ఆహార నియంత్రణ చాలు!
ఆరోగ్యం
ఒంట్లో చెడు కొవ్వు పేరుకోకుండా ఉండటానికి రోజూ జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేయడం కన్నా ఒక సులభతరమైన ప్రత్యామ్నాయ మార్గముందని ప్రకటించారు గ్రీకు అధ్యయనకర్తలు. శారీరక వ్యాయామానికి సమయం లేని వారు ఎంచక్కా ఓ పని చేస్తే హృదయ సంబంధ జబ్బుల ప్రమాదం నుంచి చాలావరకూ బయటపడవచ్చని వారు అంటున్నారు. ఇంతకీ ఏమిటా పని అంటే.. ఆహార నియంత్రణ పాటించడం!
వేళకు ఇంత తిని.. ఆ ఆహారంలో తాజా పళ్లు, కాయగూరలు ఉండేటట్లు చూసుకుంటూ, తృణ ధాన్యాలు, విత్తనాలు, బీన్స్, ఆలివ్ ఆయిల్, చేపలు వంటి ఆహారానికి తోడు అప్పుడప్పుడు రెడ్ వైన్ తీసుకుంటుంటే చాలు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 47 శాతం వరకూ తగ్గిపోతాయని అధ్యయనకర్తలు వివరించారు. ఇలాంటి ఆహారాన్ని క్రమపద్ధతిలో తీసుకుంటే వేరే శారీరక కసరత్తు అవసరం లేకపోయినా గుండె జబ్బుల నుంచి బయటపడ్డట్టేనని వారు తెలిపారు. ఏథెన్స్‌లోని హరొకొపియో వర్సిటీ అధ్యయనకర్తలు ఈ విషయాలను వెల్లడించారు. ప్రస్తుత జీవనశైలిలో ఆహార నియంత్రణ పాటించడం కూడా అంత సులభం కాకపోవడ ం వల్లనే కదా.. మానవాళి జబ్బుల పాలవుతున్నది! అదే పాటిస్తే ఇక ఏ ఆరోగ్య సమస్యా ఉండదేమో!