రికార్డ్ : మీసాల రాయుడి సలహాలు!
రామ్‌సింగ్ చౌహాన్.. తన మీసం పొడవుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొన్న వ్యక్తి. 4.29 మీటర్లు లేదా 14 అడుగుల పొడవున్న మీసంతో చౌహాన్ గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించాడు. దాంతో మీడియా చౌహాన్ వెంట వెంటే తిరుగుతోంది. మీసాలు అంత పొడవుగా పెంచడం ఎలా? అని అడుగుతోంది. టెక్నిక్స్ చెప్పమని ప్రశ్నిస్తోంది. ప్రస్తుతానికి మీసం పొడవు విషయంలో చౌహాన్‌ను బీట్ చేసే వారు కూడా ఎవరూ దరిదాపుల్లో లేకపోవడంతో చౌహాన్ కూడా ‘మీసం పెంచడం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు’ అనే అంశం గురించి విపులంగా చెబుతున్నాడు. ముందుగా పొడవాటి మీసం పెంచాలని అనుకునే వారు టీనేజీ నుంచే మీసం మీద ప్రత్యేక దృష్టిపెట్టి ఉండాలట.
యవ్వనంలో ఉన్నప్పుడు హార్మోన్లకు మంచి శక్తి ఉంటుందని, మీసం సులభంగా పెరిగే అవకాశాలుంటాయని చౌహాన్ అంటున్నాడు. ఇక తరచూ మీసాలకు మసాజ్ అవసరమని.. ఈ విషయంపై చాలా శ్రద్ధ వహించాలని సూచించాడు. అన్నింటికీ మించి మీసం ఇంట్లో వాళ్లకు అడ్డం కాకూడదని.. ప్రత్యేకించి పెళ్లైన వారు తమ భార్య పర్మిషన్ తీసుకొని, ఆమె ఇష్టపడితేనే మీసం పెంచితే పద్ధతిగా ఉంటుందని ఈ మీసాల రాయుడు సూచిస్తున్నాడు. చౌహాన్ సూచనలను ప్రఖ్యాత వార్త సంస్థ బీబీసీ కూడా తన వెబ్‌సైట్‌లో ఉంచడం విశేషం !