు తల్లిపాలే కీలకం. ఆరునెలల వరకు తప్పనిసరిగా తల్లిపాలు తాగించాలి. బిడ్డకు ఏడాది, ఏడాదిన్నర వయసు వచ్చేంత వరకు కూడా తల్లిపాలు తాగించవచ్చు. అయితే, తొలి ఆరునెలలు తల్లిపాల నుంచే బిడ్డకు తగిన పోషకాలను అందించాల్సిన పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఆ కాలంలో కూడా తల్లులు అదనంగా పోషకాహారం తీసుకోవాలి. ప్రొటీన్లు, ఆరోగ్యవంతమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌తో కూడిన పాలు, గుడ్లు, చేపలు, చికెన్, మటన్, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, బాదం, అవిసెగింజలు వంటి నట్స్ వంటివి తీసుకోవాలి.  ఆరునెలలు నిండిన తర్వాత బిడ్డకు తల్లిపాలతో పాటు ఇతర ఆహారం అందిచడం మొదలుపెట్టాక తల్లులు సాధారణ రీతిలో సమతుల ఆహారం తీసుకుంటే సరిపోతుంది.
 
ఇవి తినకూడదు

ఆరోగ్యానికి చేటు తెచ్చిపెట్టే ప్రాసెస్డ్ ఫుడ్, కృత్రిమ రంగులు, ఎక్కువకాలం నిల్వ ఉంచడానికి రసాయనాలు ఉపయోగించే ఆహార పదార్థాలు, మితిమీరి చక్కెర వాడే పదార్థాలకు, అతిగా కొవ్వులు వాడే పదార్థాలు వంటి వాటికి గర్భిణులు, బాలింతలు దూరంగా ఉండాలి. ఇలాంటి పదార్థాల వల్ల తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యానికీ చేటు కలుగుతుంది. గర్భిణి దశలో గానీ, బాలింత దశలో గానీ తల్లులు కొవ్వులు మితిమీరి తింటే వారి బిడ్డలు భవిష్యత్తులో స్థూలకాయులుగా మారే ప్రమాదం ఉంటుంది. కృత్రిమ రంగులు, రసాయనాలు ఉపయోగించిన పదార్థాలను తీసుకుంటే బిడ్డల శారీరక, మానసిక ఎదుగుదలలో లోపాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఇలాంటి పదార్థాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి.

డీహెచ్‌ఏను తగ్గించే సిగరెట్ పొగ
తల్లిలో తయారయ్యే డీహెచ్‌ఏ కొవ్వులకు సిగరెట్ పొగ చాలా చేటు చేస్తుంది. అందువల్ల గర్భిణులు ఎట్టి పరిస్థితుల్లోనూ సిగరెట్ పొగ సోకకుండా చూసుకోవాలి. భర్తలకు సిగరెట్ అలవాటు ఉంటే, ప్యాసివ్ స్మోకింగ్ ద్వారా అది తల్లికి, కడుపులోని బిడ్డకు హాని చేస్తుంది. అందుకే తండ్రులకు సిగరెట్ అలవాటు ఉంటే, తమ భార్యాబిడ్డల క్షేమం కోసం ఆ అలవాటును తక్షణం మానేయాలి.
  - ఇన్‌పుట్స్: సుజాతా స్టీఫెన్, న్యూట్రీషియనిస్ట్,
 మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్, మాదాపూర్, హైదరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement