‘నర్సిమన్నా.. ఆడెవడు!’ అంటాడు ‘అంతఃపురం’ సినిమాలో జగపతిబాబు. ఇప్పుడు అదే ధిక్కారం పా.రంజిత్ మాటల్లో చిన్మయి అభిమానులకు వినిపిస్తోంది. మీటూ బాధితుల తరఫున రంజిత్ మామూలు మనిషితో డీకొనలేదు. కె.రాజన్‌తో పెట్టుకున్నాడు. రాజన్ తమిళ్ ఇండస్ట్రీలో నర్సిమన్న! ఆ నర్సిమన్నకు తనలోని ట్వంటీ ఫిఫ్త్ ఫ్రేమ్‌ను చూపించాడు రంజిత్.
మాధవ్ శింగరాజు
సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్లతో ఎవరూ పెట్టుకోరు. పెద్ద నిర్మాత, పెద్ద దర్శకుడు, పెద్ద హీరో.. ఇంకా ఏవో ఉంటాయి ట్వంటీఫోర్ ఫ్రేమ్స్ అని.. ఆ ఫ్రేముల్లోని పెద్దవాళ్లు ఒక మాట చెబితే చాలు.. ఎంత టాలెంట్ ఉన్నవాళ్లకైనా రూకలు చెల్లాల్సిందే. లాగి అవతల పడేయిస్తారు. మరెలా ఇండస్ట్రీ నడవడం! పెద్దవాళ్లు తలచుకుంటే టాలెంట్‌కి కొదవేముంటుంది.. ఎవరో ఒకర్ని తెచ్చేసుకుని టాలెంట్‌కి అప్పటికప్పుడు జ్యోతి ప్రజ్వలన చేస్తారు. అందుకే ఆర్టిస్టులెవరూ ఈ పెద్దవాళ్లను ప్రజ్వలన వరకు పోనివ్వరు. సినిమా ఇండస్త్రీ అనే కాదు.. ఎక్కడైనా డబ్బు ఖర్చు చేసేవాళ్లదే పై మాట. ఆ మాట వినకపోతే మనకొచ్చే రెమ్యూనరేషన్ ప్లేట్ ఇడ్లీ సాంబార్ అయినా, పదకొండు వేల నూట పదహార్లయినా, కొన్ని లక్షల కాంట్రాక్ట్ అయినా ఆ రోజుతో ఆఖరు. ఆ నష్టం కొంచెమే. ఆ తర్వాత ఇక ఎవరూ పిలిచి కెరీర్‌ని ఇవ్వరు. అది పెద్ద నష్టం. అంతా ఏకమై పగపడతారు.
ఆర్టిస్టులకైతే ఫిల్మ్‌గతులు ఉండవు. కె.రాజన్ ఇప్పుడు తమిళ్‌లో పెద్ద ప్రొడ్యూజర్. పలుకుబడి ఉన్న సీనియర్ నిర్మాత. ప్రస్తుతం ‘పర’ అని తమిళంలో ఒక సినిమా తీస్తున్నారు. గతవారం ఆ సినిమా ఆడియో ఫంక్షన్‌లో అకస్మాత్తుగా ఆయన చిన్మయి ప్రస్తావన తెచ్చారు. ‘పర’లో చిన్మయి పాడింది లేదు. డబ్బింగ్ చెప్పిందీ లేదు. కనీసం ఆమె ఆ ఫంక్షన్‌లో కూడా లేరు. ‘పర’ ఒకటే కాదు.. కమింగ్ అప్ సినిమాల్లో కూడా ఆమె పాటలు, మాటలు లేవు. నిరుడు వైరముత్తుపై ‘మీటూ’ ఆరోపణలు చేసినప్పటి నుంచీ ఆమె గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. అందుకు చిన్మయేం చింతించలేదు. ఇండస్ట్రీ మొత్తం కక్ష కట్టినా భర్త సపోర్ట్ ఆమెను నిలిపింది. కె.రాజన్ సీనియర్ నిర్మాత అయినట్లే, వైరముత్తు సీనియర్ గీత రచయిత. ‘‘కన్నదాసన్, వలీల తర్వాత.. అంతటి విద్వత్తు గల వైరముత్తు మీదే ఆరోపణలు చేస్తావా.
ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం ఆయన నిన్ను ఏదో చేశారని, ఇప్పుడు నువ్వు చీప్ పబ్లిసిటీ కోసం ఆయన్నేదో చేయబోతావా? నిన్ను సర్వనాశనం చేస్తా చూడు. నాకు తెలిసిన వాళ్లు యాభై మంది ఉన్నారు. వాళ్లకు ఒక్కమాట చెప్పానంటే నీ అంతు చూస్తారు. నువ్వు వైరముత్తు మనశ్శాంతిని ధ్వంసం చేస్తే నా మనుషులు నిన్ను అధోగతి పట్టిస్తారు’’ అని చిన్మయి పేరెత్తకుండా చిన్మయిపై విరుచుకుపడ్డారు రాజన్. రాజన్ మాట్లాడుతున్నప్పుడు వేదికపై ఆయన వెనకే ఎల్లో శారీ, గ్రీన్ కలర్ జాకెట్‌లో ఉన్న యాంకర్.. రాజన్ అంటే ఉన్న భయభక్తుల వల్ల కావచ్చు.. చేతులు కట్టుకుని, తలదించుకుని గౌరవ మనస్కురాలై నిలబడి ఉన్నారు. చెప్పలేం. నిరసనకు అదొక జెశ్చర్ అయినా కావచ్చు. పెద్దాయన కదా మరి! రాజన్ మాటలపై ఇంకో మాట ఉండదు. శాసనం. తర్వాతి వక్త పా.రంజిత్. ఫంక్షన్‌కి అతడు చీఫ్‌గెస్ట్ కూడా.
యువ దర్శకుడు. రజనీతో ‘కబాలి’, ‘కాలా’ తీసింది అతడే. వేదిక మీదకి వచ్చి మైక్ అందుకున్నాడు. చిన్మయికి రాజన్ ఇచ్చిన వార్నింగ్ ఎక్కడైతే ఆగిందో.. సరిగ్గా అక్కడి నుంచి రంజిత్ ప్రసంగం మొదలైంది! ఇది ఎవరూ ఊహించనిది. వణికిపోయారు. కూర్చున్న కొమ్మపై గొడ్డలి లేపాడేమిటీ కుర్రాడు అనుకున్నారు. రాజన్ పేరెత్తకుండా, చిన్మయి మాటెత్తకుండా మాట్లాడాడు రంజిత్. ‘‘ఏళ్లుగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఇండస్ట్రీ ఇది. ఈ వాస్తవాన్ని తిరస్కరించలేం. అంతే కాదు.. వాస్తవమని అంగీకరించాలి కూడా. మహిళా ఆర్టిస్టులు ఫిర్యాదు చేసినప్పుడు ఆరోపణగా తీసుకోకూడదు. విచారణ జరిపించాలి. ఫిర్యాదు చేసిన మహిళనే నేరస్థురాలిగా చూడ్డాన్ని నేను ఖండిస్తున్నాను’’ అన్నాడు! సభలో సౌండ్ లేదు. ఎవరూ చప్పట్లు కొట్టలేదు. ఆ పసుపురంగు చీరలో ఉన్న అమ్మాయి ముఖంలో మాత్రం కృతజ్ఞతలాంటి చిరునవ్వు ఒకటి మెరిసి మాయమైంది.
మీటూ ఉద్యమం మన దగ్గర ఏడాదిగా నడుస్తోంది. బాలీవుడ్‌లో తనుశ్రీ దత్తా, తమిళంలో చిన్మయి.. ఈ ఇద్దరూ ధైర్యంగా బయటికి వచ్చారు. నిందలు, అవమానాలు పడ్డారు. చిన్మయి అయితే అవకాశాలు కోల్పోయారు. తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు చిన్మయి ఒంటరి ఆర్టిస్ట్. అయినా గట్టిగా నిలబడ్డారు. రాజన్ బెదిరింపులకూ భయపడలేదు. ‘సిదైక ఆల్ ఎల్లమ్ వెచ్చుర్కారమే. బయప్పోదుమా?’ అని ట్విట్ చేశారు. మనుషుల్ని పెట్టించుకున్నారట! భయపడాలా?! అని. ఆ తర్వాత చిన్మయి భర్త పా.రంజిత్‌కి సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలిపారు.. ప్రతిచోటా ఇలాంటి గౌరవనీయులు ఒక్కరైనా ఉండాలి అని. ఇప్పుడిక రంజిత్‌కి ఉంటుంది.
తన మాటకే మాట వేసినందుకు రాజన్.. రంజిత్‌కి సినిమాలు ఇవ్వకుండా, సినిమాలు రాకుండా చెయ్యవచ్చు. అయితే రంజిత్ ఇవేమీ ఆలోచించలేదు. తన మనసులో ఉన్నది మాట్లాడాడు. అసలీ మాటను ఈసరికే తమిళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దపెద్ద వాళ్లు మాట్లాడి ఉండవలసింది. కానీ మౌనం తప్ప మాట లేదు! ఇప్పుడు పా.రంజిత్ మాట్లాడాడు. హీరోలను డైరెక్ట్ చేసినవాడు రంజిత్. ఇప్పుడు అతడే హీరోగా నిలబడ్డాడు. రియల్ హీరోగా! చిన్మయిని సపోర్ట్ చెయ్యడం అతడి హీరోయిజం కాదు.
చిన్మయిని, చిన్మయిలాంటి వాళ్లను కించపరుస్తున్న పెద్దవాళ్లందర్నీ ఒక్కమాటతో ఖండించాడు. ‘వేధింపులు నిజమే అని అంగీకరించాలి’ అనే ఒక్కమాటతో ఇండస్ట్రీ పెద్దలకు ఎదురు నిలిచాడు. ఇలాంటి ఒక హీరో.. ధైర్యంగా బయటికి వచ్చిన ప్రతి అమ్మాయి పక్కనా సపోర్ట్‌గా ఉండాలి. నాన్న, అన్న, భర్త, స్నేహితుడు, సన్నిహితుడు.. ఎవరైనా ఒక హీరో! స్టంట్స్, ఫైట్స్ చెయ్యక్కర్లేదు.. ఆమె మీదకు వచ్చేపడే మాటల ఈటెల్ని తిప్పికొట్టే హీరో! బూమరాంగ్ అయిన ఆ ఈటెలు ఒక్కో మసుగునూ తొలగిస్తుంటే అమ్మాయిలకెంత ధైర్యం, ధీమా.
- మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment