రియల్ ఎస్టేట్‌పై లోతైన చూపు ‘భూచక్రం’
ఈ దేశంలో నేలను నమ్ముకున్న వాడికంటే నేలను అమ్ముకున్న వాడిదే ఎప్పుడూ పై చేయి కావడం ఒక పెను విషాదం. గ్రామాలు కూడా పట్టణాలుగా అవతరించాలని ఉబలాటపడుతున్న తరుణంలో నేల రియల్ ఎస్టేట్‌గామారిపోవటం వర్తమాన సత్యమంటారు మధురాంతకం నరేంద్ర తన ‘భూచక్రం’ నవలలో. విస్తరిస్తున్న తిరుపతి పట్టణం శివారు భూముల్ని రియల్ ఎస్టేట్‌గా మార్చుతున్న వైనంపై గతంలో ‘రెండేళ్లు పద్నాలుగు’ పేరుతో ఓ కథా సంకలనం వెలువరించారాయన. ఇందుకు తిరుపతిలో శ్రామికుల జీవనమే నేపథ్యం. దాని కొనసాగింపే ఈ ‘భూచక్రం’ నవల. ఇక్కడ కూడా తిరుపతి పట్టణమే నేపథ్యం.
తిరుపతి పట్టణం అనాదిగా మఠాలకు, మఠాధిపతులకు ప్రసిద్ధి. ఒక వందేళ్ల క్రితం చిన్న ఊరుగా ఉన్న తిరుపతి ఆ ఏడుకొండల స్వామికి సమర్పణగా అనేక మంది జమీందార్లు వివిధ మఠాలకు భూములను ఇనాంగా ఇవ్వటంతో తిరుపతి పట్టణంగా ఎదిగిందన్నది ఈ నవల నిరూపించే సత్యాలలో ఒకటి. అందుకే కథనం ఈనాటి రియల్ ఎస్టేట్ వ్యవహారంతో మొదలుపెట్టి వందేళ్లు వెనక్కు వెళుతుంది. కథ నడిచే కొద్దీ మఠాధిపతులకీ రియల్ ఎస్టేట్ బ్రోకర్లకీ పెద్ద తేడా లేదని బోధపడుతుంది. ఈ చక్రవ్యూహంలో కష్టించి పని చేసే రైతు ఎప్పుడూ పరాజితుడే.
అమిత్‌రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీరు తిరుపతిలోని మామగారి ఆస్తుల్ని విక్రయిద్దామనే కోరికతో భార్యతో కలసి తిరుపతి రావటంతో ప్రారంభమవుతుంది నవల. విక్రయం ఉన్న చోట బ్రోకర్ ఉంటాడు కనుక రియల్ ఎస్టేట్ బ్రోకర్ శేషారెడ్డి తారసపడతాడు. అమిత్ రెడ్డి, శేషారెడ్డి కలసి ఆస్తిపత్రాల వెతుకులాటలో మరో పెద్ద బ్రోకర్ వద్దకు వెళతారు. అసలు ఈ ఆస్తి ఎవరిది, అది అమిత్‌రెడ్డి మామగారి ముందు తరాలకు ఎలా సంక్రమించింది అనే గతాన్ని చెప్పటం మొదలుపెడుతుంది ఆ ఇంట్లోని వేపచెట్టు. ఇలా కథ వందేళ్ల వెనక్కు వెళ్లి పొలంగా ఉన్న భూమి ప్లాట్లుగా మారిన వైనం చూపుతుంది. ఈ క్రమంలో అనేక పాత్రలు ప్రవేశిస్తాయి. కిస్తీల పేరుతో కౌలు రైతుల్ని వేధించే మహంతులు, స్త్రీ లోలత్వాన్ని జయించలేని మహంతులు మనకు తారసపడతారు. ఆనాటి కుట్రలు. కుతంత్రాలు మన ముందు వాలతాయి. ఇంత కథా చెప్పిన వేపచెట్టును నిలువునా కూల్చడంతో నవల ముగుస్తుంది. స్త్రీ లోలత్వం, ధనకాంక్షలతో పతనావస్థకు చేరుకున్న సమాజం నేలతల్లి మీద రియల్ ఎస్టేట్ రూపంలో దండయాత్ర చేస్తోందన్నది ‘భూచక్రం’ అంతరార్థం.
ఇలాంటి కాంప్లెక్స్ కథని చెప్పటంలో నైపుణ్యం కావాలి. కథనంలో ఉత్కంఠ ఉండాలి. నాటి, నేటి వాతావరణాన్ని పట్టుకోగలగాలి. ఆ నేర్పును, స్కిల్‌ను రచయిత పూర్తి స్థాయిలో ప్రదర్శిస్తారు. శేషాచలం కొండలు, అలిపిరి దారి మార్గం, వేపచెట్టు మీద కూసే కోకిలలు, మట్టిబాటపై ధూళి మేఘాలు సృష్టించే బొగ్గు బస్సు, కదను తొక్కే వైశాఖమాసపు ఎండ, పుష్యమాసం మధ్యాహ్నం గాలులు... వీటన్నింటినీ కథనంలో జొప్పించి మార్మికతను, మాదకతను పెనవేస్తారు. ఫలితంగా పాఠకుడు ఒక పారవశ్యానికి లోనవుతాడు. పాత్రలన్నీ చిక్కని చిత్తూరు మాండలీకాన్ని అందిపుచ్చుకుంటాయి. ఇంత మంచి నవలను ముఖచిత్రం చిన్నబుచ్చకుండా ఉంటే ఇంకా బాగుండేది.
- సిఎస్ రాంబాబు 9490401005