నాన్నను ఎప్పుడూ అలా చూడకూడదనుకున్నా.. | rajinikanth kochadaiyaan movie director Soundarya Rajinikanth | Sakshi
Sakshi News home page

నాన్నను ఎప్పుడూ అలా చూడకూడదనుకున్నా..

Published Sat, Apr 12 2014 11:05 PM | Last Updated on Sat, Sep 2 2017 5:56 AM

నాన్నను ఎప్పుడూ అలా చూడకూడదనుకున్నా..

నాన్నను ఎప్పుడూ అలా చూడకూడదనుకున్నా..

ఇవాళ దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చిత్రం - తమిళ ‘కోచ్చడయాన్‌‘ (తెలుగులో ‘విక్రమ సింహ’). రజనీకాంత్ నటించిన ఈ అత్యాధునిక సినిమాకు ఆయన చిన్న కుమార్తె సౌందర్య డెరైక్టర్. తండ్రి నటిస్తుంటే, కుమార్తె దర్శకత్వం వహించడం భారతీయ సినీ చరిత్రలో ఇదే తొలిసారి. మోషన్ క్యాప్చర్ ఫొటో రియలిస్టిక్ టెక్నాలజీతో తయారైన మన తొలి సినిమా కూడా ఇదే. సూపర్ స్టార్ తండ్రి... సూపర్ కూతురు... సూపర్ టెక్నాలజీ సినిమా... ఇంకేం.. 29 ఏళ్ల సౌందర్యా రజనీకాంత్‌ను కదిలిస్తే, కబుర్లకు కొదవా.
 
 నేను చెన్నైలో పుట్టి పెరిగా. మా అమ్మ నడుపుతున్న ‘ది ఆశ్రమ్’ స్కూలులో చదువుకున్నాను. అసలు చిన్నప్పటి నుంచి నాకు వాక్యాలు చదవడం కన్నా, బొమ్మలు చూడడం బాగా ఇష్టం. నేనెప్పుడూ పదాల్లో ఆలోచించను, నా ఆలోచనలెప్పుడూ బొమ్మల్లోనే! పెర్త్‌కు వెళ్ళి, గ్రాఫిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసి, వచ్చా. ఆఫర్లొచ్చినా, నటన వైపు మొగ్గలేదు.
 
 సినీ ప్రముఖుడి సంతానానికి ఎవరికైనా, సినిమా పట్ల ఆకర్షణ కలగడం సహజమే. కానీ, దాని వల్ల కొన్ని సానుకూలతలున్నాయి. ప్రతికూలతలూ ఉన్నాయి. పిల్లలైన మేము ఏం కావాలని అనుకుంటున్నదీ నాన్న గారు మాతో ఓపెన్‌గా మాట్లాడారు. మేము కెమేరా ముందుకు రావడాన్ని ఆయన పెద్దగా ఇష్టపడలేదు. నాకు కూడా యానిమేషన్ అంటే ఆసక్తి. యానిమేషన్, విజువల్ గ్రాఫిక్స్ నా ఊహలకు రెక్కలు తొడిగాయి. అలా ‘శివాజీ’, ‘రోబో’లకు పని చేశా. యువతరం కథ ‘గోవా’ నచ్చి, నిర్మాతనయ్యా. ‘కోచ్చడయాన్’తో దర్శకత్వం వైపు వచ్చా.  పరిస్థితులెటు తీసుకెళితే అటెళుతున్నా.
 
 అమ్మంటే ఇష్టం


 నేను అమ్మ కూచిని. మా అమ్మ లాగా దేనినైనా సానుకూల దృక్పథంతో చూసే, దృఢమైన వ్యక్తిత్వమున్న మహిళ చాలా అరుదు. నాకు అన్నీ మా అమ్మే. మా ఇంటి మొత్తాన్నీ ఆమే నడుపుతుంది. బయట ఇంత పేరున్న మా నాన్న గారు కూడా నూటికి 200 పాళ్ళు అన్నిటికీ ఆమె మీద ఆధారపడుతుంటారు. ఆమె ఏకకాలంలో అనేక పాత్రలు పోషిస్తుంటారు. ఆమెకున్న సహనం అంతా ఇంతా కాదు.
 
 సూపర్‌స్టార్ కుమార్తెగా...


 ప్రముఖుల పిల్లలమైనప్పుడు అందరి దృష్టీ మన మీద ఉంటుంది. తల్లితండ్రుల గొప్పతనంతో, వారు సాధించిన విజయాలతో అనుక్షణం పోలుస్తూ ఉంటారు కాబట్టి, ఒత్తిడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ మా గురించి రాస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ తప్పవు. అయినా, అక్కచెల్లెళ్ళమైన మా ఇద్దరి బాల్యం అద్భుతంగా గడిచింది. అప్పట్లో మా నాన్న గారు రోజూ మూడు షిఫ్టులతో తీరిక లేకుండా పనిచేస్తుండేవారు. ఆయన దగ్గర లేని లోటు లేకుండా అమ్మ చూసేది. అమ్మమ్మ వాళ్ళు మధ్యతరగతి పిల్లల్లా పెంచారు.

‘కోచ్చడయాన్’ మొదలైందిలా...


 ముందు అసలు నేను ‘సుల్తాన్’ అనే 3డి యానిమేషన్ చిత్రం తీయాలనుకున్నా. అనేక కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇక, ఆ సినిమా తీసే ఆలోచన లేదు. ‘సుల్తాన్’ ఆగాక,‘రాణా’ సినిమా నాన్న గారితో ప్రారంభించాం. తీరా నాన్న గారికి ఒంట్లో బాగాలేక ఆ సినిమా కూడా ఆగిపోయింది. నాన్న గారితో గతంలో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన కె.ఎస్. రవికుమార్ ఆ చిత్రానికి దర్శకత్వం వహించాల్సింది. నాన్న గారి ఆరోగ్యం బాగవడంతో, ‘రాణా’ కన్నా ముందు దానికి ముందు భాగం ఒకటి తీయాలనుకున్నాం. రాణాకు తండ్రే ఈ కోచ్చడయాన్. ‘కో’ అంటే రాజు గారనీ, ‘చడయాన్’ అంటే అంటే పొడవాటి జుట్టున్న వ్యక్తి అనీ అర్థం. శివుణ్ణి పూజించే ఓ రాజ వంశీకుల కాల్పనిక కథ ఇది.
 
 పెర్ఫార్మెన్స్ క్యాప్చరింగ్ అంటే...


మన దేశంలో సాధారణంగా విజువల్ ఎఫెక్ట్‌లు, గ్రాఫిక్స్ లాంటివి యాక్షన్ సన్నివేశాలు, పాటల లాంటి ఏదైనా ఓ ప్రత్యేక సందర్భంలానే వాడతారు. టెక్నాలజీని మేళవించుకొని నడిచే ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’, ‘అవతార్’ లాంటి సినిమాలు ఇక్కడ తీయం. నిజానికి, మన దేశంలో అవి రూపొందించగల ప్రతిభావంతులైన టెక్నీషియన్లు చాలా మంది ఉన్నారు. అందుకే భారతదేశంలోనే తొలిసారిగా పెర్ఫార్మెన్స్ క్యాప్చర్ పద్ధతిలో ‘కోచ్చడయాన్’ తీశా. నటీనటులు సెన్సర్లు తగిలించిన తోలుదుస్తులతో వచ్చి కెమేరా ముందు అభినయిస్తారు. వారి కదలికల్నీ, అభినయాన్నీ క్యాప్చర్ చేసి, 3డి వెర్షన్‌లో ప్రవేశపెట్టి, పాత్రల రూపురేఖల్ని యానిమేషన్‌లో తీర్చిదిద్దుతాం.
 

మనకు ఇప్పటి దాకా తెలియని ఇలాంటి సరికొత్త పద్ధతిలో సినిమా తీయడమంటే, ఆర్థికంగా అభద్రత తలెత్తుతుంది. అయినా సరే, ఈ కొత్త దోవ తొక్కాం. కష్టపడి ‘కోచ్చడయాన్’ తీశాం. బాక్సాఫీస్ వద్ద విజయమంటారా... కష్టపడి పనిచేసి, ఫలితం దేవుడికి వదిలేయాలి. అయితే, రజనీకాంత్ అభిమానులకు నచ్చేవన్నీ సినిమాలో ఉన్నాయని చెప్పగలను.
 
 నాన్నకు దర్శకురాలిగా...


 అన్ని భాషల సినిమాలూ చూస్తుంటాను. తొలి సినిమాకే అంత గొప్ప నటునికి దర్శకత్వం వహించడం నా అదృష్టం. కొన్నిసార్లు నేను ‘యాక్షన్’ అని చెప్పి, షాట్ అయిపోయినా సరే ‘కట్’ చెప్పడం మర్చిపోయి, నాన్న గారి అభినయాన్ని చూస్తూ ఉండిపోయేదాన్ని. ఇక, కొన్ని సందర్భాల్లో ఆయన హీరోగా, నేను దర్శకురాలిగా కాకుండా తండ్రీ కూతుళ్ళలా ప్రవర్తించేవాళ్ళం. ఒకసారి మా అమ్మ ఏ సన్నివేశాలు తీస్తున్నారని అడిగింది. అప్పుడు మేము ‘అప్పా’ (తమిళంలో నాన్న అని అర్థం)కీ, దీపికా పదుకొనేకీ మధ్య ప్రేమ సన్నివేశాలు తీస్తున్నాం. ఆ మాటే చెప్పా. ఆ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి కానీ, వాటిని చిత్రీకరించడం దర్శకురాలిగా నాకూ, నటుడిగా నాన్నకూ కొద్దిగా ఇబ్బంది అనిపించింది.
 

చిత్రీకరణ సమయంలో ఆయన ఆరోగ్యం గురించి ఎంతో జాగ్రత్తగా ఉండేదాన్ని. అప్పుడు నాలోని కుమార్తె తొంగి చూసేది. కెమేరా ముందు ఆయన నటన చూస్తున్నప్పుడు నాలోని అభిమాని బయటకొచ్చేది. ఏ రోజుకా రోజు ఆనాటి షెడ్యూల్ పూర్తయ్యేలా చూడాల్సి వచ్చినప్పుడు నాలోని దర్శకురాలు బహిర్గతమయ్యేది. ఆయనకు శ్రమ అనిపించకుండా, అదే సమయంలో నా లాంటి అభిమానులంతా ఆయనను ఎలా చూడాలనుకుంటున్నారో అలా కనిపించేలా చూపాను.
 

చుట్టూతా ఏమీ లేకపోయినా, అవి ఉన్నట్లు ఊహించుకొంటూ, నటించాలి కాబట్టి, ప్రతి సన్నివేశాన్నీ లోతుగా వివరించేదాన్ని. ఆయన అంత పెద్ద సూపర్‌స్టార్ అయినా కొత్త దర్శకురాలినైన నా మాట శ్రద్ధగా వినేవారు. చెప్పినట్లు చేసేవారు. ఆయన అంతెత్తుకు ఎలా ఎదిగారన్నది అప్పుడు అర్థమైంది. ఈ సినిమా తరువాతా నాన్నగారు నటిస్తూనే ఉంటారు. మేము ముందనుకున్న కె.ఎస్. రవికుమార్ స్క్రిప్టు ‘రాణా’ సిద్ధంగానే ఉంది. ఏదో ఒక రోజున ఆ కలా నిజం కావచ్చు.
 
 అక్కను మెప్పించడమా... అమ్మో...


 అక్కయ్య ఐశ్వర్య నాకు పూర్తిగా భిన్నమైన వ్యక్తి. నేను బహిర్ముఖురాలినైతే, ఆమె అంతర్ముఖురాలు. ఆమె వీణ నేర్చుకోవడానికి వెళితే, నేను గోల్ఫ్‌కు వెళ్ళేదాన్ని. కట్టూబొట్టుల్లో ఆమె భారతీయతననుసరిస్తుంది. నాది అందుకు భిన్నమైన పంథా. మాది ప్రత్యేకమైన అనుబంధం. పొద్దస్తమానం మాట్లాడుకోము కానీ, ముఖ్య విషయాలు చర్చించుకుంటాం. ఆమె కూడా దర్శకురాలే. నిర్మొహమాటంగా విమర్శించుకుంటూ ఉంటాం. అక్కను మెప్పించడం అంత సులభం కాదు. ఆమె ‘ఫరవా లే’దందంటే, బ్రహ్మాండంగా ఉన్నట్లు లెక్క. ‘కోచ్చడయాన్’ చూసి, ‘మంచి సినిమా’ అంది.
 
 ఎంతో ఒత్తిడికి లోనయ్యా...


 ఆ మధ్య మా నాన్న గారికి ఒంట్లో బాగా లేనప్పుడు ఎంతో ఒత్తిడికి లోనయ్యా. అంతకు ముందు మా అమ్మకు ఆరోగ్యం బాగా లేదు. అది మానసికంగా కుంగదీసింది. అక్కచెల్లెళ్ళమిద్దరం అన్నీ వదిలేసి, అనుక్షణం నాన్న గారి వెంటే ఉన్నాం. ఆ రోజులు తలుచుకుంటే కూడా ఇప్పటికీ నాకు భయమేస్తుంది. నాన్న గారిని ఎప్పుడూ అలా చూడకూడదనుకున్నా. అలాంటి పరిస్థితి రాకూడదని వేయి దేవుళ్ళకు మొక్కుకున్నా. ఇక, నేను చేపట్టిన ప్రాజెక్టులేవీ ముందుకు సాగక, స్తంభించిపోయినప్పుడు నిరాశకు లోనయ్యా. అయితే, మా అమ్మ నాకు ధైర్యం చెప్పింది. వ్యాపారవేత్త అయిన నా భర్త అశ్విన్, నా అత్తమామలు నా పనిని అర్థం చేసుకొని నైతికంగా మద్దతునిచ్చారు.
 
 తరతరాలకూ తెరపై రజనీ...


 ఈ భారీ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినందుకు పెద్ద బరువు దింపుకున్నట్లుంది. కొద్ది రోజుల్లో ‘కోచ్చడయాన్’ రిలీజవుతుండడంతో ప్రేక్షకులెలా ఆదరిస్తారా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా. ఈ సినిమాకు పనిచేస్తున్నప్పుడు టెక్నాలజీ సాయంతో రజనీకాంత్‌కు సంబంధించిన వర్చ్యువల్ ఇమేజరీలు లెక్కలేనన్ని సృష్టించాం. రాబోయే రోజుల్లో ఎవరైనా భౌతికంగా ఆయన బాడీ లాంగ్వేజ్‌ను అనుసరిస్తే చాలు, ఆ ఇమేజరీల సాయంతో, సరైన ఎఫెక్ట్‌ల ద్వారా ఎన్నేళ్ళ తరువాతైనా సరే రజనీకాంత్‌ను వెండితెరపై పునఃసృష్టించవచ్చు. తరతరాలు అభిమానులకది కన్నుల పండుగ.
 
 ఆయనలోని గొప్పదనం అదే...


 నాన్న గారిలో గొప్పదనం ఏమిటంటే, డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తితో ఎలా మాట్లాడతారో, అవేమీ లేని డ్రైవర్‌తోనూ అదే పద్ధతిలో మాట్లాడడం. అందుకే, తెర బయటా ఆయనే నా హీరో. ఆయన లాగే నేనూ పట్టిన పట్టు విడవను. వల్ల కాదు లెమ్మని దేనినీ అంత తొందరగా వదిలేయను. మొదట్లో ఆయన బస్ కండక్టర్. తమిళం ఒక్క ముక్క రాదు. అలాంటి వ్యక్తి పట్టుదలతో ఇవాళ ఏ స్థాయికి చేరారో చూడండి. ఆయన రక్తం పంచుకు పుట్టినందుకు గర్విస్తున్నా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement