దోమకు చెలగాటం... మనిషికి డెంగ్యూ సంకటం!
అప్పుడెప్పుడో అష్టదిగ్గజాలు కొలువుదీరి సరదాగా పద్యపూరణం కోసం ‘‘దోమ గొంతుకలో ఏనుగు చిక్కుకుంది’’ అనే అర్థం వచ్చే చివరి పాదంతో పద్యం పూర్తి చేయమన్నారట ఒక కవి. కానీ... ఆ అష్టదిగ్గజాలే ఈ రోజున ఉంటే... పూరణం కోసం సీరియస్‌గా ఇచ్చే పద్యపాదం ‘‘మానవయోధుడు దోమ గొంతున చిక్కె’’ అని ఉండవచ్చు. పైగా దీన్ని పూరించడమూ ఈజీ! డెంగ్యూ అనే వ్యాధిబారిన పడ్డందువల్ల మనిషి అంతటివాడు దోమ బారిన పడి బాధలనుభవించాడని చెప్పేయవచ్చు. ప్రస్తుతం అంత తీవ్రంగా ప్రబలుతోంది డెంగ్యూ వ్యాధి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో వ్యాపిస్తున్న సందర్భంగా డెంగ్యూ వ్యాధిపైన, దాని నివారణ, చికిత్స వంటి పలు అంశాలపై అవగాహన కోసం ఈ ప్రత్యేక కథనం.
ఈ సీజన్‌లో దోమల వ్యాప్తి సాధారణం. దోమల్లోనూ అనేక రకాలు. అందులో పులిదోమ ఒకటి ఉంటుంది. పేరుకు తగ్గట్టు మనుషుల్ని వేటాడుతుందీ దోమ. ఈ టైగర్‌దోమ నోటి అవయవాలు కూడా పులి కోరలతో పోల్చదగ్గవే... అవి రక్తం పీల్చే అవయవాలైన మాండిబుల్, మాక్సిల్లే. వాటి సహాయంతో టైగర్‌దోమ రక్తం పీలుస్తూ, డెంగ్యూ వైరస్‌ను మనిషిలో ప్రవేశపెడుతుంది. అంతే... ఆ వైరస్ ప్రవేశించిన 2 నుంచి 7 రోజుల్లోపు ఆ వ్యక్తిలో డెంగ్యూ లక్షణాలు బయటపడతాయి. చాలా వైరస్‌లలాగే ఇది తనంతట తానే తగ్గిపోతుంది. అయితే తీవ్రతను బట్టి డెంగ్యూను మూడు రకాలుగా విభజించవచ్చు.
1. అన్ డిఫరెన్షియేటెడ్ ఫీవర్ - ఇతర ఫీవర్స్‌లాగానే అనిపించే జ్వరం.
2. డెంగ్యూ హెమరెజిక్ ఫీవర్ - మన అంతర్గత అవయవాల్లో రక్తస్రావం కావడం.
3. డెంగ్యూ హెమరెజిక్ షాక్ - అవయవాల్లో అంతర్గత రక్తస్రావంతో పాటు... బీపీ పడిపోయి షాక్‌లోకి వెళ్లడం.
డెంగ్యూ సాధారణ లక్షణాలు
జ్వరం, తలనొప్పి (ముఖ్యంగా నుదురు ప్రాంతంలో), కళ్ల వెనక నొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, ర్యాష్, ఒంటిపై ఎర్రని మచ్చలు రావడం, చిగుళ్ల నుంచి రక్తం కారడం, రక్తంలోని ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడం.రక్తంలోని ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడం వల్ల అంతర్గత అవయవాల్లో రక్తస్రావం జరుగుతుంది. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. ఈ అంతర్గత రక్తస్రావం లక్షణాలు ముందుగా కనుగొనడానికి టోర్నికేట్ అనే పరీక్షను నిర్వహించవచ్చు. చర్మంపై ఎర్రని మచ్చలు కనబడుతున్నా, కళ్లలో, నోటిలో మచ్చలు వచ్చినా, చిగుళ్ల నుంచి రక్తం కారుతున్నా, ఇంజెక్షన్ ఇచ్చినచోట లేదా ఇతర ప్రదేశాల నుంచి రక్తస్రావం జరుగుతున్నా, వాంతుల్లో రక్తం ఉన్నా లేదా విరేచనం నల్లగా వస్తున్నా డెంగ్యూ హెమరేజిక్ జ్వరంగా అనుమానించాలి.
ఈ జబ్బులో అంతర్గత రక్తస్రావం వల్ల కాళ్లు, చేతులు, ముఖం వాయడం జరగవచ్చు. అంతేకాకుండా పొట్టలో, ఊపిరితిత్తుల బయట, గుండె చుట్టూ నీరు చేసి ఆయాసం పెరగవచ్చు. సాధారణంగా రెండు నుంచి ఏడు రోజుల జ్వరం వచ్చి తగ్గిన తరువాత ప్లేట్‌లెట్స్ పడిపోవడం, ఫలితంగా అంతర్గత అవయవాల్లో రక్తస్రావం జరగడం, బీపీ తగ్గిపోయి మూత్రం సరిగా రాకపోవడం, షాక్ లాంటి చాలా తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా ఎవరైనా జ్వరం తగ్గిపోయింది కదా ఇంకేం ఉండదులే అని అనుకొని వైద్యుడి దగ్గరకి వెళ్లకపోతే ప్రాణాపాయం కలిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి జ్వరం వచ్చి తగ్గాక ఒకసారి డాక్టర్‌ను కలవడం మంచిది.
చికిత్స ఇలా...
ఈ జబ్బుకి నిర్దిష్టమైన మందులు లేవు. లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. వ్యాధి వచ్చిన వ్యక్తి బీపీ పడిపోకుండా ముందునుంచీ ఓఆర్‌ఎస్ ఇవ్వవచ్చు. షాక్‌లోకి వెళుతున్న వ్యక్తికి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. రక్తస్రావం జరుగుతున్న వ్యక్తికి తాజా రక్తాన్ని, ప్లేట్‌లెట్స్‌ను, ప్లాస్మా ఎఫ్‌ఎఫ్‌పి (ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మా) అవసరాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ప్లేట్‌లెట్స్ కౌంట్ సాధారణంగా 20 వేల కంటే తక్కువకు పడిపోతే ప్రమాదం. కాబట్టి ప్లేట్‌లెట్స్ సంఖ్య మరీ తక్కువకు పడిపోయినప్పుడు ఎప్పుడు వాటిని ఎక్కించాలో డాక్టర్ నిర్ణయిస్తారు. చిన్నాపెద్ద తేడా లేకుండా డెంగ్యూ ఎవరిలోనైనా రావొచ్చు. ముఖ్యంగా గర్భిణీల పట్ల చాలా జాగ్రత్త వహించాలి. వారిలో జ్వరం వస్తే అది డెంగ్యూ కావచ్చేమోనని అనుమానించి తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... సాధారణ జ్వరం వచ్చిన వారికి ఇచ్చినట్లుగా డెంగ్యూ బాధితులకు ఆస్పిరిన్, బ్రూఫెన్ వంటి మందులు ఇవ్వకూడదు. సాధారణంగా ఆస్పిరిన్ రక్తాన్ని పలచబారుస్తుంది. డెంగ్యూలో ప్లేట్‌లెట్స్ తగ్గి రక్తస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. అంటే ఆస్పిరిన్ వంటి మందులు తీసుకుంటే రక్తస్రావం జరిగే అవకాశాలను పెంచుకున్నట్లే! కాబట్టే ఈ జాగ్రత్త.
నివారణ ఎంతో మేలు...
ఏ వ్యాధి విషయంలోనైనా చికిత్స కంటే నివారణ మేలు. డెంగ్యూకు కారణమయ్యే టైగర్‌దోమ రాత్రిపూట కాకుండా పట్టపగలే స్వైర విహారం చేస్తుంది. నిల్వ నీటిలో సంతానోత్పత్తి చేసుకుంటుంది. ఈ ప్రక్రియకు పదిరోజుల వ్యవధి పడుతుంది. కాబట్టి ఇల్లు, ఇంటి పరిసరాల్లో నీరు అనేది నిల్వ ఉండకుండా ఒకరోజు నీటిని పూర్తిగా ఖాళీ చేసి డ్రై డే గా పాటించాలి.
ఇంట్లోని మూలల్లో.. చీకటి ప్రదేశంలో, చల్లని ప్రదేశంలో ఎడిస్ ఎజిప్టై విశ్రాంతి తీసుకుంటుంది. కాబట్టి ఇల్లంతా వెలుతురు, సూర్యరశ్మి పర్చుకునేలా చూసుకోవాలి. అదే సమయంలో బయటి నుంచి దోమలు రాకుండా కిటికీలకు మెష్ అమర్చుకోవాలి. ఈ దోమ నిల్వ నీటిలో గుడ్లు పెడ్తుంది కాబట్టి కొబ్బరి చిప్పలు, డ్రమ్ములు, బ్యారెల్స్, టైర్లు, కూలర్లు, పూలకుండీల కింద పెట్టే ప్లేట్లు మొదలైన వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. డ్రమ్ములు, బ్యారెల్స్ మొదలైన వాటిని బోర్లించి పెట్టడం మంచిది. అలాగే వాడని టైర్లను తడిలేకుండా చేసి ఎండలో పడేయాలి. తాగు నీరు కాకుండా మిగతా అవసరాల కోసం వాడే నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలపాలి. దీనివల్ల ఎడిస్ ఎజిప్టై గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు.
ఇంట్లో ఉన్నప్పుడూ ఒంటి నిండా ఉండే దుస్తులనే ధరించాలి. హాఫ్ స్లీవ్స్ కంటే ఫుల్ స్లీవ్స్ ఉత్తమం. కాళ్లను పైజామాలు, సాక్స్‌తో కవర్ చేసుకుంటే మంచిది.ఈ దోమలు ముదురు రంగులకు ఆకర్షితమవుతాయి. కాబట్టి లేత రంగుల దుస్తులను ధరించడం మేలు.పగలు కూడా మస్కిటో కాయిల్స్ వాడవచ్చు. కొందరికి ఈ వాసన సరిపడకపోవచ్చు. అలా సరిపడని పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా వహించాలి. రాత్రి పూట దోమ తెరల్ని వాడటం చాలా ఉత్తమమైన మార్గం.
ప్రమాద హెచ్చరికలు
ఇంట్లో ఎవరైనా విపరీతమైన కడుపునొప్పితో బాధపడ్తున్నా, నలుపు రంగులో మలవిసర్జనమవుతున్నా, ముక్కులోంచి కానీ, చివుళ్లలోంచి కానీ చర్మంలోపల కానీ బ్లీడింగ్ అవుతున్నా, దాహంతో గొంతెండి పోతున్నా, చెమటలు పట్టి శరీరం చల్లబడిపోయినా క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. సాధారణంగా ఆస్పిరిన్ రక్తాన్ని పలచబారుస్తుంది. డెంగ్యూలో ప్లేట్‌లెట్స్ తగ్గి రక్తస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. అంటే ఆస్పిరిన్ వంటి మందులు తీసుకుంటే రక్తస్రావం జరిగే అవకాశాలను పెంచుకున్నట్లే! కాబట్టే ఈ జాగ్రత్త.
ఆయుర్వేద చిట్కాలు
ఎండిన వేప ఆకులు, వేప ఈనెలు, ఆవాలు, ఇంగువతో పొగపెట్టి ఇల్లంతా పట్టాలి.ఇంటి మూలల్లో కర్పూరపు ఉండలు కూడా పెట్టుకోవచ్చు. వీటివల్ల దోమలే కాకుండా ఇతర హానికారకమైన క్రిములూ చచ్చిపోతాయి.అలాగే మనలో వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవడానికి అమృతారిష్ట అనే టానిక్‌ను తీసుకోవాలి. ఎనిమిదేళ్లలోపు పిల్లలకైతే రెండు చెంచాల అమృతారిష్ట మందును రెండు చెంచాల నీళ్లతో కలిపి ఉదయం, రాత్రి రెండు పూటలా ఇవ్వాలి. పెద్దవాళ్లయితే నాలుగు చెంచాల అమృతారిష్ట మందు, నాలుగు చెంచాల
నీళ్లతో కలిపి ఉడయం, రాత్రి తీసుకోవాలి.అమృతారిష్ట మందు దొరకని ప్రాంతాల వాళ్లు రెండు చెంచాల ఇప్పతీగ ఆకుల రసంలో తేనె కలుపుకొని ఉదయం, రాత్రి తీసుకుంటే సరిపోతుంది.ఒకవేళ దోమ కాటుతో ఇంట్లో వాళ్లు జ్వరం బారిన పడ్డా బెంబేలు పడకుండా ఈ కింది జాగ్రత్తలు తీసుకుంటే మంచింది.మృత్యుంజయ రస, చంద్రకళారస అనే ఆయుర్వేద మాత్రలను ఉదయం ఒకటి, రాత్రి ఒకటి చొప్పున వేసుకోవాలి. వీటితోపాటు అమృతారిష్ట టానిక్‌నూ తీసుకోవాలి. ఇవి డెంగ్యూ వల్ల పడిపోయిన ప్లేట్‌లెట్ కౌంట్స్‌ని, బ్లీడింగ్‌ని కంట్రోల్ చేస్తాయి.
డాక్టర్ గోవర్థన్
సీనియర్ ఫిజీషియన్,
కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్