అపోహ: చాలాసేపు పనిచేశాక రిలాక్స్ అవడంలో భాగంగా చాలా మంది వేళ్లను విరుస్తుంటారు. ఇలా వేళ్లను వెనక్కి విరవగానే చిటుకూ... చిటుకూ అని ఓ శబ్దం వినిపించడం మనందరికీ అనుభవమే. అలాగే కొద్దిసేపటి వ్యవధిలోనే మళ్లీ రెండోసారి విరిస్తే ఈసారి అదే చిటపట శబ్దం రాదు. ఇలా... మరికాసేపటి తర్వాత రెండోసారి విరిచినప్పుడు ఎందుకు చిటపటలాడలేదు, ముందెందుకు శబ్దం చేశాయి, దీనివల్ల ఏదైనా ప్రమాదమా... అనే అపోహ కొందరిలో ఉంటుంది.
వాస్తవం: చేతి వేళ్ల కీళ్లు పట్టేశాక వాటిని విరిచినప్పుడు చిటుక్కుమని శబ్దం చేయడం వల్ల ఎలాంటి అనర్థమూ వాటిల్లదు. దాంతో ఏదైనా ముప్పు కలుగుతుందన్నది అపోహ మాత్రమే. వేళ్ల కణుపుల దగ్గర (ఆ మాటకొస్తే ప్రతి కీలు దగ్గర) సైనోవియల్ ఫ్లూయిడ్ అనే కందెన లాంటి పదార్థం ఉంటుంది. వేళ్లలో కీళ్లమధ్య ఈ ఫ్లూయిడ్ చేరి, అక్కడున్న వాయువులతో ఓ చిన్న బబుల్‌లా ఏర్పడుతుంది. మనం వేళ్లను విరిచినప్పుడు, వాయువుతో నిండిన ఆ చిన్నచిన్న బుడగలు చటుక్కున పేలినట్లవుతాయి. వేళ్లు విరిచినప్పుడు మనం వినే శబ్దం ఆ బుడగలు పేలినప్పుడు వచ్చేదే. దీనివల్ల ఎలాంటి అనర్థమూ ఉండదు. ఒకసారి విరిచాక బబుల్స్ పగిలి, అవి మళ్లీ ఏర్పడటానికి కొంత సమయం తీసుకుంటుంది. అందుకే మళ్లీ విరిస్తే శబ్దం రాదు.
Comments
Please login to add a commentAdd a comment