శివగామి! | Rama Rajamouli about Bahubali - 2 | Sakshi
Sakshi News home page

శివగామి!

Published Sun, Apr 23 2017 12:27 AM | Last Updated on Tue, Sep 5 2017 9:26 AM

శివగామి!

శివగామి!

శివగామి అంత పవర్‌ఫుల్‌ మదర్‌ క్యారెక్టర్‌గా మనకు ఎందుకు కనపడుతోంది? ధైర్యం వల్ల... త్యాగం వల్ల... కుటుంబ గౌరవం కోసం పోరాడిన వీర వనిత అవ్వడం వల్ల! రమా రాజమౌళి తన పిల్లలకే కాదు... ‘బాహుబలి’ యూనిట్‌కి ఒక తల్లి. కుటుంబం ఒక రాజ్యం అయితే... ఆవిడ శివగామి. రాజమౌళి జీవితంలో అసలు సిసలైన శివగామి!

ఏంటండీ... గిన్నెలు, స్టవ్వు, పరుపులు, దుప్పట్లు... ‘బాహుబలి’ పనులు ఎక్కడ జరిగితే ఆ ప్లేస్‌ని ఇంటిలా మార్చేస్తారా?
రమా రాజమౌళి: (నవ్వుతూ). ఈ సినిమా కోసం నాలుగైదేళ్లు డెడికేట్‌ చేసేశాం. దాదాపు ఇంటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అందుకే ఎక్కడ ఉంటే అక్కడ ఇంటి వాతావరణం గుర్తుకొచ్చేలా మార్చేశాం. అలా లేకపోతే ఇది హోటల్, ఇది పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ల్యాబ్, ఇది షూటింగ్‌ స్పాట్‌ అనే ఫీలింగ్‌ మనసులో ఉంటుంది. పైగా నందీ (రాజమౌళి)కి ఇల్లంటే ఇష్టం. బయట ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే, అది ఎంత పెద్ద స్టార్‌ హోటల్‌ అయినా అక్కడి మంచాల మీద మా దుప్పట్లు వేస్తాను. వేరే బెడ్‌షీట్స్‌ అయితే నందీకి నిద్రపట్టదు. నేను ఒకటి రెండు రోజుల గురించి మాట్లాడటం లేదు. పెద్ద పెద్ద షెడ్యూల్స్‌ గురించి చెబుతున్నా. ఈ సినిమా షూటింగ్‌ అప్పుడు ఆర్‌ఎఫ్‌సీలో ఓ గెస్ట్‌ హౌస్‌ని ఇంటిలా మార్చేశాం. ఇంటి స్టాఫ్‌ని తీసుకెళ్లిపోయాం. దాదాపు వంట నేనే చేస్తాను.

♦  అంత టైమ్‌ మీకుంటుందా? మీరీ సినిమాకి కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కదా... ఆ పనులు చూసుకోవాలిగా?
రమ: నాకు వంట చేయడం ఎప్పుడూ ఇబ్బంది అనిపించలేదు. ఈజీగా, ఫాస్ట్‌గా చేసేస్తా. ఎప్పుడూ పూటకి 20 మందికి వంట చేస్తాను. ఇంట్లో ఉన్నా ఎవరో ఒకరు వస్తుంటారు. లొకేషన్‌కి క్యారియర్‌ పంపాలంటే ఒకరికో ఇద్దరికో పంపలేం కదా. అందుకే ఎప్పుడూ 20, 25 మందికి వండుతుంటాను. తక్కువ వండాలంటే నాకు కష్టమే. హైదరాబాద్‌లో షూటింగ్‌ అంటే నందీకి ఇంటి నుంచే క్యారియర్‌ పంపిస్తాను.

♦  మీ నందిగారికి నచ్చిన వంటకాలు... అసలు బయట ఫుడ్‌ని ఎంజాయ్‌ చేయరా?
రమ: ‘ఇది కావాలి’ అని అడగడు. ఏది వండినా తింటాడు. పప్పుచారు, చికెన్‌ కాంబినేషన్‌ని ఇష్టంగా తింటాడు. ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఏదైనా కర్రీ, చారు పెట్టేస్తాను. అలా తినడం తనకూ ఇష్టమే. నందీకి పని తప్ప ఆరోగ్యం మీద ధ్యాస ఉండదు. తన ఆరోగ్యం గురించి నేనే పట్టించుకుంటుంటాను. మేం బయట కూడా తింటాం. సరదాగా లంచ్, డిన్నర్‌ అవీ చేస్తుంటాం. హాలిడే ట్రిప్స్‌కి వెళ్లినప్పుడు మాత్రం బయట ఫుడ్‌ తింటాం.

ఒకసారి రాజమౌళిగారు పులిహోర కలుపుతున్న ఫొటో ఒకటి బయటికొచ్చింది. ఆయన గరిటె తిప్పుతుంటారా?
రమ: రాజమౌళికి వంట రాదు. షూటింగ్‌ లేకపోతే వంటింట్లో గట్టు మీద కూర్చుని కబుర్లు చెబుతుంటాడు. ఒకసారి నేను పులిహోర చేస్తుంటే, మొత్తం కలిపాడు. అలాంటి సహాయాలు చేస్తుంటాడు.

  మీ ఇద్దరిలో ఉన్న కామన్‌ పాయింట్స్‌? 
రమ: ఇద్దరికీ ఫుడ్‌ ఇష్టం. ట్రావెల్‌ చేయడం అంటే బోల్డంత సరదా. కొత్త ప్లేసులు చూడాలనుకుంటాం. ఎడ్వంచరస్‌ ట్రిప్స్‌ అంటే చాలా ఇష్టం. ఇద్దరి ఆలోచనలూ దాదాపు ఒకేలా ఉంటాయి.

గుడ్‌ హజ్బెండ్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ రాజమౌళిగారనొచ్చా?
రమ: ‘దేర్‌ ఈజ్‌ నో గుడ్, దేర్‌ ఈజ్‌ నో బ్యాడ్‌’. ఎందుకంటే నాకు ఇష్టమైనది ఇంకొకరికి మంచి క్వాలిటీ కాకపోవచ్చు. ఇంకొకరి దృష్టిలో బ్యాడ్‌ క్వాలిటీ నా కోణంలో గుడ్‌ అవ్వొచ్చు. అందుకే మంచి భర్తకి కావాల్సిన క్యాలిటీ ఇదే అని చెప్పలేను. రాజమౌళికి 24 గంటలూ ప్రొఫెషనే. అది చాలామందికి నచ్చకపోవచ్చు. నచ్చకపోయినంత మాత్రాన అది తప్పుకాదు. చెబితే నమ్మరు. ఆయనకు ఒక్క ఫ్రెండ్‌ కూడా లేరు. దానిని మనం నెగిటివ్‌గానూ తీసుకోవచ్చు. పాజిటివ్‌ క్వాలిటీగానూ తీసుకోవచ్చు. మనం చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. నా వరకు ‘హీ ఈజ్‌ ఏ పర్‌ఫెక్ట్‌ పర్సన్‌’. ఇతరులను బాగా అర్థం చేసుకుంటాడు. కోపం వచ్చినా క్షణికమే. ఎవరి మీద కోపం వస్తే వాళ్లతో కోపంగా మాట్లాడి, వెంటనే వేరేవాళ్లతో మాట్లాడాల్సి వస్తే, మూడ్‌ మార్చుకుంటాడు. అది మంచి లక్షణం.

   ‘బాహుబలి’ లాంటి పెద్ద ప్రాజెక్ట్‌కు మీ ఫ్యామిలీ నాలుగేళ్లు అంకితమైపోతుందని ఊహించారా?  
రమ: ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ చేస్తామని ఊహించలేదు. రాజమౌళికి మహాభారతం అంటే ఇష్టం. ఆ ప్రాజెక్ట్‌ చేయాలనేవాడు. అది కనీసంæఐదేళ్ల ప్రాజెక్ట్‌ అనుకునేదాన్ని. ‘ఇప్పుడు మనకు బాధ్యతలు ఉన్నాయి. ఒక్క ప్రాజెక్ట్‌ మీద అంత టైమ్‌ స్పెండ్‌ చేయలేం. అది రిటైర్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ అయితే బెటర్‌’ అనేదాన్ని. తనూ అదే కరెక్ట్‌ అనుకున్నాడు. కానీ ఇప్పుడనిపిస్తోంది. ‘బాహుబలి’నే ఐదేళ్ల ప్రాజెక్ట్‌ అయితే ‘మహాభారతం’కి పదేళ్లు పడుతుందని.

పది మందికి పైగా మీ కుటుంబ సభ్యులు ‘బాహుబలి’కి పని చేశారు. ‘ఫ్యామిలీ ప్యాకేజ్‌’ అని బయట చాలామంది అంటుంటారు. మీ రెమ్యూనరేషన్‌ ఎంత?
మిగతా అందరికీ పారితోషికాలు ఉంటాయి. నాకు రాజమౌళి కోసం పని చేయడం ఇష్టం కాబట్టి చేస్తున్నాను. అందుకని పారితోషికం తీసుకోను.
అసలు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా మీ కెరీర్‌ ఎలా ప్రారంభమైంది?
రమ: మొదట్నుంచీ కెరీర్‌లో పెద్ద స్థాయికి ఎదగాలని నేను అనుకోలేదు. అమ్మ చదువుకోమని చెబుతున్నా పట్టించుకునేదాన్ని కాదు. పెళ్లైన తర్వాత కూడా సినిమాల్లో వర్క్‌ చేయాలని కానీ, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అవ్వాలనీ ఆలోచన లేదు. రాజమౌళికి క్యారియర్‌ తీసుకుని షూటింగ్‌ స్పాట్‌కి వెళ్లేదాన్ని. ఆ టైమ్‌లో ‘సింహాద్రి’ షూట్‌ జరుగుతోంది. కాస్ట్యూమ్స్‌లో కొన్ని రాజమౌళికి నచ్చేవి కావు. మార్చి చేయించుకుందామంటే అసలు ప్రాబ్లమ్‌ ఏంటో చెప్పడం తనకు తెలిసేది కాదు. అప్పుడు నేను కలర్‌ కాంబినేషన్‌ విషయంలో సలహాలిచ్చేదాన్ని. అలా నాకు తెలియకుండానే ఇన్వాల్వ్‌ అయ్యాను. సాంగ్స్‌ తీసేటప్పుడు ‘కొంచెం కాస్ట్యూమర్‌తో మాట్లాడవా?’ అని నంది అనేవాడు. దాంతో నేనే వెళ్లి, మెటీరియల్‌ కొని, తీసుకొచ్చేదాన్ని. ‘సింహాద్రి’లోని అన్ని సాంగ్స్‌కు నేనే చేశా. ‘సై’ సిని మా  నుంచి అఫిషియల్‌ అయిపోయా.

రాజమౌళిగారికి కలర్‌ కాంబినేషన్‌ గురించి ఎంతవరకూ అవగాహన ఉంది?
రమ: క్యారెక్టర్‌ లుక్‌ గురించి చెబుతారు కానీ, కాస్ట్యూమ్స్‌ ను ఆయన ఊహించలేరు. కలర్‌ మ్యాచింగ్‌ గురించి తనకు పెద్దగా ఐడియా లేదు. కాస్ట్యూమ్‌గా చూసినప్పుడు ఆయనకు అర్థం కాదు. అయితే ఆర్టిస్టులు వేసుకున్న తర్వాత లుక్స్‌కి ఇంప్రెస్‌ అయ్యేవారు.

సో... రాజమౌళిగారి డ్రెస్సుల సెలక్షనంతా మీదే అన్నమాట...
రమ: అన్నీ నేనే ఎంపిక చేస్తాను. ఒకరోజైతే నేనేదో పని మీద ఉంటే, తనంతట తాను ఒక డ్రెస్‌ సెలక్ట్‌ చేసుకుని, వేసుకుని వెళ్లాడు. అది రెడ్‌ టీ షర్ట్, రెడ్‌ ప్యాంట్‌. అలా వింత కాంబినేషన్‌లో డ్రెస్సులు వేసుకున్న సందర్భాలున్నాయి. అప్పుడు షూటింగ్‌ బిజీలో అలా చేశాడు. సినిమా జరగనప్పుడు కాస్త మైండ్‌ పెడితే మంచి కాంబినేషన్‌ సెలక్ట్‌ చేసుకోగలడు.

పెద్ద డైరెక్టర్‌ని అనే గర్వం రాజమౌళిగారికి ఉంటుందా?
రమ: గర్వం ఉంటుంది. ఆయన ఏం గౌతమ బుద్దుడు కాడు. సెయింట్‌ అసలే కాదు. ఇంత పెద్ద సక్సెస్‌ సాధించిన తర్వాత చిన్నపాటి గర్వం లేకుండా ఎలా ఉంటుంది? రాజమౌళి సక్సెస్‌ చూసి, నాకూ గర్వంగా ఉంటుంది.

♦  ‘బాహుబలి’ కోట్ల బడ్జెట్‌తో తీసిన మూవీ. పార్ట్‌ 1 పెద్ద సక్సెస్‌ అయింది కాబట్టి ఓకే. లేకపోతే ఏంటి? అనే టెన్షన్‌ ఉండేదా?
రమ: ఈ సినిమాకి మాత్రమే కాదు. ప్రతి సినిమాకీ నేను ఆందోళన పడతాను. ఇప్పుడు కూడా టెన్షన్‌లో ఉన్నాను. నా భయాన్ని మాటల్లో చెప్పలేను. కడుపు మెలి తిప్పిన ఫీలింగ్‌. కానీ ఎక్కువసేపు ఇదే మూడ్‌లో ఉండను. తర్వాత పక్కకు నెట్టేసి హ్యాపీ మూడ్‌లోకి వచ్చేస్తాను. రాజమౌళి మెదడుకు ఖాళీయే ఉండదు. షూటింగ్‌ చేస్తాడు. ఫుల్‌గా అలసిపోతాడు. హాయిగా నిద్రపోతాడు. అస్సలు భయపడడని కాదు, ఉంటుంది. కానీ నాకున్నంత భయం ఆయనకు ఉండదు. నేనెక్కువగా ఖాళీగా ఉంటాను కదా. అందుకే ఎక్కవగా ఆలోచించి అలా భయపడుతుంటాను.

ఫైనల్లీ... మీది పెద్ద ఫ్యామిలీ. అందరూ ఎంతో క్లోజ్‌గా ఉంటారు. మీలోని మంచి ‘హోమ్‌ మేకర్‌’ అందరూ కలసి మెలసి ఉండేలా చేస్తుందనుకోవచ్చా?
రమ: కీరవాణిగారిల్లు, మా ఇంటికి కొంచెం దూరంలో ఉంది. మేం ఐదు కుటుంబాలు ఒకే అపార్ట్‌మెంట్లో ఉంటాం. కుటుంబ సభ్యులంతా కలసి మెలసి ఉండటానికి ఎవరో ఒకరు ఇనిషియేట్‌ తీసుకోవాలి. అది నేనవుతాను. పండగలంటే అందరం కలసి చేసుకోవాల్సిందే. ఆ టైమ్‌లో మేం ఓ 50 మంది వరకూ ఉంటాం. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించినప్పుడు మనస్పర్థలకు తావు ఉండదు.
– డి.జి. భవాని

బాహుబలి’ కోసం పని చేసిన మీ కుటుంబ సభ్యుల గురించి?
రమ:  మా పెద మామగారు శివశక్తి దత్తా, మా పిన మామగారు రామకృష్ణ పాటలు రాశారు. మా మామగారు విజయేంద్రప్రసాద్‌ కథ ఇచ్చారు. కీరవాణిగారు పాటలు ఇచ్చారు. కల్యాణి కోడూరి సౌండ్‌ మిక్సింగ్‌ చేశారు. నేను సై్టలిస్ట్‌గా చేశా. నా సిస్టర్‌ వల్లి లైన్‌ ప్రొడ్యూసర్‌. మా అబ్బాయి కార్తికేయ సెకండ్‌ యూనిట్‌ డైరెక్టర్‌. కీరవాణిగారి పెద్దబ్బాయి భైరవ పాటలు పాడాడు. కీరవాణిగారి రెండో అబ్బాయి శ్రీసింహా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాడు. రామకృష్ణగారి అబ్బాయి రాజబలి వీఎఫ్‌ఎక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో చేశాడు. కల్యాణి కోడూరి అబ్బాయి మయూర్‌ ఒక బిట్‌కి డబ్బింగ్‌ చెప్పాడు. మూడు తరాలు పని చేశాం.

కార్తికేయ బలం అదే!
మీ అబ్బాయి కార్తికేయ కూడా డైరెక్టర్‌ అవుతారా?
రమ:  ‘బాహుబలి’కి కార్తికేయ సెకండ్‌ యూనిట్‌ డైరెక్టర్‌గా చేశాడు. తనకు డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ సూట్‌ కాదు. ప్రొడక్షన్‌లో కెరీర్‌ బిల్డ్‌ చేసుకోవాలనుకుంటున్నాడు. సిచ్యుయేషన్స్‌ని హ్యాండిల్‌ చేయడంలో కార్తికేయ బెస్ట్‌. అదే అతని బలం. డైరెక్టర్‌కు ఉండాల్సినంత ఫోకస్‌ వాడికి లేదు. చాలా కష్టపడతాడు. అయితే స్థిరంగా ఒక చోట కూర్చొని పని చేయలేడు. అయినా సెకండ్‌ యూనిట్‌ డైరెక్టర్‌గా ఎలా చేయగలిగాడంటే రాజమౌళికి ఏం కావాలో కార్తికేయ బాగా అర్థం చేసుకోగలడు.

తన మనసును కార్తికేయ చదవగలడు. ఈ సినిమా మొత్తం జనాలే. వాళ్లందర్నీ బాగా కంట్రోల్‌ చేశాడు. సెకండ్‌ యూనిట్‌ డైరెక్ట్‌ చేశావు కదా. డైరెక్టర్‌ అవుతావా అనడిగితే... ‘ఇప్పుడింకా క్లారిటీ వచ్చింది. డైరెక్షన్‌లోకి అస్సలు వెళ్లను’ అన్నాడు. నాకేం కావాలో పిల్లలు అది అవ్వాలని ఎప్పుడూ బలవంతపెట్టలేదు, పెట్టను కూడా. కానీ, వాళ్ల బలాబలాలు ఏంటో వాళ్లకు చెబుతుంటాను.

మీ నాన్న (రాజమౌళి)గారు టోటల్‌గా ‘బాహుబలి’కే డెడికేట్‌ కావడం కోపంగా అనిపించిందా?
మయూఖ: నాన్నగారు చాలా కష్టపడతారు. రెండు నిమిషాలు టైమ్‌ ఉన్నా నాతో ఆప్యాయంగా మాట్లాడతారు. ఒక పెద్ద ప్రాజెక్ట్‌ చేస్తున్నారని నాకు తెలుసు. అందుకే కోపం లేదు.

ఇంతకీ అమరేంద్ర బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో మీకు తెలుసా?
మయూఖ: అది మాక్కూడా తెలియదు. నాన్న చెప్పలేదు. స్కూల్లో ఫ్రెండ్స్‌ కూడా ఈ విషయం గురించి అడుగుతుంటారు.
కుముద్వతి: ఆ విషయం తెలుసుకోవాలని మాకూ ఉంది.

♦  ప్రభాస్‌ని పరిచయం చేయమని ఫ్రెండ్స్‌ అడుగుతారా?
కుముద్వతి: ఆటోగ్రాఫ్‌ కావాలని అడిగితే, ప్రభాస్‌ అన్నయ్య దగ్గర సైన్‌ పెట్టించుకు వెళ్లాను. నా ఫ్రెండ్స్‌ చాలా హ్యాపీ ఫీలయ్యారు.
మయూఖ: నా ఫ్రెండ్‌ యుక్తీకి ప్రభాస్‌ అన్నయ్య అంటే ఇష్టం. ఒకసారి లొకేషన్‌కి తీసుకెళితే ఫొటో దిగింది.

పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు?
మయూఖ: నాకు సింగర్‌ అవ్వాలని ఉంది. కర్ణాటక మ్యూజిక్‌ నేర్చుకుంటున్నాను. మ్యూజిక్‌లో నాకు మా పెదనాన్న కీరవాణిగారు, హాలివుడ్‌లో ‘రాక్‌మై బ్యాండ్‌’ ఇష్టం.
కుముద్వతి: ఏమో ఇంకా ఏం డిసైడ్‌ చేసుకోలేదు.

కీరవాణిగారు ఇటీవల తాను చాలామంది ‘బ్రెయిన్‌లెస్‌ డైరెక్టర్స్‌’తో సినిమాలు చేశానంటూ ఘాటుగా స్పందించడం వెనక ఏదో పెద్ద బాధే ఉండి ఉంటుందనిపిస్తోంది. ఆ బాధ గురించి కుటుంబ సభ్యులతో పంచుకున్నారా?
రమ:  లేదు. ఏదో ఒక విషయంలో ఆయన ఎక్కువ బాధపడి ఉంటారు. ఆయన జీవితంలో ఎన్నో బరువు, బాధ్యతలను మోసారు అన్న విషయం మర్చిపోకూడదు. ఆయన ఫీలయ్యారు కాబట్టి అలా స్పందించారు. ప్రతి మనిషికీ లోలోపల ఏదో íఫీలింగ్‌ ఉంటుంది. ఆ ఫీలింగ్‌ ఎప్పుడో ఒకసారి బయటకు వస్తుంది. ఇప్పుడు వచ్చింది.

అంత ఘాటైన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నది కొందరి అభిప్రాయం... మరి మీ ఇంట్లో?
రమ:  మనం చేసే ప్రతి పని అందరికీ నచ్చాలని లేదు. నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఎవరేం చేయాలనుకుంటే అది చేస్తే మంచిది. అందుకే ‘ఇది సరి కాదు’ అనే చర్చ మా మధ్య రాదు. మా కుటుంబ సభ్యులకు మేం ఎప్పుడూ సపోర్ట్‌గానే ఉంటాం.

అప్పుడు నాకు మూడేళ్ల వయసుంటుందేమో! ఓ రూపాయి కావాలని అమ్మను అడిగా. సరే, ఇస్తానంది. అప్పుడు మా ఇంట్లో ఓ బ్లూ స్కూటర్‌ ఉండేది. ఎక్కడా మట్టి లేకుండా శుభ్రంగా ఆ స్కూటర్‌ను కడిగి రూపాయి తీసుకోమని చెప్పింది. పెద్దయిన తర్వాత ఆలోచిస్తే... కష్టపడితేనే డబ్బులు వస్తాయని నాకు అర్థమవడానికి అప్పుడలా అమ్మ ప్రాక్టికల్‌గా చూపించిందనిపించింది.

కుటుంబ విలువలు కాపాడుకోవడానికి కూడా అంతే కష్టపడాలని చెప్పింది. అమ్మ ఎవర్నీ ఎక్కువ.. తక్కువగా చూడదు. ‘మనిషి చేసే ప్రతి పనికి విలువుంటుంది. ఎవర్నీ ఎక్కువ తక్కువగా చూడకూడదు’ అని తను ఆచరించేదే నాకు చెప్పింది. ప్రతి అంశాన్ని డబ్బుతో కాకుండా మానవీయ కోణంలో చూస్తుంది. ఈ రోజు నేనిలా ఉన్నానంటే అమ్మ నేర్పిన విలువలే కారణం. అమ్మను చూసి నేనెంతో నేర్చుకున్నాను.   – ఎస్‌.ఎస్‌. కార్తికేయ

మనిషిని మనిషిగా చూడాలనీ, అందరితో సమానంగా మెలగాలనే గొప్ప గుణాన్ని పెద్దమ్మ దగ్గర్నుంచి నేర్చుకున్నాను. అలాగే, ఫ్యామిలీ లైఫ్‌ను ఎలా మేనేజ్‌ చేయాలనేది పెద్దమ్మ నుంచి నేర్చుకున్నాను. – శ్రీ సింహ

నైతికంగా పెద్దమ్మ నాకు కొండంత అండ. నేను ఉన్నత స్థితికి చేరతానని నాపై కాన్ఫిడెన్స్‌ ఉన్న వ్యక్తుల్లో పెద్దమ్మ ఒకరు. ‘షి వాజ్‌ అండ్‌ ఈజ్‌ ఆల్వేస్‌ దేర్‌ విత్‌ మి’. నేననే కాదు... ఎవరైనా ఏదైనా పని చేస్తుంటే ఎంతో మోరల్‌ సపోర్ట్‌ ఇస్తుంది. పెద్దమ్మ నాకే కాదు... ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్‌. – కాలభైరవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement