నస.. బుస..! | ready to breakup party will wake up .. | Sakshi
Sakshi News home page

నస.. బుస..!

Published Mon, Feb 6 2017 11:22 PM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM

నస.. బుస..!

నస.. బుస..!

రైట్‌ టైమ్‌
లేవండి.. బ్రేకప్‌ పార్టీకి రెడీ అవ్వండి
అతడు మీ పాస్‌వర్డ్‌ అడుగుతున్నాడా?
ఆమె మీ ‘వాట్సప్‌ లాస్ట్‌ సీన్‌’ కోసం పట్టు పడుతోందా?
మీరు ఆఫీస్‌ పనిలో బిజీగా ఉన్నప్పుడు అతడు
అదే పనిగా మీకు ఫోన్‌ చేస్తూ మిమ్మల్ని ‘డ్రిల్‌’ చేస్తున్నాడా?
అయితే, బ్రేకప్‌ గురించి ఆలోచించవలసిన టైమ్‌ వచ్చేసిందనే!
శుభమా అంటూ వాలెంటైన్స్‌ డే దగ్గరపడుతుంటే..
ఈ బ్రేకప్‌ ప్రీచింగ్‌ ఏంటి అంటారా?! ప్రీచింగ్‌ కాదు.. టీచింగ్‌ కాదు.
ప్రేమకు వేళయినట్లే... సమ్‌టైమ్స్‌.. బ్రేకప్‌కీ వేళవుతుందని చెప్పడం.


ప్రేమలో పడినప్పుడు అన్నీ వదులుకుంటాం. మన టైమ్, మన మనీ, మన ఇష్టాలు.. ఆఖరికి మన వ్యక్తిత్వం కూడా! నిజానికి అది మన తప్పు కాదు. పవర్‌ ఆఫ్‌ లవ్‌! ప్రేమలో ఉన్నప్పుడు మన పార్ట్‌నర్‌లోని లోపాలను కూడా ప్రేమిస్తాం. కోపాలనూ భరిస్తాం. ఉట్టి పుణ్యానికి తిట్లు తింటున్నా, నిందలు పడుతున్నా చిరునవ్వుతో స్వీకరిస్తాం. కానీ అన్నిసార్లూ అలా సాధ్యం కాదు. మాటలు పడీపడీ సడెన్‌గా చికాకు పడిపోతాం. ‘ఈ లైఫ్‌ నాది కదా’ అనుకునేంతగా ప్రేమ నుంచి వేరైపోతాం! దీనికి కారణం ప్రేమ తగ్గిపోవడం కాదు. నస ఎక్కువవడం! అది మన ఫస్ట్‌ లవ్‌ కావచ్చు. మన ఫస్ట్‌ రిలేషన్‌షిప్‌ కావచ్చు. కానీ అంతకంటే ముందే మనతో మనకు లవ్, రిలేషన్‌షిప్‌ ఏర్పడి ఉంటాయి! అందుకే.. ఆ లవ్‌కి, ఆ రిలేషన్‌షిప్‌కి భంగం కలిగించే బయటి లవ్‌ని, బయటి రిలేషన్‌షిప్‌ని వదిలేసుకోడానికి సిద్ధమైపోతాం. అది మన ప్రేమ తప్పు కాదు. మన పార్ట్‌నర్‌ తప్పు. ఏమైనా జీవితానికి సంతోషం ముఖ్యం. అది ప్రేమలో దొరికితే మరీ సంతోషం. బ్రేకప్‌తో మాత్రమే దొరుకుతుందనిపిస్తే.. ప్రేమ కోసం చూసుకోనక్కర్లేదు. బ్రేకప్‌ పార్టీ ఇచ్చేయడమే!   

బ్రేకప్‌కి టైమ్‌ దగ్గర పడిందనడానికి   పది సంకేతాలు
1    మీ పార్ట్‌నర్‌ మీ ఫోన్‌ని ప్రతి రోజూ జల్లెడ పట్టేస్తున్నారా?
2    మనిద్దరికీ ఒకే పాస్‌వర్డ్‌ ఉండాలని మీ పార్ట్‌నర్‌ సతాయిస్తున్నారా?.
3    మీ ఇద్దరి మధ్యా గొడవ జరిగిన ప్రతిసారీ మీ పార్ట్‌నర్‌ మీ ‘ఎక్స్‌’ పార్ట్‌నర్‌ ఊసెత్తుతున్నారా?
4    మీకు ఇష్టం లేని పనులను తన ఇష్టం కోసం చెయ్యమని తరచు మిమ్మల్ని బలవంతం చేస్తున్నారా?
5    ఎంతో కాలంగా అడుగుతున్నా మీకు తన ఫ్రెండ్స్‌ను పరిచయం చేయడానికి తటపటాయిస్తున్నారా?
6 మీ పార్ట్‌నర్‌ చుట్టూతే మీ పర్సనల్‌ లైఫ్‌ అంతా తిరుగుతున్నట్లు మీకు అనిపిస్తోందా?
7 మీరు వేసుకునే బట్టల గురించి మీ పార్ట్‌నర్‌ పదే పదే నెగటివ్‌గా మాట్లాడుతున్నారా? లైక్‌... నా పక్కన వచ్చేటప్పుడు ఇలాంటి బట్టలు వేసుకోవద్దు, అలాంటి బట్టలు వేసుకోవద్దు... అని!
8    మీరు మాట్లాడే ప్రతి ఒక్కరితో మిమ్మల్ని కలిపి, మీ పార్ట్‌నర్‌ మీ గురించి అనుమానంగా మాట్లాడుతున్నారా? అసూయ పడుతున్నారా?
9    మీరు తనకే దక్కాలనీ, మీ అటెన్షన్‌ అంతా తన మీదే ఉండాలని మీ పార్ట్‌నర్‌ కోరుకుంటున్నారా?
10 చిన్న వాదులాటకు కూడా మన విడిపోదాం అని మీ పార్ట్‌నర్‌ అంటున్నారా?
ఈ ‘సుగుణాలలో’ ఏ ఒక్క సుగుణం మీ పార్ట్‌నర్‌లో కనిపించినా.. మీరు మీ రిలేషన్‌షిప్‌కి ‘థమ్స్‌డౌన్‌’ ఇచ్చే ఆలోచన చేయడం మంచిది. ఇప్పటికే ప్రేమతో చాలా ఇచ్చేసి ఉంటారు. వాటిల్లో థమ్స్‌డౌన్‌ కూడా ఒకటి అనుకుని ఇచ్చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement